వాళ్ల ఆశలన్నీ నాని పైనే…

నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం జెంటిల్‌మ‌న్‌ సెన్సార్ పూర్త‌యింది. ఈ నెల 17న విడుద‌ల కానుంది. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. ‘అష్టా చమ్మా’ తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత  నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చిత్ర‌మిది.  ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా న‌టించిన ఈ చిత్రంలో సరికొత్తగా కనిపించబోతున్నాడు నాని. తాజాగా విడుదలైన కృష్ణగాడి వీరప్రేమగాథ హిట్ అవ్వడంతో పాటు.. జెంటిల్ మన్ సినిమాలో నాని విలన్ గా కనిపిస్తాడా.. హీరోగా కనిపిస్తాడా అనే అంశం కూడా సినిమాపై అంచనాల్ని పెంచేలా చేసింది. మరో వైపు మేకర్స్ మాత్రం ఆ ఒక్కటి అడగొద్దని తప్పించుకుంటున్నారు. సినిమా చూస్తే నానిలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో అర్థమవుతుందని… అసలు జెంటిల్ మన్ అనే టైటిల్ ఎందుకు పెట్టామో కూడా తెలుస్తుందని ఊరిస్తున్నారు. ఈ సినిమా సంగతెలా ఉన్నా… ఈ విజయం మాత్రం కచ్చితంగా ఇద్దరికి అత్యవసరం. దర్శకుడు ఇంద్రగంటి కెరీర్ ఊపందుకోవాలంటే కచ్చితంగా జెంటిల్ మన్ హిట్టవ్వాలి. మరోవైపు మణిశర్మ కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే.. సంగీత దర్శకుడిగా మరోసారి బిజీ అవుదామని చూస్తున్నాడు మణి. హీరోయిన్లు సురభి, నివేది థామస్ కూడా జెంటిల్ మన్ పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.