వివేక్ వ‌స్తే..సుమ‌న్ గ‌తేంటి?

పెద్ద‌ప‌ల్లి మాజీ ఎంపీ వివేక్ త్వ‌ర‌లోనే తెలంగాణ రాష్ట్ర స‌మితిలో చేర‌తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ ఓ ఎంపీ గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి.. అయన మ‌రెవ‌రో కాదు! ప్ర‌స్తుత పెద్ద‌ప‌ల్లి ఎంపీ బాల్క‌సుమ‌న్‌. ద‌శాబ్దాలపాటు పెద్ద‌ప‌ల్లి ఎంపీ స్థానంలో వివేక్ తండ్రి జి. వెంక‌ట‌స్వామి ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హించారు. ఆయ‌న వార‌స‌త్వంగా 2009లో వివేక్ కూడా ఇక్క‌డ నుంచే ఎంపీగా పోటీ చేసి గెలిచారు.
ద‌ళిత నాయ‌కుడే సీఎం అన్న కేసీఆర్ పిలుపుతో 2014 ఎన్నిక‌ల ముందు వివేక్ తెలంగాణ రాష్ట్ర స‌మితికి  కొంత‌కాలం స‌న్నిహితంగా కొన‌సాగారు. కానీ, సీఎం ప‌ద‌విపై ఎలాంటి హామీ ల‌భించ‌క‌పోవ‌డంతో ఆయ‌న తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. టీఆర్ ఎస్ గాలి బ‌లంగా వీయ‌డంతో బాల్క‌సుమ‌న్ ఎలాంటి ప్ర‌చార‌మూ లేకుండా వివేక్ పై సునాయాసంగా విజ‌యం సాధించాడు. ఈ విజ‌యాన్ని వివేక్ ముందుగానే ఊహించాడు. ఇది గాలివాట‌పు గెలుపేన‌ని, అందుకే తాను ఇక్క‌డ నుంచే మ‌రోసారి పోటీ చేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాడు. అందుకే, ఇటీవ‌ల వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు స్థానానికి క‌డియం రాజీనామా చేసిన స‌మ‌యంలోనూ వివేక్ ను పోటీ చేయాల‌ని ఇటు కాంగ్రెస్‌, అటు టీఆర్ ఎస్ కోరాయి. త‌న సెగ్మంటును వ‌దిలి వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌ని వివేక్ తేల్చి చెప్పాడు. పోగొట్టుకున్న చోటే రాబ‌ట్టుకోవాల‌న్న పాల‌సీనే న‌మ్ముకున్నాడు.
రెండు లాభాలు..
పెద్ద‌ప‌ల్లి ఎంపీ స్థానంపై వివేక్ కు హామీ ల‌భించింద‌ని, అందుకే, టీఆర్ ఎస్‌లో చేరేందుకు నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం.  ఈ ప‌రిణామంతో వివేక్ కు రెండు లాభాలు జ‌రుగుతాయి. పెద్ద‌ప‌ల్లి సెగ్మెంటులో త‌న స్థానాన్ని ప‌దిల ప‌రుచుకోవ‌చ్చు. రెండోది పార్టీకి త‌న ఛాన‌ల్ ద్వారా కావాల్సినంత మైలేజీని ఇప్పించ‌వచ్చు. అంటే.. ఒక్క‌దెబ్బ‌కు రెండుపిట్ట‌ల్లన్న‌మాట‌! ఇక కుటుంబ ప‌రంగా వివేక్ కు జ‌రిగే మ‌రో లాభం ఏంటంటే.. త‌న అన్న వినోద్ కు కూడా అసెంబ్లీ టికెట్‌పై హామీ దొర‌క‌డం. దీంతో వివేక్ సోద‌రుల చేరిక వాస్త‌వ‌మైతే… సుమ‌న్‌కు చెక్ పెడుతూనే.. కుటుంబం, రాజ‌కీయ ప్రాబ‌ల్యాన్ని కాపాడుకునేందుకు వీరు భారీ ప్లాన్‌లోనే ఉన్నార‌నిపిస్తోంది.