బాలీవుడ్ బాట పట్టిన పంచ్ రచయిత

టాలీవుడ్ లో పంచ్ డైలాగులకు పెట్టింది పేరు కోన వెంకట్. అయితే పంచ్ ల ట్రెండ్ ముగిసిపోవడంతో.. కోన కెరీర్ కూడా అదోలా తయారైంది. దీంతో అన్నీతానై ఈమధ్య సినిమాలు తెరకెక్కిస్తున్నాడు కోన వెంకట్. ఇందులో భాగంగా తీసిన గీతాంజలి హిట్ అయినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన శంకరాభరణం ఫ్లాప్. దీంతో ఇప్పుడు బాలీవుడ్  పై కన్నేశాడు ఈ వైరైటీ రచయిత. ఇప్పటికే కోన వెంకట్ నిర్మాణంలో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘అభినేత్రి’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉండగానే, మరో క్రేజీ ప్రాజెక్టుకు కోన వెంకట్ రంగం సిద్ధం చేశారు. అది కూడా ఓ బాలీవుడ్ స్టార్ తో కావడం విశేషం.
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ హీరోగా నటించనున్న సినిమాను కోన వెంకట్ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని కోన వెంకట్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ.. అభిషేక్ బచ్చన్ – ప్రభుదేవా లతో కలిసి సినిమా చేయబోతున్నానని ప్రకటించారు. ఈ సినిమాను ప్రభుదేవా తన స్టైల్లో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారని సమాచారం. దీనికి కథ, స్క్రీన్ ప్లే కోన అందిస్తున్నాడు.