“జెంటిల్ మన్” సినిమా రివ్యూ

టైటిల్ :  “జెంటిల్ మన్” మూవీ రివ్యూ
రేటింగ్: 2.75
తారాగణం :  నానీ, సురభీ, నివేద థామస్ తదితరులు
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : ఇంద్రగంటి మోహన్ కృష్ణ
నిర్మాత :  శివలెంక కృష్ణ ప్రసాద్
కెమరా : పీ.జి.విందా

మనుషులను పోలిన మనుషులు ఏడుగురుంటారని అంటారు. మనుషులు ఒకే పోలికలతో వుంటే ఎలా వుంటుందనే విషయం శతాబ్దాలుగా సాహిత్యాన్ని ఆకర్షిస్తూ వుంది. కృష్ణుడిగా అలంకరించుకుని తానే కృష్ణుడని నమ్మించిన పౌండ్రక వాసుదేవుడి కథ మహాభారతంలో వుందని అంటారు. మనుచరిత్రలో డూప్లికేట్‌ ప్రవరాఖ్యుడు వరూధిని కొంప ముంచుతాడు. నకిలీ గౌతముడి వల్ల అహల్యకి ఏం జరిగిందో మనకు తెలుసు.

ఈ డబుల్‌ యాక్షన్‌ పై షేక్‌స్పియర్‌కి చాలా మోజు. కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌ని ఎన్ని సినిమాలు తీసారో లెక్కేలేదు. ఒకే పోలికలతో వున్న అన్నా చెల్లెలు కథాంశంతో కూడా ఆయన నాటకం రాసాడు. మన సినిమా పుట్టినప్పటినుంచి ఒకే పోలికలు వున్న వ్యక్తులతో లవ్‌స్టోరీలు, కామెడీలు తీసారు. థ్రిల్లర్‌లు కొంచెం తక్కువగానే తీసారు. వెనకటికి శత్రుష్నుసిన్హాతో సైతాన్‌ అనే సినిమావచ్చింది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే రొమాంటిక్‌ కామెడీలు బాగా తీస్తాడని పేరున్న ఇంద్రగంటి మోహనకృష్ణ ఈసారి థ్రిల్లర్‌ స్టోరీని నెత్తికి ఎత్తుకున్నారు. ఇలాంటి కథలు బండరాళ్లలాంటివి. ఎత్తుకునేటపుడు ఎలాగో శక్తిని ఉపయోగించి నెత్తికి ఎత్తుకుంటాంగానీ, దించుకునేటపుడు చాలా కష్టపెడతాయి.

థ్రిల్లర్‌కి సెన్సిబులిటీని జోడించాలనుకుంటే గజనిలాగా కథ అతివేగంగా పరిగెత్తాలి. పరిగెత్తి పాలుతాగాలని మోహనకృష్ణ అనుకోలేదు కాబట్టి స్లోనెరేషన్‌ మనల్ని ఇబ్బందిపెట్టి కుర్చీలో అసహనంగా కదిలేలా చేస్తుంది. పైగా ఈ సస్పెన్స్‌ సినిమాలతో సమస్యేమిటంటే మొదటి షో వరకూ మన గుప్పిటని మూసివుంచగలం, తరువాత అందరికి తెలిసిపోతుంది. ఇంతకి కథ ఏమిటంటే…

ఐశ్వర్య(సురభి), కాథరిన్‌ (నివేద) ఇద్దరూ ఫ్లయిట్‌లో కలుసుకుంటారు. క్షణాల్లో స్నేహితులైపోతారు. తమ బాయ్‌ ఫ్రెండ్స్‌ గురించి చెప్పుకుంటారు. ఇద్దరి బాయ్‌ఫ్రెండ్‌ హీరో నానియేనని మనకు క్షణాల్లో తెలిసిపోతుంది. ఇద్దరి లవ్‌స్టోరీలు సరదాగా, మంచి జోక్‌లతో సాగిపోతాయి. గంటసేపు కథ ముందుకు జరగకుండా ఈ ప్రేమ కథలు నడుస్తాయి. ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. ఐశ్వర్య బాయ్‌ఫ్రెండ్‌ నాని వస్తాడు. అతన్ని చూసి కాథరిన్‌ షాక్‌. తన బాయ్‌ ఫ్రెండ్‌ గౌతం చనిపోయాడని తెలిసి ఇంకా షాక్‌.

తరువాత ఒక లేడీ రిపోర్టర్‌ రంగప్రవేశం చేసి గౌతంది హత్య అని అనుమానిస్తుంది. దాంతో కాథరిన్‌ జయ్‌ (ఐశ్వర్య బాయ్‌ ఫ్రెండ్‌ నాని) దగ్గర ఉద్యోగంలో చేరి ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడుతుంది. ఆ తరువాత ఏమైందన్నది సస్పెన్స్‌. ఇంతకూ నాని ఒకడేనా ఇద్దరా? ఏం జరిగిందో వెండి తెరపై చూడాల్సిందే.

ఎప్పుడో 1970 కాలంలో అపరాధ పరిశోధన అనే మంత్లీ వచ్చేది. దాంట్లో వచ్చేవి ఇలాంటి కథలు. పాతచింతకాయ పచ్చడి కథని తీసుకున్నపుడు ఇన్వెస్టిగేషనైనా వేగంగా వుండాలి. అదీలేదు. మూలకథలో వేగం తీసుకురాలేని దర్శకుడు మధ్యలో వెన్నెల కిషోర్ కామెడీని ఆశ్రయించాడు. వెనకటికి సిపాయి చిన్నయ్య అని సినిమా వచ్చింది. ఆ కాలంలోనే ఒకే పోలికలున్న వ్యక్తులపైన అంత బాగా తీసినపుడు ఇప్పుడెందుకు తీయలేక పోతున్నారనేది ప్రశ్న.

మోహన్‌ కృష్ణ సెన్సిటివ్‌ డైరెక్టర్‌. అది మనకి చాలాచోట్ల కనిపిస్తుంది. డైలాగులు చాలా చోట్ల నవ్విస్తాయి. విందా ఫొటోగ్రఫి చాలా బావుంది. రెండుపాటలు బావున్నాయి. హీరోయిన్లు అందంగా వున్నారు. అన్నీ వున్నాయికానీ వుండాల్సింది ఏదో లేదు.

ఎప్పటిలాగే తన భుజాలపై నాని సినిమాని మోసాడు. నివేద బాగా నటించింది. థ్రిల్లర్‌ని చూడాలంటే ప్రేక్షకుల్లో మూడ్‌ క్రియేట్‌ కావాలి. అది జరగలేదు. పైగా ఈ టైప్‌ సినిమాల్ని జనం బోలెడు చూసేశారు. గజ ఈతగాడి పనితనం నదిలో తెలుస్తుంది కాని, దిగుడు బావిలో కాదు. రన్నింగ్‌రేస్‌లో బ్రిస్క్‌వాక్‌ పనికి రాదు. మోహన్‌ కృష్ణ నిస్సందేహంగా టాలెంటెడ్‌. కాని అది ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేయలేకపోయింది. రెండున్నరగంటలు కూచునే ఓపికుంటే చూడొచ్చు. మరీ అంతగా నిరాశపరచదు.

– జి ఆర్‌. మహర్షి