Telugu Global
National

మాలేగాం కేసులో బీజేపీ ముస్లిం వ్యతిరేకత

మాలే గాం బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మంది ముస్లిం యువకులను నిర్దోషులని తేల్చిన న్యాయస్థానం తీర్పును సవాలు చేయాలని మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తొమ్మిది మంది 2006లో జరిగిన బాంబు పేలుళ్లలో నిందితులుగా ఉండే వారు. మాలేగాంలో 2006లోనూ మళ్లీ 2008లోనూ వరస బాంబు పేలుళ్లు జరిగాయి. తొమ్మిది మంది ముస్లిం యువకులు 2006 పేలుళ్లలో నిందితులు. ముస్లిం శ్మశాన వాటిక దగ్గర 2006 సెప్టెంబర్ 8న జరిగిన […]

మాలేగాం కేసులో బీజేపీ ముస్లిం వ్యతిరేకత
X

మాలే గాం బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మంది ముస్లిం యువకులను నిర్దోషులని తేల్చిన న్యాయస్థానం తీర్పును సవాలు చేయాలని మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తొమ్మిది మంది 2006లో జరిగిన బాంబు పేలుళ్లలో నిందితులుగా ఉండే వారు.

మాలేగాంలో 2006లోనూ మళ్లీ 2008లోనూ వరస బాంబు పేలుళ్లు జరిగాయి. తొమ్మిది మంది ముస్లిం యువకులు 2006 పేలుళ్లలో నిందితులు. ముస్లిం శ్మశాన వాటిక దగ్గర 2006 సెప్టెంబర్ 8న జరిగిన పేలుళ్లలో 37 మంది మరణించారు. 125 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం రోజున మసీదులో ప్రార్థనలు ముగియగానే వరసగా మూడు సార్లు బాంబులు పేలాయి.

2008 సెప్టెంబర్ 29న మాలేగాంలోని భికు స్క్వేర్ లో రెండో సారి బాంబు పేలుళ్లు జరిగాయి. ఎల్.ఎం.ఎల్. మోటార్ సైకిల్ లో ఉంచిన బాంబులు పేలడం వల్ల నలుగురు మరణించారు. 79 మంది గాయపడ్డారు. మొదట్లో ఈ రెండు పేలుళ్లపై మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) విచారణ చేపట్టింది. 2006 లో జరిగిన పేలుళ్లకు ముస్లింలు కారణమనుకున్నారు. ఏటీఎస్ మాజీ అధిపతి హేమంత్ కర్కరే నాయకత్వంలోని బృందం ఈ రెండు పేలుళ్లపైన దర్యాప్తు చేపట్టింది. 2008 పేలుళ్లకు హిందూ తీవ్రవాదులు కారణమన్న ఆరోపణలు వచ్చాయి. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, కల్నల్ పురోహిత్ తో సహా 10 మంది హిందూ తీవ్రవాదులను 2008 పేలుళ్లకు బాధ్యులుగా భావించి అరెస్ట్ చేశారు.

ఆ తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మాలేగాం పేలుళ్ల కేసు దర్యాప్తు బాధ్యతను 2011 లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ.)కు అప్పగించింది. స్వామీ అసీమానంద 2008 మాలేగాం పేలుళ్లకు హిందూ తీవ్రవాదులదే బాధ్యత అని 2010 లో అంగీకరించారు. ఆ తర్వాతే దర్యాప్తు బాధ్యత ఎన్.ఐ.ఎ.కు అప్పగించారు.

ఎన్.ఐ.ఎ. 2006 పేలుళ్లలో నిందితులైన ముస్లిం యువకులు నిర్దోషులని తేల్చింది. వారు ఏ.టీ.ఎస్. చేతిలో బలిపశువులయ్యారని భావించింది. ఈ ఏడాది మే 13న 2008 పేలుళ్ల కేసులో అరెస్టయిన సాధ్వి ఠాకూర్ కు కూడా పేలుళ్లతో సంబంధం లేదని తేల్చింది. ఈ పర్యవసానంగా సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఎన్.ఐ.ఎ. కోర్టులో జామీనుకు దరఖాస్తు చేసినప్పుడు ఎన్.ఐ.ఎ. అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఎన్.ఐ.ఎ. కొంత మందిని ఈ రెండు పేలుళ్లలోనూ నిర్దోషులని తేల్చినప్పటికీ రెండు పేలుళ్లకు హిందూ తీవ్రవాదులదే బాధ్యత అని చెప్పింది.

విచిత్రం ఏమిటంటే మహారాష్ట్ర లోని బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం 2006 బాంబు పేలుళ్ల కేసులో ఎన్.ఐ.ఎ. దర్యాప్తు ఫలితాలను అంగీకరించకుండా అంతకు ముందు దర్యాప్తు చేసిన ఏ.టి.ఎస్. దర్యాప్తునే ప్రామాణికంగా తీసుకుని తొమ్మిది మంది ముస్లిం యువకులు నిర్దోషులన్న ఎన్.ఐ.ఎ. నిర్ణయాన్ని సవాలు చేయాలని నిర్ణయించింది. ముస్లిం యువకులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ షిండే గత శుక్రవారం తెలియజేశారు.

తీవ్ర వాద దాడులలో ముస్లిం యువకుల మీద కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ పత్రికా రచయిత, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుదు అశీష్ ఖేతన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముస్లిం యువకులు నిర్దోషులని తేల్చడాన్ని సవాలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని వెల్లడించారు. ఏ.టి.ఎస్. నిందితులను చిత్ర హింసలు పెట్టి చేయని తప్పును వారి చేత ఒప్పించిందని ఖేతన్ వాదిస్తున్నారు.

2006 బాంబు పేలుళ్ల కేసులో ముస్లిం యువకులు నిర్దోషులన్న అంశాన్ని గట్టిగా వ్యతిరేకించిన ఏ.టి.ఎస్. 2008 పేలుళ్ల కేసులో నిందితులైన కొందరు హిందువులను నిర్దోషులని తేల్చినప్పుడు మాత్రం ఏ.టి.ఎస్. కనీసం కేసు విచారణకు కూడా హాజరు కాలేదు. సాధ్వీ ఠాకూర్ జామీను దరఖాస్తును ఇప్పుడు ఎన్.ఐ.ఎ. కూడా వ్యతిరేకించడం లేదు.

First Published:  20 Jun 2016 11:52 PM GMT
Next Story