ఉద్యోగం చేయకుండానే పెన్షన్‌

ఇప్పటివరకు ఇళ్లు లేకుండానే దొంగ డాక్యుమెంట్లతో బ్యాంకులనుంచి రుణాలు పొందిన వారిని చూశాం. మరొకరి పేరుమీద రైతు ఋణాలు తీసుకున్నవారిని చూశాం. ఇప్పుడు దాని తలదన్నేలా ప్రభుత్వ ఉద్యోగం చేయకుండానే పెన్షన్‌ ను పొందుతున్న మాయగాడిని పట్టుకున్నారు పోలీసులు. నకిలీ సర్వీసు బుక్‌, పెన్షన్‌ జిరాక్స్‌ పేపర్లను సృష్టించి ప్రభుత్వ ఉద్యోగం చేయకుండానే ఆరేళ్లుగా పెన్షన్ తీసుకుంటున్నాడు మాయగాడు. నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డికి చెందిన యాహ్యా అనే వ్యక్తి నిర్వాకం ఇది. ప్రభ్యుత్వ అధికారులనే బురిడీ కొట్టించి ఏకంగా ఆరుసంవత్సరాల నుంచి రూ. 5 లక్షలకు పైగా పెన్షన్‌ పొందాడు. ఈ పెన్షన్‌ సరిపోలేదు అనుకున్నాడో ఏమో రెండో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని అడ్డంగా బుక్కయ్యాడు.

యాహ్యా తండ్రి అబ్దుల్లా హాస్టల్‌లో వంట మనిషిగా ఉద్యోగం చేసి 2009లో రిటైర్‌ అయ్యాడు. తండ్రి కాలు విరగడంతో అతని తండ్రి స్థానంలో వంట మనిషిగా చేరాడు యాహ్యా. పలు హాస్టళ్లల్లో ఔట్‌సోర్సింగ్‌ వంటమనిషిగా పనిచేశాడు. అలా కామారెడ్డిలో పనిచేస్తున్న సమయంలో కాంతారావు అనే ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. విధి నిర్వహణలో కాంతారావు మృతిచెందడంతో అతని సర్వీసు బుక్‌, పెన్షన్‌ పేపర్ల జిరాక్స్‌ కాపీలను సంపాదించాడు యాహ్య. ఈ పేపర్లను ఉపయోగింనుకుని కామారెడ్డి బీసీ బాలుర హాస్టల్‌ నైట్‌వాచ్‌మన్‌గా పని చేసి రిటైర్‌ అయ్యానంటూ తన పేరుతో నకిలీ సర్వీస్‌బుక్‌ను, పెన్షన్‌ కమిట్‌మెంట్‌ పేపర్లను తయారుచేసి గ్రాట్యూటీ, పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుని 2010లో మొదటిసారి పెన్షన్‌ పొందాడు యాహ్యా.

ఇదే పద్ధతిలో మరోసారి అబ్దుల్లా పేరు మీద ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దోమకొండ, పెద్ద కొడప్‌గల్ పాఠశాలతోపాటు కామారెడ్డి బీసీ హాస్టళ్లలో నైట్ వాచ్‌మన్‌గా పనిచేసినట్లు, వెల్లుట్లలో 2015 ఆగస్టు 31న రిటైర్ అయినట్లు జిల్లా కోశాధికారి కార్యాలయంలో మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన పత్రాలను, సర్వీస్‌బుక్‌ను వెల్లుట్ల పాఠశాలకు పంపించారు అధికారులు. ఇవి చూసిన ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌, ఇన్‌చార్జి ఎంఈవో వెంకటేశం అవాక్కయ్యారు. వెల్లుట్లలో అసలు ఉన్నత పాఠశాలే లేదని, పెన్షన్‌ పేపర్లలో ఉన్న సంతకాలు తమవి కావని ఎల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ డాక్యుమెంట్లతో పెన్షన్ నొక్కేసిన యాహ్యా తోపాటు, జిల్లా ఆడిటింగ్‌ శాఖ సీనియర్‌ ఆడిటర్లు అమృత్‌కుమార్‌, జోడ్‌మల్‌, కామారెడ్డి ఎస్టీవో ఉద్యోగి భాస్కర్‌ తదితరులను అరెస్టు చేశారు. వీరితో పాటు ఇంకా ఎవరెవరికైనా సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.