యువతి సాహసం

ఒకప్పటి రాజస్థాన్‌ యువరాజయిన ఉర్‌సింగ్‌కు వేట మీద ధ్యాసమళ్లింది. సహచరుల్తో కలిసి వేటకు బయల్దేరాడు. ఉదయం నించీ మధ్యాహ్నం దాకా అడవిలో వేటాడడానికి ఒక్క జంతువు కూడా కనిపించడం లేదు. అందరు విసిగిపోయారు. అంతలో ఒక అడవిపంది కనిపించింది. దానివెంటపడ్డారు. అది ముప్పుతిప్పలు పెట్టింది. కానీ దొరకలేదు. కనిపించకుండా పోయింది. వెతికి వెతికి అలిసిపోయారు.

ఉన్నట్లుండి ఒక భటుడు ‘అడిగో’ అక్కడవుంది చూడండి అన్నాడు. అడవిపంది పరుగెడుతూ కనిపించింది. అందరు వెంటబడ్డారు. అడవిపంది అడవికి అనుకునివున్న ఒక గోధుమపొలంలోకి జొరబడింది. గోధుమ పంట విరగగాచింది. పైరు అరడుగుల ఎత్తువుంది. అడవి పంది పొలంలోకి దూరి అదృశ్యమయిపోయింది.

యువరాజుపోలంలోకి భటులతో బాటు వచ్చాడు. ఎంతవెతికినా అడవిపంది కనిపించలేదు. అంతలో పొలం దగ్గరే వున్న మంచపై వున్న ఒక అమ్మాయి ఎవరది? అంది. యువరాజు నేను యువరాజును అని పరిచయం చేసుకున్నాడు.

మంచిదే కానీ మీరంతా నా సగం పొలం తొక్కి నాశనం చేశారు. అంది. యువరాజు పొరపాటయింది. ఒక అడవిపందిని వేటాడుతూ యిలా రావడం జరిగింది అన్నాడు.

దాంతో ఆ అమ్మాయి నవ్వి ఏమిటి? ఒక అడవిపంది కోసం యింత మంది వచ్చారు? అంది. యువరాజు ఆమె ధైర్యానికి చలాకీ తనానికి ముచ్చట పడ్డాడు.

ఆ అమ్మాయి కాసేపు వుండండి అని పొలంలోకి దిగి మాయమయి పోయింది. పదినిముషాల తరువాత చేతిలో బల్లేంతో పందిని ఈడ్చుకుంటూ వచ్చి మీపందిని మీరు తీసుకెళ్లండి అని పందిని వాళ్ళకిచ్చింది.

ఆమె సాహసానికి బలానికి యువరాజు ఆశ్చర్యపోయాడు. సహచ రులు పందిని తీసుకుని దగ్గరగా వున్న చెట్టుకింద చేరి సాయంత్రానికి దాన్ని వండి తిన్నారు. అందరు కలిసి బయల్దేరారు. అప్పుడే పెద్దకుండ నిండుగా పాలుపితికి నెత్తిన పెట్టుకుని రెండు గేదెల్ని తోలుకుంటూ తన గ్రామానికి వెళ్తున్న అమ్మయిని చూశారు. యువరాజు స్నేహితుల్లో ఒకడు ఆ అమ్మాయిని ఆటపట్టించాలనుకున్నాడు. తను వేగంగా గుర్రం మీద ఎదురై ఆమె తలమీద వున్న పాలకుండను పగలగొట్టి అల్లరి చేద్దామనుకున్నాడు.

ఎదురుగా వేగంగా గుర్రం మీద వచ్చాడు. చురుకైన కళ్ళలో పరిస్థితి గమనించిన ఆ అమ్మాయి అతని గుర్రం తన ముందుకు వచ్చేదాకా మౌనంగా పట్టనట్లు వుండి హఠాత్తుగా ఒక్కసారిగా ఒక గేదెను కదిలించింది. గేదె బెదిరి ముందుకు రావడంతో గుర్రం పట్టు సడలి పక్కకు ఒరిగింది. యువరాజు మిత్రుడు కిందపడ్డాడు. ఆ అమ్మాయి తన దారంట తను వెళ్ళిపోయింది.

దృశ్యాన్ని చూసిన యువరాజు పెళ్ళి చేసుకుంటే యిట్లాంటి అమ్మాయినే పెళ్ళిచేసుకొవాలని మనసులో నిశ్చయించుకున్నాడు.

యువరాజు ఆ రాత్రికి నగరం చేరి ఆ అమ్మాయి గురించే ఆలోచనలో పడ్డాడు. మరుసటి రోజు బయల్దేరి ఆ అమ్మాయి గ్రామానికి వచ్చి ఆ ఆమ్మాయి తండ్రిని పిలిపించి తన కోరిక చెప్పాడు. నేను మీ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటానన్నాడు. ఆ అమ్మాయి తండ్రి కుదరదు అన్నాడు. యువరాజు ఆశ్చర్యపడ్డాడు. దిగులు పడ్డాడు ఆ అమ్మాయి తండ్రి ఒక్క క్షణం ఆగండి అని యింట్లోకి వెళ్ళి కాసేప్పటికి భార్యాకూతుర్లతో బయటికి వచ్చాడు.

మొదట నాకు యిష్టం లేదు. ఆవిషయం యింట్లో చెబితే మా ఆవిడ నాపై మండిపడింది. పైగా మా అమ్మాయి కూడా విమ్మల్ని యిష్టపడింది. యిప్పుడు నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు అన్నాడు. యువరాజు ఆ అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి చిరునవ్వుతో యువరాజును చూసింది.

వాళ్ళ పెళ్ళి చాలా వైభవంతో జరిగింది.

– సౌభాగ్య