ఎదురులేని వైస్ చాన్సలర్ శాసనోల్లంఘన

చట్టం ముందు అందరూ సమానులేనన్న సూత్రానికి తరచుగా తూట్లు పొడవడం పరిపాటి అయిపోయింది. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనన్నది కేవలం నేతిబీరకాయలా మిగిలిపోతోంది. సామాజికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగిన వారు చట్టం ముందు అందరూ సమానులేనన్న సూత్రాన్ని యదేచ్ఛగా ఉల్లంఘిస్తూనే ఉన్నారు. బలవంతుడి మాటే చెల్లుబాటు అవుతోంది.

వివాదాలకు మారుపేరుగా మాత్రమే వార్తలకెక్కే హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పొదిలి అప్పారావు తన సామాజిక వర్గం, రాజకీయ అండ ఆధారంగా ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ షెడ్యూల్డు కులాల, షెడ్యూలు తెగల వారిపై అత్యాచారాల నిరోధ చట్టాన్ని బాహటంగా ఉల్లంఘించినా అడిగే నాథుడే లేకుండా పోయారు. ఆయన వ్యవహార సరళి రాజ్యాంగ మౌలిక సూత్రాలనే ఉల్లంఘించే రీతిలో ఉంది. షెడ్యూల్డు కులాల, షెడ్యూలు తెగల వారిపై అత్యాచారాల నిరోధ చట్టాన్ని ఉల్లంఘించే వారికి మామూలుగా అయితే శిక్ష పడాలి. కాని ప్రజాస్వామ్య హక్కులకోసం పోరాడిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులని ఆయన చట్ట వ్యతిరేకంగా విశ్వవిద్యాలయం నుంచి సస్పెండ్ చేసినా ఏలిన వారు పట్టించుకోలేదు.

hyderabad central university chancellor apparao2002 లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరిన దగ్గరి నుంచి అప్పారావు సామాజిక ఆధిపత్య ధోరణినే ప్రదర్శిస్తున్నారు. ఆయన చీఫ్ వార్డెన్ గా ఉన్నప్పుడు దళిత విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి వెళ్లగొట్టారు. వైస్ చాన్సలర్ అయిన తర్వాత రోహిత్ వేములతో సహా అయిదుగురు ఎస్.సి. పరిశోధక విద్యార్థులను ఇదే రీతిలో విశ్వవిద్యాలయం నుంచి తరిమేశారు. వారు హాస్టళ్లలో ఉండకుండా చేశారు. వారు చెట్ల కింద తలదాచుకోవాల్సి వచ్చింది. ఈ అవమానాలు భరించలేకే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారు. రోహిత్ వేముల ఆత్మ హత్య చేసుకున్నా నిజానికి అది హత్యేనని ఆలోచనాపరులందరూ భావించారు. ఇరవై ఐదు మంది విద్యార్థులను, డా. కె.వై. రత్నం, డా. తథాగత్ సేన్ గుప్తా అనే ఇద్దరు అధ్యాపకులను వైస్ చాన్సలర్ అప్పారావు అరెస్టు చేయించారు. అప్పారావు విశ్వవిద్యాలయాన్ని నిర్వహించడం మానేసి తన అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ విశ్వవిద్యాలయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో అసమ్మతి వ్యక్తం చేయడానికి అవకాశమే లేకుండా పోయింది.

రోహిత్ వేములకు న్యాయం జరగాలని అడిగే వారినందరినీ ఏదో ఒక రకంగా వేధించడమే వైస్ చాన్సలర్ కు నిత్యకృత్యమైంది. అప్పారావుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన తన సామాజిక వర్గ నేత అండదండలున్నందువల్ల ఆయన ప్రజాస్వామ్యాన్ని అణచివేసినా, అణగారిన వర్గాల వారి మీద కసితో ఏ చర్య తీసుకున్నా ప్రశ్నించడానికే వీలులేకుండా పోయింది. చట్టాన్ని ఉల్లంఘించడమే వైస్ చాన్సలర్ ఎకైక లక్ష్యంగా కనిపిస్తోంది.