నాగార్జున మొదలుపెట్టేశాడు…

తనదైన శైలిలో భక్తిరస చిత్రాలను తెరకెక్కిస్తున్న రాఘవేంద్రరావు అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయిబాబా సినిమాల తర్వాత కింగ్ నాగార్జునతో ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డ విషయం తెలిసిందే. ఈ సినిమా శ్రీ వేంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు హథీరామ్ బాబా జీవిత కథతో తెరకెక్కబోతోంది. సినిమా మొదటి రోజు షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైంది. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శ్రీవారి ఆలయం సెట్ రూపొందించారు. ఈ సెట్ లోనే నాగార్జునపై తొలి షాట్ తీశారు. ఆ ఫొటోను కూడా సోషల్ మీడియాలో విడుదలచేశారు. వెంకటేశ్వరుని ఆశీస్సులతో ‘ఓం నమో వెంకటేశాయ’ తొలిరోజు షూటింగ్ మొదలైందని, ఎంతో గొప్ప అనుభూతి కలిగిందని నాగార్జున ట్వీట్ చేశాడు. ఓ అద్భుతమైన, ఆధ్యాత్మికమైన ఫోటోను తొలిరోజే పోస్ట్ చేసి అభిమానులను భక్తి పారవశ్యానికి గురిచేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. ఓం నమో వెంకటేశాయ నామం రాస్తూ, శక్తినివ్వు అని శ్రీవారిని వేడుకుంటూ షూటింగ్ ప్రారంభించామని, శ్రీనివాసుని ఆశీస్సులతో మొదటి రోజు షూటింగ్ చాలా బాగా జరిగిందని నాగార్జున పేర్కొన్నారు. ఇకపై ఈ సినిమా ఏకథాటిగా షూటింగ్ జరుపుకుంటుంది. విమలా రామన్, ప్రగ్యా జైశ్వాల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.