శాతకర్ణిని సగం పూర్తిచేసిన దేవిశ్రీ

చాలా రోజుల నుంచే శాతకర్ణి సినిమా పాటల పనిమీద ఉన్న దేవిశ్రీప్రసాద్… తాజాగా ఆ సినిమా పనిని సగానికి సగం పూర్తిచేశాడు. 3 పాటల్ని పూర్తిచేయడంతో పాటు దర్శకుడితో చర్చించి నేపథ్య సంగీతంపై కూడా కొన్ని ట్యూన్స్ ను సిద్ధంచేశాడు. మరోవైపు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా క్లయిమాక్స్ యుద్థ సన్నివేశాల షూటింగ్ తాజాగా మొదలైంది. ఈ సన్నివేశాల్ని భారీస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అటు తొలి షెడ్యూల్ లో భాగంగా మొరాకాలో తీసిన ప్రీ-క్లైమాక్స్ సన్నివేశాల్ని ఇప్పటికే విజువల్ ఎఫెక్ట్స్ విభాగానికి అందజేశారు. ఈ షెడ్యూల్ లో క్లయిమాక్స్ యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కించి… వీటిని కూడా గ్రాఫిక్స్ టీంకు అందిస్తారు. ఇలా చేయడం వల్ల గ్రాఫిక్ వర్క్ పూర్తిచేయడానికి సిబ్బందికి కావాల్సినంత టైం దొరుకుంది. ఈమధ్య కాలంలో చాలా సినిమాలు గ్రాఫిక్స్ లేట్ అవ్వడం వల్లనే విడుదల వాయిదా పడిన సందర్భాలు చూశాం. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు సంబంధించి ముందునుంచే గ్రాఫిక్ వర్క్ పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని ప్రాధమికంగా భావిస్తున్నారు. బాలయ్య నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వందో సినిమాలో శ్రియ హీరోయిన్ గా ఎంపికైంది.