కర్మ – విశ్రాంతి

చైనా తాత్వికుడయిన కన్‌ఫ్యూషియస్‌ దగ్గరకు ఒక వ్యక్తి వెళ్ళి నమస్కరించి ”అయ్యా! నేను జీవితంలో ఎంతో అలసిపోయాను. ఎన్నో పనులు చేసి విసిగిపోయాను. ఇప్పుడు విశ్రాంతి కోరుకుంటున్నాను. విశ్రాంతికి ఏదయినా మార్గముంటే తెలపండి. విశ్రాంతి ఉంటేనే నా జీవితానికి ఓదార్పు దొరుకుతుంది. మీలాంటి మహాపురుషులు మాత్రమే దానికి మార్గం చూపించగలరని నమ్ముతున్నాను” అన్నాడు.

కన్‌ఫ్యూషియస్‌ ఆ వ్యక్తి చెప్పినవన్నీ విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. లేచి ఆవ్యక్తిని తన వెంట రమ్మన్నాడు. ఇద్దరూ కొంత దూరం నడిచారు. నడిచేంతసేపూకూడా కన్‌ఫ్యూషియస్‌ ఏమీ మాట్లాడలేదు. వెంట నడుస్తున్న వ్యక్తికి అంతా అయోమయంగా ఉంది. ఏమీ మాట్లాడకుండా ఈ వ్యక్తి ఎక్కడకు తీసుకెళుతున్నాడా? అని ఆశ్చర్యపోయాడు. కొంత దూరం నడిచి వెళ్లాక కన్యూఫ్యూషియస్‌ ఆగాడు. ఎదురుగా ఉన్న శ్మశానాన్ని చూపించాడు. ఆ వ్యక్తికి ఏమీ అర్ధం కాలేదు. ”ఎందుకు నన్ను శ్మశానానికి తీసుకొచ్చారు. ఎందుకు దాన్ని చూపుతున్నారు?” అని అడిగాడు. కన్‌ఫ్యూషియస్‌ ”విశ్రాంతి అన్నది శ్మశానంలో మాత్రమే ఉంది. సమాధిలో మాత్రమే ఉంది. శాంతి కావాలన్నా, విశ్రాంతి కావాలన్నా చనిపోవాలి. అనుదిన జీవన మన్నది విశ్రాంతికి పూర్తిగా వ్యతిరేకమైంది. కర్మ,విశ్రాంతి ఒకదానికొకటి వ్యతిరేకమయినవి. కర్మ జీవికి విశ్రాంతి ఉండదు. జీవితానికి అర్ధం పని. జీవితానికి విశ్రాంతి అన్నది వ్యతిరేకమయింది. నీకు జీవితం కావాలా? మరణం కావాలా? తేల్చుకో. మరణంలోనే విశ్రాంతి ఉంది” అన్నాడు.

ఆమాటలు విని ఆ వ్యక్తి బిత్తరపోయాడు. కన్‌ఫ్యూషియస్‌ చెప్పిందానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. జీవితానికి మరణమన్నది వ్యతిరేకం కాదు. మరణం జీవితానికి ఆఖరి మజిలీ. మృత్యువు విశ్రాంతి కాదు. బతుకులో ఉన్న అశాంతి మరణంలో కూడా వెంబడిస్తుంది. పీడిస్తుంది. మరణం జీవితానికి వ్యతిరేకం కాదు. అది జీవన సారాంశం. జీవితంలో కర్మ మాత్రమే ఉంటుందని, విశ్రాంతి ఉండదని అనడం సరికాదు. కర్మ అన్నది బాహ్య ప్రపంచానికి సంబంధించింది. శరీరానికి సంబంధించింది. బయటి ప్రపంచానికి సంబంధించినంత మేరకూ దేహికి సంబంధించినంతవరకు కర్మ అనివార్యం.

పని చేయడం తప్పనిసరి. కానీ మనిషి కేవలం శరీర మాత్రుడు కాదు. మనిషికి శరీరం ఒక్కటే లేదు. లోపల ఆత్మఉంది. అస్థిత్వ ముంది. చైతన్యముంది. అవి విశ్రాంతి కేంద్రాలు. తన బాహ్య కర్మను వ్యక్తి ఎప్పుడయితే సంపూర్ణంగా నిర్వహిస్తాడో అతడు అస్తిత్వపు కేంద్రాన్ని

ఉపసంహరించుకుంటాడు. అక్కడ విశ్రాంతి పొందుతాడు. జీవితంలో ద్వంద్వాలు ఉన్నాయి. ప్రకృతిలో ఉన్నాయి. రాత్రి,పగలు, పగలు శ్రమిస్తాం. రాత్రి విశ్రాంతి తీసుకుంటాం. మనిషికి శరీరం ఉంది. ఆత్మ ఉంది. శరీరం కర్మను నిర్వహిస్తుంది. ఆత్మ విశ్రాంతినిస్తుంది.

-సౌభాగ్య