Telugu Global
Others

ఇలాంటి మానవసేవ చట్ట విరుద్ధం

న్యాయ దేవతకు చెవులే తప్ప కళ్లుండవు. చట్టాన్ని పరిరక్షించడం న్యాయదేవత కర్తవ్యం.  కాని ఆ చట్టానికి నిబంధనలే కాని జ్ఞానం ఉండదేమో! మహా రాష్ట్రాలో సింధుతాయ్ సప్కాల్ అనే 68 ఏళ్ల మహిళ నాలుగు అనాథ శరణాలయాలు నడుపుతున్నారు. అయితే ఈ అనాథ శరణాలయాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైనవి కావు. ఈ అనాథ శరణాలయాలకు సింధుతాయ్ ప్రభుత్వ సహాయం తీసుకోవడం లేదు. అందు వల్ల వీటిని ప్రత్యేకంగా పరిగణించి నమోదు చేయాలని 2011 నుంచి ఆమె చేసిన […]

ఇలాంటి మానవసేవ  చట్ట విరుద్ధం
X

RV Ramaraoన్యాయ దేవతకు చెవులే తప్ప కళ్లుండవు. చట్టాన్ని పరిరక్షించడం న్యాయదేవత కర్తవ్యం. కాని ఆ చట్టానికి నిబంధనలే కాని జ్ఞానం ఉండదేమో! మహా రాష్ట్రాలో సింధుతాయ్ సప్కాల్ అనే 68 ఏళ్ల మహిళ నాలుగు అనాథ శరణాలయాలు నడుపుతున్నారు. అయితే ఈ అనాథ శరణాలయాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైనవి కావు. ఈ అనాథ శరణాలయాలకు సింధుతాయ్ ప్రభుత్వ సహాయం తీసుకోవడం లేదు. అందు వల్ల వీటిని ప్రత్యేకంగా పరిగణించి నమోదు చేయాలని 2011 నుంచి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ ప్రభుత్వ నిబంధనల కారణంగా వమ్మైనాయి. వీటికి అనుమతి లేదు కనక మూసేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. ఇవి మూతపడక తప్పని పరిస్థితి తలెత్తింది.

అనుమతి లేదు కనక ఈ అనాథశరణాలయాల్లో ఉన్న పిల్లలను ప్రభుత్వ అధీనంలోని అనాథశ్రమాల్లో చేర్పించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ప్రభుత్వ అధీనంలోని అనాథశరణాలయాలు ఎలా పని చేస్తాయో అందరికీ తెలిసిందే. అరకొర నిధులతో పని చేస్తుంటాయి. కిక్కిరిసి ఉంటాయి.

సింధుతాయ్ సప్కాల్ తన జీవితమంతటినీ అనాథ బాలలను రక్షించడానికి, వారికి ఆశ్రయమివ్వడమే కాక వారికి చదువు చెప్పించి లాయర్లుగా, డాక్టర్లుగా తీర్చి దిద్దడానికి కృషి చేస్తున్నారు. ఈ రకంగా సింధుతాయ్ కృషి నిజంగా ప్రత్యేకమైందే. కాని చట్టం రొడ్డకొట్టుడు పద్ధతిని తప్ప ప్రత్యేకతను అంగీకరించదు. సృజనాత్మకతకు చోటివ్వదు.

మహా రాష్ట్రలోని వార్ధా జిల్లా పింప్రి మేఘే గ్రామంలో 1948 నవంబర్ 14న జన్మించిన సింధుతాయ్ చిన్నప్పటినుంచి తల్లిదండ్రులకు కూడా ఒల్లని పిల్లగానే పెరిగింది. ఆమెను తల్లిదండ్రులు “చింది” (చిరిగిన గుడ్డ) గా భావించే వారు. తల్లి ఒప్పుకోకపోయినా సింధుతాయిని తండ్రి చదివించాడు. కాని దుర్భరమైన పేదరికం, కుటుంబ బాధ్యతల కారణంగా బాల్య వివాహం చేసుకోవాల్సి వచ్చినందువల్ల నాల్గో తరగతితోనే బడి మానేయాల్సి వచ్చింది. ఆమెకు పదేళ్ల వయసున్నప్పుడు 30 ఏళ్ల శ్రీహరి సప్కాల్ తో పెళ్లైంది. 20 ఏళ్లకే ముగ్గురు పిల్లల తల్లైంది. ఆమె నివాసం ఉంటున్న గ్రామంలోని ఓ మోతుబరి పిడకలు ఏరుకుని రావాలని గ్రామస్థులను వేధించేవాడు. వారికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండానే అటవీ శాఖ అధికారులతో కుమ్మక్కై పిడకలు అమ్ముకుని సొమ్ము చేసుకునే వాడు. సింధుతాయ్ ఆ గ్రామ పెద్దను ఎదిరించడం జిల్లా కలెక్టర్ దాకా వెళ్లింది. కలెక్టర్ సింధుతాయ్ చేసినదాంట్లో తప్పు లేదని భావించి ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశాడు. గ్రామ పెద్ద అహం దెబ్బతిని భార్యను వదిలేయమని సింధుతాయ్ భర్త పై ఒత్తిడి చేస్తే ఆయన ఆమెను పశువుల దొడ్లో పడేశాడు. అప్పుడామె తొమ్మిది నెలల గర్భవతి. అదే దుస్థితిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. బొడ్డు తాడు కోసే వారు కూడా దిక్కు లేక తానే ఆ పని చేసి అక్కడి నుంచి పిల్లతో సహా బయలు దేరింది. తల్లి దగ్గరకు వెళ్తే అక్కడా చుక్కెదురైంది.

రైల్వే స్టేషన్లలో పాటలు పాడుతూ బిచ్చమెత్తుకుని కాలం గడిపింది. రైల్వే స్టేషన్లలో అనేక మంది పిల్లలు తన లాగే దీన స్థితిలో ఉండడం గమనించి వారికోసం ఏమైనా చేయాలన్న సంకల్పంతో బిచ్చమెత్తుకున్న డబ్బులతో వారిని పోషించేది. అలా ఆమె నాలుగు అనాథశరణాలయాలు నడిపే స్థితికి వచ్చింది. అనేక రోజులు బిచ్చమెత్తి అనాథలను పోషించింది. ఆమెను అనాథలపాలిటి తల్లిగా పరిగణిస్తారు. క్రమంగా ఆమె సం రక్షణాలయాలు పెరిగాయి.

80 ఏళ్లు వచ్చిన తర్వాత ఆమె భర్త వచ్చి క్షమాపణ చెప్పాడు. “నిన్నూ ఒక పిల్లవాడిగా అంగీకరిస్తానే తప్ప భర్తగా కాదు” అని తెగేసి చెప్పింది సింధుతాయ్. ఆయనా ఇప్పుడు ఆమె నడిపే అనాథాశ్రమంలోనే ఉంటాడు “నా పిల్లల్లో అందరికన్నా పెద్ద వాడు” అని పరిచయం చేస్తుంది సింధుతాయ్ తన భర్తను.

ఆమె చేసిన కృషికి ఇంతవరకు 750 అవార్డులొచ్చాయి. ఆ సొమ్మునంతటినీ అనాథ పిల్లలకోసమే వెచ్చిస్తోంది. అనాథశరణాలయాల కోసం స్థలం కొనడానికి, భవనాలు నిర్మించడానికి ఖర్చు పెడ్తుంది. తన సొంత కూతురిని పుణేలోని ఓ అనాథశరణాలయంలో చేర్పించింది. తన కూతురిమీద ప్రేమతో తన పెంపకంలో ఉన్న పిల్లలను సరిగా చూడేలేనేమోనన్న బెంగ కారణంగా సొంత కూతురినే అనాథశరణాలయంలో ఉంచింది. ఆ కూతురే ఇప్పుడు తల్లి మీద పీహెచ్ డీ చేస్తోంది.

సింధుతాయ్ ఆశ్రమంలో పెరిగిన వారందరూ విద్యావంతులయ్యారు. వారిలో కొందరు అనాథ శరణాలయాలు నడుపుతున్నారు. ఆ పిల్లల్లో చాలా మంది తమ పేర్లలో సింధుతాయ్ అని చేర్చుకుని కృతజ్ఞత ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఆమె బిచ్చమెత్తుకోవడం లేదు కాని ఉపన్యాసాలిచ్చి డబ్బు సంపాదిస్తోంది. “ఒకప్పుడు పాట ఉంటేనే సాపాటు ఉండేది. ఇప్పుడు ప్రసంగాల ద్వారానే సామాగ్రి సమకూరుతోంది” అని ఆమె అంటారు. ఆమె మంచి వక్త. హిందీ, మరాఠీ భాషల్లో అలవోకగా పాటలతో సహా ఆకర్షణీయమైన ప్రసంగాలు చేస్తారు. “ప్రేత వస్త్రానికి జేబులుండవు. చావెప్పుడూ లంచమడగదు” అంటుంటారు.

సింధుతాయ్ ఇంతవరకు 1050 మంది అనాథలకు ఆశ్రయమిచ్చారు. తన దగ్గర పెరిగిన ఆడపిల్లల పెళ్లిళ్లకు ఏర్పాటు చేశారు. ఆమె పెంచిన పిల్లల్లో దాదాపు 50 మంది ఆమెతో పాటే పని చేస్తారు. చాలా మంది తమ ఆదాయంలో కొంత భాగం ఆమె నడిపే అనాథశరణాలయాలకు విరాళంగా ఇస్తారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14న అనాథశరణాలయాల్లో ఆమె జన్మదినం జరుపుతారు. గత సంవత్సరం నవంబర్ 14న అనాథశరణాలయంలో పెరిగిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న 287 మంది (ఆమె దృష్టిలో అల్లుళ్లు), 25 మంది అమ్మాయిలు (ఆమె దృష్టిలో కోడళ్లు) జన్మదినోత్సవంలో పాల్గొన్నారు.

రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు ఆమెను సత్కరించిన సందర్భాలున్నాయి. ఈ ఏడాదే డి.వై. పాటిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింధుతాయ్ ని డి.లిట్. పట్టా ఇచ్చి సత్కరించింది. ఆమె జీవితంపై “మీ సింధుతాయ్ సప్కాల్” అన్న సినిమా 2010లో చిత్రీకరించారు. ఈ సినిమా లండన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు కూడా.

చట్టం ఇలాంటి మానవ సేవను గుర్తించకపోతే ఇవన్నీ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలైపోతాయి. సింధుతాయ్ జీవిత కాలం చేసిన కృషి చట్ట విరుద్ధమేనంటోంది మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం.

-ఆర్వీ రామారావ్

First Published:  5 July 2016 5:09 AM GMT
Next Story