Telugu Global
Family

తెలివైన కంసాలి

పొన్నప్ప మంచి పనితనం తెలిసిన కంసాలి. బంగారు నగల్ని ఎంతో నాణ్యంతో చెక్కగలిగినవాడు. అందమయిన నగల్ని తయారు చెయ్యడంలో అతన్ని మించిన వాడు ఆ సమీపప్రాంతాల్లో లేడని పేరు తెచ్చుకున్నాడు. ఎంత పనితనమున్న వాడయినా పొన్నప్ప చేతివాటం మనిషి. నగలు చేయడానికి బంగారు యిస్తే దాంట్లోంచీ ఎంతో కొంత కొట్టేసే వాడు. ఆ సంగతి ఎదుటివాళ్ళకు తెలిసేదికాదు. పట్టించుకునే వాళ్ళుకాదు. పట్టించుకున్నవాళ్ళకు అతను చేతివాటం మనిషని తెలుసుకానీ అది ఎలాగో అంతు పట్టేది కాదు. బంగారు తగ్గిందని […]

పొన్నప్ప మంచి పనితనం తెలిసిన కంసాలి. బంగారు నగల్ని ఎంతో నాణ్యంతో చెక్కగలిగినవాడు. అందమయిన నగల్ని తయారు చెయ్యడంలో అతన్ని మించిన వాడు ఆ సమీపప్రాంతాల్లో లేడని పేరు తెచ్చుకున్నాడు.

ఎంత పనితనమున్న వాడయినా పొన్నప్ప చేతివాటం మనిషి. నగలు చేయడానికి బంగారు యిస్తే దాంట్లోంచీ ఎంతో కొంత కొట్టేసే వాడు. ఆ సంగతి ఎదుటివాళ్ళకు తెలిసేదికాదు. పట్టించుకునే వాళ్ళుకాదు. పట్టించుకున్నవాళ్ళకు అతను చేతివాటం మనిషని తెలుసుకానీ అది ఎలాగో అంతు పట్టేది కాదు. బంగారు తగ్గిందని అంటే తరుగులో పోయిందని బుకాయించేవాడు. నిలదీసే వీలు దొరికేదికాదు.

అలా కాలం సాగుతోంది. అవసరమొచ్చిన వాళ్ళు అతని దగ్గర నగలు చేయించుకునే వాళ్ళు. మంచినగలు చేయించుకోవాలంటేే అంతకు మించిన పనివాడు ఆ పరిసరాల్లో లేడు.

ఇట్లా వుంటే ఒక సంపన్నుడయిన నంబూద్రి బ్రహ్మణుడు కూతురికోసం ఒక వజ్రాలహారం చేయించాలని నిర్ణయించాడు. పొన్నప్పగురించి నంబూద్రికి తెలుసు అతని పనితనం గురించీ తెలుసు అతని చేతివాటం గురించీ తెలుసు. పైగా పెద్ద నగ అందుకుని మధ్యేమార్గంగా ఒకటి ఆలోచించాడు. అది మధ్యే మార్గమనడం కన్నా ఒక కన్నేసి వుంచడమనే చెపాలి. పొన్నప్ప నగను తయారు చేసేంత సేపూ కావలికాయడానికి ఒక పనివాణ్ణి నియమించాడు. ఆపనివాడు చేయాల్సిందల్లా అతను నగను తయారు చేస్తున్నంత సేపూ దాని మీద దృష్టి పెట్టడం. పొన్నప్ప బంగారును తస్కరించకుండా చూడడం.

ఏ రోజుకారోజు నగెంత వరకయితే అంత వరకు చేసి పొన్నప్పవెళ్ళే వాడు. వెళ్ళేముందు పొన్నప్ప ఏమయనా తీసుకెళ్లుతున్నాడా లేదా అని వెతికి బట్టలు తడిమి ఏమీ తీసుకెళ్ళడం లేదని చూసి పంపేవాడు.

పొన్నప్పకుండా ఏమీ ప్రతిఘటించకుండా తనకి సహకరించేవాడు. దీంతో ఎవరికీ ఏమీ సందేహం కలిగేదికాదు. యిట్లా కొన్నాళ్ళయ్యాక వజ్రాల హారం సిద్ధమయింది. పూల తీగల ఆకారంలో బంగారు పూలలా వజ్రాలతో ఆ ఆహారం ఆకర్షణీయంగా తయారైంది.

చివరిరోజు నంబూద్రి కూడా వచ్చాడు. ఆహారాన్ని చూశాడు, చాలా సంతోషించాడు. అతని పనితనానికి మెచ్చి తగిన డబ్బు యిచ్చాడు. కంసాలి సంతోషించాడు. ముందు నంబూద్రి, మధ్యలో వజ్రాలహారం పట్టుకుని పనివాడు, వెనక పొన్నప్ప బయల్దేరారు. అందరూ కలిసి నంబూద్రి యింటికి బయల్దేరారు. పొన్నప్ప తప్పని సరిగా ఆ యింటికి వచ్చి దాని ప్రాశస్త్యాన్ని అందరికీ వివరించడం ఆనవాయితీ.

ముగ్గురూ కలిసి వెళుతూవుంటే ఎదురుగా ఒక పిల్లకాలువవుంది. దాన్ని దాటాలి. నంబూద్రి దాటాడు. పనివాడు దాటబోయేంతలో వెనకనున్న పొన్నప్ప నీళ్ళలోకి రాయిమీదనించీ కాలుజారి పనివాడి మీద పడ్డాడు. యిద్దరూ మునిగినంత పనిచేశారు కానీ మళ్ళీ నిలబడ్డారు. పొన్నప్ప నంబూద్రి ఇంటికి వచ్చి నగను గురించి వివరించాడు.

అందరూ నగను అభినందించారు. పదిరోజులు గడిచాయి. ఆ నగ అక్కడక్కడా తుప్పు పట్టినట్లు కనిపించింది. నంబూద్రి ఆశ్చర్యపోయాడు. తను నియమించిన పనివాడి కళ్ళముందే ఆ నగ తయారయింది. అందుకని పొన్నప్పని నిలదీయలేదు.

ఇంతకూ జరిగిన సంగతేమిటంటే కాలువలో కాలుజారినపుడు పనివాడి చేతిలోకి వజ్రాలహారం నీటిలో పడింది. అప్పటికే అక్కడ దాచిన నకిలీహారంతో పొన్నప్ప మార్పుచేశాడు. తన మీద సందేహంతో కావలిగా మనిషిని నియమించిన నంబూద్రిపై అలా కక్ష సాధించాడు.

– సౌభాగ్య

First Published:  4 July 2016 1:02 PM GMT
Next Story