తప్పు చేస్తే ”ఘోస్ట్ సిటీ” అవుతుంది

రాజధాని అమరావతిని ఒక వ్యాపార కేంద్రంగానే నిర్మించడం సరికాదని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యాపార కేంద్రంగానే కాకుండా అన్ని వర్గాల ప్రజల జీవనానికి అనుకూలంగా రాజధానిని నిర్మించాలన్నారు. అలా నిర్మిస్తేనే అమరావతి ఒక మంచి నగరం అవుతుందన్నారు. అలా నిర్మించకుండా తప్పు చేస్తే అదో ఘోస్ట్‌ సిటీగా మారే ప్రమాదం ఉందన్నారు. ఆదివారం బెంగళూరులో డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ ఫౌండేషన్ కర్ణాటక ఆధ్వర్యంలో జరిగిన వైఎస్‌ జయంతి కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అని నిరూపించిన వ్యక్తి వైఎస్‌ అని కొనియాడారు.