సెట్స్ పైకి రాకముందే సినిమా కొనేస్తున్నారు గురూ…

ఒక సినిమా షూటింగ్ పూర్తయి, అది విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్ జరిగేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. సినిమా సెట్స్ పై ఉంటుండగానే అన్ని ఏరియాస్ కు సంబంధించి ప్రీ-బిజినెస్ జరిగిపోతోంది. బడా హీరో సినిమాలకైతే శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడుపోతున్నాయు. అలా దాదాపు స్టార్ హీరోల సినిమాలన్నీ టేబుల్ ప్రాఫిట్ తోనే మొదలవుతున్నాయి. కానీ ఇప్పుడు దీనికి మించిన ఫార్ములా ఇంకోటి అందుబాటులోకి వచ్చింది. సినిమాకు కనీసం కొబ్బరికాయ కూడా కొట్టకముందే అమ్మేస్తున్నారు. హిందీలో కొన్నేళ్లుగా ఉన్న ఈ పద్ధతి… ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో టాలీవుడ్ లోకి కూడా ఎంటరైంది. 
ఈనెల 29 నుంచి మహేష్ బాబు-మురుగదాస్ సినిమా ప్రారంభమౌతుంది. హైదరాబాద్ లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. అయితే ఇదింకా సెట్స్ పైకి రాకముందే సినిమా మొత్తాన్ని అమ్మేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. అవును… ఈ మేరకు రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థతో చర్చలు జరుపుతున్నారు. ఈమధ్యే పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా మొత్తాన్ని హోల్ అండ్ సోల్ గా కొనేసింది రిలయన్స్. అన్ని ఏరియాల హక్కులతో పాటు శాటిలైట్ రైట్స్ అన్నీ గంపగుత్తగా కొనేసింది. అదే తరహాలో మహేష్ బాబు సినిమాను కూడా కొనేయాలని నిర్ణయించుకుంది. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సెట్స్ పై ఉంటుండగా డీల్ జరిగితే… మహేష్ బాబు సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే డీలింగ్ కుదుర్చుకోవడానికి రిలయన్స్ సిద్ధపడుతోంది. త్వరలోనే ఈ భారీ డీల్ కు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశముంది.