జనతా గ్యారేజ్ కు తలైవ కనెక్షన్

ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించి తాజాగా మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కథలో కొత్తదనం లేకపోయినా… కథనంలో మాత్రం కొరటాల శివ తనదైన మేజిక్ ను చూపిస్తున్నాడని తెలుస్తోంది. మిర్చి, శ్రీమంతుడు సినిమాల తరహాలో కథలో ఫ్రెష్ నెస్ లేకపోగా…. తమిళ్ లో హిట్టయిన తలైవ సినిమాకు దగ్గరగా జనతా గ్యారేజ్ ఉండబోతోందని ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది.
ఇక ఈ రెండు సినిమాల సారుప్యతలు చూస్తే…. తలైవ సినిమాలో హీరో విజయ్, సీనియర్ నటుడు సత్యరాజ్ తండ్రికొడుకులుగా నటించారు. సినిమాలో సత్యరాజ్… లోకల్ గా భాయ్ గా చలామణి అవుతుంటాడు. తన మాఫియాకు దూరంగా ఎక్కడో ఆస్ట్రేలియాలో కొడుకు విజయ్ ను పెంచుతాడు. ఒకానొక సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో విజయ్ కూడా మాఫియాలోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ్నుంచి విజయ్ ఎలా డాన్ గా మారాడనేది తలైవ కథ, సరిగ్గా ఇదే కోవలో జనతా గ్యారేజ్ కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. 
మాఫియా నాయకుడిగా చలామణి అయి.. ఆ ఛాయలకు దూరంగా బతుకుతుంటాడు మోహన్ లాల్. తారక్ ను కూడా మాఫియాకు దూరంగా పెంచుతాడు. అయితే హీరోయిన్ నిత్యామీనన్ కారణంగా అనుకోని పరిస్థితుల్లో… బుద్ధిగా చదువుకుంటున్న ఎన్టీఆర్ మాఫియాలోకి ప్రవేశిస్తాడట. ప్రస్తుతం ఈ రూమర్ పై యూనిట్ ఎవరూ పెదవి విప్పడం లేదు. సినిమా విడుదలైన తర్వాత జనతాగ్యారేజ్, తలైవ సినిమాల మధ్య ఎంత తేడా ఉందనే విషయం తెలుస్తుంది.