Telugu Global
Others

ఉత్త‌మ్ ప‌ద‌వి సేఫ్‌!

టీపీసీసీ చీఫ్ మార్పుపై వ‌స్తున్న ఊహాగానాల‌కు కాంగ్రెస్ అధిష్ఠానం తెర‌దించింది. టీపీసీసీ అధ్య‌క్షుడి మార్పు ఉండ‌ద‌ని కుండ‌బ‌ద్ద‌లుకొట్టింది. వ‌రుస ఓట‌ములు, తీవ్ర ఒడిదుడుకుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఉత్త‌మ్ టీపీసీసీ అధ్యక్ష‌ ప‌ద‌వి నుంచి స్వ‌చ్ఛందంగానే త‌ప్పుకుంటార‌నే చ‌ర్చ కొంత‌కాలంగా సాగుతోంది. త‌న‌ను ప‌ద‌వి నుంచి తీసేయండి! అంటూ ఉత్త‌మ్ ఇటీవ‌ల అధిష్టానాన్ని కోరారంటూ వార్త‌లు వ‌చ్చాయి.  తాజాగా  ఢిల్లీ నుంచి వ‌చ్చిన ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా  టీపీసీసీ ప‌ద‌విలో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని స్ప‌ష్టం […]

ఉత్త‌మ్ ప‌ద‌వి సేఫ్‌!
X
టీపీసీసీ చీఫ్ మార్పుపై వ‌స్తున్న ఊహాగానాల‌కు కాంగ్రెస్ అధిష్ఠానం తెర‌దించింది. టీపీసీసీ అధ్య‌క్షుడి మార్పు ఉండ‌ద‌ని కుండ‌బ‌ద్ద‌లుకొట్టింది. వ‌రుస ఓట‌ములు, తీవ్ర ఒడిదుడుకుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఉత్త‌మ్ టీపీసీసీ అధ్యక్ష‌ ప‌ద‌వి నుంచి స్వ‌చ్ఛందంగానే త‌ప్పుకుంటార‌నే చ‌ర్చ కొంత‌కాలంగా సాగుతోంది. త‌న‌ను ప‌ద‌వి నుంచి తీసేయండి! అంటూ ఉత్త‌మ్ ఇటీవ‌ల అధిష్టానాన్ని కోరారంటూ వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఢిల్లీ నుంచి వ‌చ్చిన ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా టీపీసీసీ ప‌ద‌విలో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఉత్త‌మ్ కుమార్ కొన‌సాగుతార‌ని పున‌రుద్ఘాటించారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పులు ఉండ‌బోవ‌న్న విష‌యం తేలిపోయింది.
కుంతియా ప్ర‌క‌ట‌న‌తో టీపీసీసీ ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్న నేత‌లంతా నీరుగారిపోయారు. కొంత‌కాలంగా టీపీసీసీ ప‌గ్గాలు త‌మ‌కు అప్ప‌జెప్పాలంటూ కోమ‌టిరెడ్డి సోద‌రులు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు జానారెడ్డి, డీకే అరుణ‌, స‌బితా ఇంద్రారెడ్డి పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. టీపీసీసీ ప‌ద‌వి చేప‌ట్టేందుకు డీకే సుముఖ‌త చూప‌లేదు. కోమ‌టిరెడ్డి సోద‌రులు సిద్ధంగానే ఉన్నా.. వారికి ఈసారి అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇక‌పోతే.. సబితా ఇంద్రారెడ్డి సైతం పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు సంసిద్ధంగానే ఉన్నారు. నేడో.. రేపో.. టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విలోకి కొత్త వ్య‌క్తి త‌ప్ప‌కుండా వ‌స్తార‌న్న న‌మ్మకం పార్టీలో బ‌లంగా నాటుకుపోయింది. ఈ నేప‌థ్యంలో కుంతియా ప్ర‌క‌ట‌న వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది.
టీపీసీసీ అధ్య‌క్షుడిగా పొన్నాల‌ ఎంపిక‌పై నాలుక్క‌రుచుకున్న కాంగ్రెస్ అధిష్టానం తిరిగి రెడ్డి సామాజిక వ‌ర్గానికే ఆ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. త‌రువాత పార్టీ ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అసెంబ్లీ, పార్ల‌మెంటు, స్థానిక సంస్థ‌లు ఇలా ప్ర‌తిచోటా కారుజోరును కాంగ్రెస్ ఆప‌లేకపోయింది. దీంతో ఉత్త‌మ్‌పై విమ‌ర్శ‌లు పెరిగాయి. ఉత్త‌మ్‌కూడా త‌ప్పుకుంటాన‌ని అధిష్టానాన్ని కోరిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి దిగ్విజ‌య్ కూడా ఉత్త‌మ్ క్షేత్ర‌స్థాయిలోకి వెళ్లాల‌ని చుర‌క‌లంటించారు. దీంతో టీపీసీసీ మార్పు అనివార్య‌మ‌నుకున్నారంతా. ఇప్ప‌టికిప్పుడు కేవ‌లం అధ్య‌క్షుడిని మార్చినా పార్టీకి ఒరిగేదేం ఉండ‌ద‌ని అధిష్టానం భావించి ఉంటుంద‌ని, అందుకే ఉత్త‌మ్‌నే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఉంద‌ని టీపీసీసీ నేత‌లు స‌రిపెట్టుకుంటున్నారు.
First Published:  19 July 2016 9:09 PM GMT
Next Story