చిరంజీవి కొత్త సినిమా టైటిల్ అదేనా…?

గతంలో ఖైదీ, ఖైదీ నంబర్ 786 లాంటి సినిమాలతో చిరంజీవి సూపర్ హిట్స్ అందుకున్నాడు. కాబట్టి సెంటిమెంట్ కొద్దీ తన రీఎంట్రీ మూవీకి కూడా ఖైదీ అనే పదం  వచ్చేలా పేరు పెట్టాలని అనుకుంటున్నాడట. పైగా ఇది 150వ చిత్రం కాబట్టి… ఖైదీ నంబర్ 150 అని పెడితే ఎలా ఉంటుందో ఆలోచించమని దర్శకుడికి సలహా ఇచ్చాడట. వాస్తవానికి చిరంజీవి 150వ సినిమాకు కత్తిలాంటోడు అనే టైటిల్ పెట్టేశారు. దర్శకుడు వీవీ వినాయక్ ఎంతో ఇష్టపడి ఈ టైటిల్ ఫిక్స్ చేశాడు. కానీ అది అసలైన టైటిల్ కాదని, త్వరలోనే మరో పేరును ఎనౌన్స్ చేస్తామని నిర్మాత చెర్రీ స్పష్టంచేశాడు. దీంతో చిరంజీవి 150వ సినిమా టైటిల్ పై రోజుకో పేరు తెరపైకి వస్తోంది. ఇందులో భాగంగానే ఖైదీ-150 అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి జైలుకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఖైదీ డ్రెస్సులో చిరంజీవి కనిపించే సీన్లను ఇప్పటికే తెరకెక్కించారు. కాబట్టి… సినిమాకు ఖైదీ-150 అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఇంకో నెల రోజుల వరకు టైటిల్ పై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే… వచ్చేనెలలో చిరంజీవి పుట్టినరోజు ఉంది. ఆ రోజున చిరు 150వ సినిమాకు సంబంధించి టైటిల్ ను అధికారింగా ప్రకటించాలని అనుకుంటున్నారు. అప్పటివరకు ఖైదీ-150 అనేది కేవలం ఓ రూమర్ మాత్రమే.