Telugu Global
Others

గుజరాత్ లో ఊపందుకున్న నిరసన

దళితుల మీద అత్యాచారాలు, దాడులు గుజరాత్ కే పరిమితమైన వ్యవహారం కాదు. అన్ని రాష్ట్రాలలోనూ ఇలాంటివి అడపాదడపా జరుగుతున్నాయి. సవ్యంగా ఆలోచించే వారందరూ ఈ ఘటనలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. నిరసన తెలియజేస్తూనే ఉన్నారు.

దళితుల మీద అత్యాచారాలు, దాడులు గుజరాత్ కే పరిమితమైన వ్యవహారం కాదు. అన్ని రాష్ట్రాలలోనూ ఇలాంటివి అడపాదడపా జరుగుతున్నాయి. సవ్యంగా ఆలోచించే వారందరూ ఈ ఘటనలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. కాని జులై 11వ తేదీన గుజరాత్ లోని గిర్ సోంనాథ్ జిల్లాలోని ఉనాకు సమీపంలోని మోటా సంధియాలా గ్రామంలో గో చర్మాన్ని ఒలిచిన దళిత యువకులపై కిరాతకమైన దాడి జరిగిన తర్వాత దాదాపు గుజరాత్ అంతటా దళితులు పోరుబాట పట్టారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగిన సందర్భంలో గుజరాత్ లోని దళితులు ఒక్కుమ్మడిగా నిరసన స్వరాలు వినిపించారు. ఆ తర్వాత దళితులు అదే స్థాయిలో ఉద్యమించడం మళ్లీ ఇదే మొదలు.

గో రక్షణకు కంకణం కట్టుకున్న గోరక్షణ సమితి, గోరక్షా ఏక్తా సమితి వంటి సంస్థలు గుజరాత్ లో దళితుల మీద నిరంతరం దాడులు, అత్యాచారాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. గోరక్షణ పేరుతో చట్టాన్ని ఉల్లంఘించి బలప్రయోగంతో దాడులు చేస్తూనే ఉన్నాయి. ఉనా పరిసర గ్రామాల్లోనే గత రెండు నెలల కాలంలో ఇలాంటి అక్రమ దాడులు కనీసం మూడు జరిగాయి. ఇవన్నీ పశువుల చర్మాన్ని ఒలిచే దళితుల మీదే జరిగాయి. గోరక్షణ పేరుతో మైనారిటీల మీద దాడులు చేయడంతో పాటు ఇటీవలి కాలంలో దళితుల మీద దాడులు పెచ్చరిల్లాయి. అంటే ఈ దాడుల వెనక మతం కోణంతో పాటు ఇప్పుడు కులం పార్శ్వం కూడా ఉంది.

గుజరాత్ లో ప్రతి ఏటా దళితుల మీద కనీసం వెయ్యి దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. ప్రతి ఏటా కనీసం 50 మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. 200 మంది దళితులను హతమార్చారు. పోలీసులు చూసీ చూడనట్టు ఉండడమే కాక గోపరిరక్షణ సాయుధ దళాలకు అండగా నిలుస్తున్నాయి. ఆ దళాల ఆగడాలను పట్టించుకోవడం లేదు. ఉనా సమీపంలో దళితుల మీద భయంకరమైన దాడి జరిగిన తర్వాత ఘటనా స్థలానికి వెళ్తున్న పోలీసులకు దాడి చేసిన వారు ఎదురుపడ్డారు. వారితో పోలీసులు మాట్లాడారు కూడా. కాని వారి మీద ఏ చర్యా తీసుకోలేదు. అంతకన్నా సంఘటనా స్థలానికి వెళ్లడమే తమకు ముఖ్యమని పోలీసులు తెగేసి చెప్పారు. ఆ తర్వాత దాదాపు వారం రోజులపాటు అధికారులు, ప్రభుత్వం గోరక్షా సమితి వర్గాల మీద ఎలాంటి చర్యా తీసుకోలేదు. నింపాదిగా దాడికి పాల్పడ్డ వారిలో కొంత మందిని అరెస్టు చేశారు. దాడి తర్వాత దళిత యువకులను బలవంతంగా ఉనాకు తరలిస్తున్నప్పుడు కూడా పోలీసులు వారిని కాపాడడానికి ఏ ప్రయత్నమూ చేయకపోవడం చూస్తే గోరక్షణకు కంకణం కట్టుకున్న వారి ఆగడాలకు బాహాటంగానే పోలీసులు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేకపోలేదు.

గుజరాత్ లో గోరక్షణ సంస్థల ఉల్బణం కొనసాగుతోంది. ఒక అంచనా ప్రకారం ఇలాంటి సంస్థలు 200కు పైగానే ఉన్నాయి. గ్రామ స్థాయిలో కూడా ఈ సంఘాలు వెలిశాయి. వీటికి స్థానిక రాజకీయ నాయకుల మద్దతు ఉంది. ఈ సంస్థలలో అగ్రకులాల వారి పాత్రే ఎక్కువ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

11వ తేదీన చచ్చిన గోవు చర్మం ఒలుస్తున్న దళితుల మీద భయానకమైన దాడికి దిగిన వారు కులం పేరుతో దళితులను దుర్భాషలాడారు. చితగ్గొట్టారు. మేం చచ్చిన గోవు చర్మం మాత్రమే ఒలుస్తున్నామని మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. దళితులను తాళ్లతో కట్టేశారు. చితకబాదిన తర్వాత ఒక కారుకు కట్టి ఊరేగించారు. బతికి ఉన్న గోవు చర్మమే ఒలిచారని వాదించారు. దాద్రీలో గోమాంసం నిలవ చేశారన్న ఆరోపణతో అఖ్లాఖ్ అనే ముస్లిం యువకుడిని కొట్టి చంపిన రీతిలోనే ఇప్పుడు ఉనాలో దళితుల మీద విరుచుకుపడ్డారు. ఒక్కటే తేడా అప్పుడు గో పరిరక్షకుల గురి ముస్లింలైతే ఇప్పుడు దళితులు. అదీ దళితుల మీద వరసగా కొనసాగుతున్న దాడుల్లో భాగంగానే.

అయితే దళితులు ఈ దాడులను ఎంతమాత్రం సహించబోమని నిరూపిస్తున్నారు. గుజరాత్ లో చాలా చోట్ల నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి. ఈ నిరసనకు సామాజిక మాధ్యమాలు ఉపకరిస్తున్నాయి. ఉనాలో హేయమైన దాడికి దిగిన వారిలో ఓ ఘనుడు ఆ ధాష్టీకాన్ని వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలోకి ఎక్కించాడు. అంతే! ఇక అగ్గి అంటుకుంది. దాడికి గురైన వారు దళితులైతే కావొచ్చు. కాని వారంతా ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడిన వారు. గత కొన్ని దశాబ్దాలుగా దళితులు విద్యావంతులవుతున్నారు. ఇది అగ్ర కులాల వారికి మింగుడుపడడం లేదు. దళితుల అభ్యున్నతి వారికి కంటగింపుగా తయారైంది. అగ్రకులాల్లో అనవసరమైన అభద్రతాభావం పెరిగి అది ఆగ్రహంగా మారుతోంది. దాడి జరిగిన గ్రామంలో మొత్తం రెండువేల ఇళ్లు ఉంటే అందులో దళితుల ఇళ్లు వంద దాకా ఉన్నాయి. అవన్నీ పక్కా ఇళ్లే. ఈ మార్పును అగ్రవర్ణాల వారు జీర్ణించుకోలేక పోతున్నారు.

పాత కక్షలు, దళితులు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవాలన్న స్వార్థ చింతన అగ్రకులాల వారిని ఆగ్రహోదగ్రుల్ని చేస్తున్నాయి. దీనికి ఏదో ఒక సాకు కావాలి. ఈ ఆగ్రహం చివరకు ఓట్లుగా మారాలి. ఒక వర్గం మీద దాడి చేసి మరో వర్గాన్ని సంఘటితం చేయడం ఎన్నికల ఎత్తుగడల్లో చాలా పాత ఎత్తుగడే. దళితుల భూముల మీద ఆ గ్రామ సర్పంచ్ ప్రఫుల్ల భాయ్ కోరాట్ కన్నేశాడు. కాని ఇప్పుడు మాకే కావాల్సినంత భూమి ఉందని దబాయిస్తున్నాడు. ఈ దాడి వెనక దళితుల ఎదుగుదల మీద అక్కసు ఉంది. వారి భూములను ఆక్రమించాలన్న కుట్ర ఉంది. మత రాజకీయల కుతంత్రమూ ఉంది.

నిరసన తెలియజేయడానికి దళితులు విభిన్నమైన పద్దతులు అనుసరిస్తున్నారు. కనీసం 20 మంది ఆత్మహత్యా ప్రయంత్నం చేశారు. దీనికి ఓ దళిత యువకుడు బలయ్యడు. జిల్లా అధికారి కార్యాలయం ఎదుట జంతువుల కళేబరాలు వేశారు. వీధి పోరాటాలకు దిగుతున్నారు. సహజంగానే రాళ్లు రువ్వడం వంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పోరాట మార్గాలలో చాలా వరకు సవ్యమైనవి, ఆమోదయోగ్యమైనవి కాకపోవచ్చు. ఈ పద్ధతులు దళితుల నిస్సహాయ స్థితినుంచి ఉద్భవించినవే. అగ్ర వర్ణాల వారు భయోత్పాతం సృష్టిస్తున్న దశలో బాధితులు తోచిన మార్గాన్ని అనుసరించి నిరసన వ్యక్తం చేయడంలో ఆశ్చర్యం లేదు.

గుజరాత్ లో గోసంరక్షణ సంస్థలు చట్టానికి విరుద్ధంగా భయోత్పాతం సృష్టించడం సమాజంలో చీలికలకు దారి తీస్తుంది. మతం పేరు, కులం పేరు చెప్పి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నించే వారు ఈ మార్గాలనే అనుసరిస్తారు. గోవులను హతమారుస్తున్నారని ఆరోపిస్తూ కబేళాలకు వెళ్లే వాహనాల మీద దాడులు చేస్తున్నారు. దళితుల మీద దాడులను సహించబోమని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో హుంకరించారు. ఆచరణలో ఆ హుంకరింపుల ఫలితం కనిపిస్తే తప్ప దళితులకు రక్షణ ఉండదు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2012లో సురేంద్రనగర్ జిల్లాలోని తంగఢ్ పట్టణంలో పోలీసు కాల్పుల్లో ఒక దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు మోదీ ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదిక కూడా సమర్పించింది. కాని గుజరాత్ ప్రభుత్వం ఇంత వరకు ఆ నివేదికను బయటపెట్టనేలేదు. అలాంటప్పుడు చర్యతీసుకునే అవకాశమే లేదు. కంటి తుడుపు చర్యలు రాజ్ నాథ్ సింగ్ మాటల్లో చెప్పాలంటే ఈ “సాంఘిక దురాచారాన్ని” నిలవరించడానికి తోడ్పడతాయనుకోవడం భ్రమగా మిగిలిపోక తప్పదు.

దాద్రీ సంఘటన రగడను మళ్లీ కెలకడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోవును చంపినందుకు అఖ్లాఖ్ కుటుంబమంతటికీ మరణ శిక్ష విధించాలని కోరుతున్న వారు గుజరాత్ లోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న పక్షానికే చెందిన వారైనప్పుడు ఆ వర్గం దళితులకు ఏ పాటి రక్షణ కల్పిస్తుందో సులభంగానే ఊహించుకోవచ్చు.

ఆర్వీ రామారావ్

First Published:  22 July 2016 9:50 AM GMT
Next Story