తెలుగులో కబాలిని కత్తిరించబోతున్నారు…

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమాకు తొలిరోజు వసూళ్ల వర్షం కురిసింది. సేమ్ టైం, సినిమాకు మిక్స్ డ్ టాక్ కూడా వచ్చేసింది. ఓవరాల్ గా టాలీవుడ్ లో దీనికి యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. దాదాపు 35 కోట్ల రూపాయలు పెట్టి కొన్న సినిమాకు యావరేజ్ టాక్ వచ్చిందంటే… సోమవారం నుంచి థియేటర్లు ఖాళీగా మారడం ఖాయం. అందుకే నిర్మాతలు వెంటనే దిద్దుబాటు చర్యల్లోకి దిగారు. అవసరమైతే రెండున్నర గంటల సినిమాను మరింత కుదించాలని నిర్ణయించారు. తాజా సమాచారం ప్రకారం… సినిమాలోంచి 15 నిమిషాల సన్నివేశాల్ని లేపేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

కబాలి సినిమాకు సంబంధించి సెకెండాఫ్ చాలా నీరసంగా ఉందని అంతా ఒప్పుకున్నారు. ఫ్యాన్స్ ను పక్కనపెడితే… ప్రతి ప్రేక్షకుడు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. సెకెండాఫ్ ను చాలా సాగదీశారని కామెంట్స్ వినిపించాయి. కీలకమైన సెకెండాఫ్ పై ఇలాంటి కామెంట్స్ రావడంతో… సెకెండాఫ్ నుంచే 15 నిమిషాల సన్నివేశాల్ని కత్తిరించాలని తెలుగు నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించి తమిళ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు. రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కత్తిరంపులు మొదలైపోతాయి.