Telugu Global
CRIME

హ‌త్య‌ల‌కు ఇప్ప‌డు తీవ్ర‌ కార‌ణాలు అక్క‌ర్లేదు....కారుకి బైక్ త‌గిలినా చాలు!

ఇదివ‌ర‌కు హ‌త్య అంటే ఎంతో పెద్ద విష‌యం…ఎన్నో ఏళ్ల ప‌గ‌లు, క‌క్ష‌లు కార్ప‌ణ్యాలు హ‌త్య‌ల‌కు దారితీస్తాయ‌ని అనుకునేవారు. కానీ ఇప్ప‌టి ప‌రిస్థితి వేరు…కారుని ఓవ‌ర్ టేక్ చేసినా, చిన్న కామెంట్ చేసినా… అవి దారుణ‌మైన హ‌త్య‌ల‌కు దారితీస్తున్నాయి. ముఖ్యంగా మ‌ద్యం మ‌త్తు ఇలాంటి నేరాల్లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. నంధ్యాల వైద్యుడు శైలేంద్ర రెడ్డి (38)హ‌త్య వెనుక ఉన్న కార‌ణం కూడా అలాంటిదే. అనుకోకుండా జ‌రిగిన ఒక చిన్న సంఘ‌ట‌న త‌న ప్రాణం మీద‌కు తెస్తుంద‌ని పాపం […]

ఇదివ‌ర‌కు హ‌త్య అంటే ఎంతో పెద్ద విష‌యం…ఎన్నో ఏళ్ల ప‌గ‌లు, క‌క్ష‌లు కార్ప‌ణ్యాలు హ‌త్య‌ల‌కు దారితీస్తాయ‌ని అనుకునేవారు. కానీ ఇప్ప‌టి ప‌రిస్థితి వేరు…కారుని ఓవ‌ర్ టేక్ చేసినా, చిన్న కామెంట్ చేసినా… అవి దారుణ‌మైన హ‌త్య‌ల‌కు దారితీస్తున్నాయి. ముఖ్యంగా మ‌ద్యం మ‌త్తు ఇలాంటి నేరాల్లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది.

నంధ్యాల వైద్యుడు శైలేంద్ర రెడ్డి (38)హ‌త్య వెనుక ఉన్న కార‌ణం కూడా అలాంటిదే. అనుకోకుండా జ‌రిగిన ఒక చిన్న సంఘ‌ట‌న త‌న ప్రాణం మీద‌కు తెస్తుంద‌ని పాపం ఆయ‌న ఊహించి ఉండ‌రు. శైలేంద్ర రెడ్డి గాజులపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా ప‌నిచేస్తున్నారు. సోమ‌వారం రాత్రి ప‌న్నెండున్న‌ర‌కు ఆయ‌న త‌న కారులో అక్క నిర్మలాదేవి కుమారుడు శ‌ర‌త్ చంద్రారెడ్డిని హైద‌రాబాద్ బ‌స్ ఎక్కించేందుకు ఆర్టీసి బ‌స్టాండుకి వెళ్లారు. ఆయ‌న‌తో పాటు సోద‌రుడు మ‌ధుసూద‌న్ రెడ్డి, గ్రామ‌స్తులు షేక్ మాబు, మ‌హ‌బూబ్ బాషా కూడా ఉన్నారు.

అక్క కుమారుడిని బ‌స్ ఎక్కించాక తిరిగి ఇంటికి వెళ్లేందుకు శైలేంద్ర రెడ్డి కారుని రివ‌ర్స్ చేస్తుండ‌గా వెనుక‌నున్న బైక్‌కి త‌గిలింది. ఈ విష‌యంపై స్థానిక ఉప్ప‌రిపేట‌కు చెందిన స‌ల్మాన్‌, వలి, ఇమ్రాన్‌, ముజీబ్‌లు ఆయ‌న‌తో గొడ‌వ ప‌డ్డారు. ఘ‌ర్ష‌ణ‌ని పెంచ‌డం ఇష్టంలేని శైలేంద్ర‌, ఆయ‌న సోద‌రుడు వారికి స‌ర్దిచెప్పి తిరిగి ఇంటికి వెళుతున్నారు. అయితే ఆ న‌లుగురు యువ‌కులు కారుని వెంటాడి శ్రీనివాస సెంట‌ర్‌లో కారుని అడ్డుకున్నారు. శైలేంద్ర‌ను కిందికి లాగి ఆయ‌న‌పై దాడి చేశారు. ఇమ్రాన్, వలీ ఆయ‌న‌ను ప‌ట్టుకోగా, స‌ల్మాన్ రాయితో కొట్టాడు. త‌ల‌కు తీవ్ర‌ గాయ‌మైన శైలేంద్ర అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయారు. మ‌ధుసూద‌న రెడ్డితో పాటు ఆయ‌న‌తో ఉన్న‌వారు క‌లిసి శైలేంద్ర‌ను ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం లేక‌పోయింది. శైలేంద్ర మృతి చెందారు.

శైలేంద్ర హత్య అనంత‌రం న‌లుగురు నిందితులు ఆర్టీసి బ‌స్టాండుకి వెళ్లి టిఫిన్ చేసిన‌ట్టుగా సిసి కెమెరాల్లో రికార్డ‌యింది. వారు చేతులు క‌డుక్కుంటూ రాయితో ఎలా కొట్టారో చెప్పుకుంటున్న దృశ్యాలు అందులో రికార్డ‌య్యాయి. సిసి కెమెరా దృశ్యాల‌ను ప‌రిశీలించిన మ‌ధుసూద‌న రెడ్డి, అత‌ని అనుచ‌రులు దుండ‌గుల‌ను గుర్తించ‌డంతో పోలీసులు వారి ఇళ్ల‌పై దాడి చేసి న‌లుగురిని అదుపులోకి తీసుకున్నార‌ని తెలుస్తోంది. నిందితులు మ‌ద్యం మ‌త్తులో ఉన్నార‌ని పోలీసులు చెబుతున్నారు.

ప్ర‌జ‌ల అభిమానం చూర‌గొన్న ఒక వైద్యుడు….ఒక చిన్న కార‌ణంతో ఇంత దారుణంగా హ‌త్య‌కు గుర‌వ‌టం ఆ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సైతం క‌ల‌చివేసింది. శైలేంద్ర‌ని చూడ‌టానికి గాజుల‌ప‌ల్లె వాసులు వేలాదిగా త‌ర‌లివ‌చ్చారు. క‌ళ్ల‌ముందు ఆరోగ్యంగా తిరుగుతున్న శైలేంద్ర రెడ్డి మ‌ర‌ణం ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ఇంకెంత‌గా కుంగ‌దీసి ఉంటుందో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. మ‌ద్యం మ‌త్తు, క్ష‌ణికావేశం లాంటి పేర్లు ఎన్ని పెట్టుకున్నా ఇలాంటివి పున‌రావృతం కాకుండా చూడాల్సిన అవ‌స‌రం ఉంది.

First Published:  27 July 2016 3:00 AM GMT
Next Story