పోరాట పంథా మార్చిన ఇరోం షర్మిల

సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దయ్యేలా చూడడం కోసం 16 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఇరోం షర్మీల వచ్చే ఆగస్టు 9వ తేదీన సుదీర్ఘమైన నిరాహార దీక్ష ముగించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జరగనున్న మణిపూర్ శాసన సభ ఎన్నికలలో పోటీ చేస్తానని, పెళ్లి చేసుకుంటానని కూడా ఆమె ప్రకటించారు. 28వ ఏట నిరాహార దీక్ష ప్రారంభించిన షర్మీలాకు ఇప్పుడు 44 ఏళ్లు. 

సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించేదాకా నిరాహార దీక్ష విరమించబోనని, జుట్టు ముడివేయనని ప్రతిజ్ఞ చేసిన షర్మీలా తాజా నిర్ణయానికి కారణం ఏమిటో తెలియదు. ఆమె పదహారేళ్లుగా కొనసాగిస్తున్న పోరాటానికి మద్దతిస్తున్న ఆమె అన్న సింఘజిత్ ను కాని, ఆమెకు అండగా నిలిచిన మానవ హక్కుల సంఘాలను గాని, ఇతర స్వచ్ఛంద సంస్థలను గాని ఈ నిర్ణయం తీసుకునే ముందు షర్మీల సంప్రదించిన దాఖలాలు లేవు. నిరాహార దీక్ష ప్రారంభించినప్పుడు తన తల్లిని కూడా కలుసుకోబోనని షర్మీలా చెప్పారు. ఆమె తల్లి శాఖి దేవిని కూడా షర్మీలాను ఉంచిన ఆస్పత్రిలోనే చేర్పించినప్పుడు మాత్రం తల్లీ కూతుర్లు కలుసుకునే అవకాశం వచ్చింది. 

Activist Irom Chanu Sharmila acquitted in 2006 suicide attempt case, coming out of Patiala House court in new delhi on wednesday.------toi photo

మణిపూర్ రాజధాని ఇంఫాల్ పొలిమేరల్లోని మలోంలో 2000 సంవత్సరం నవంబర్ 2న అస్సాం రైఫిల్స్ దళాల వారు 10 మంది అమాయకులను నిర్దాక్షీణ్యంగా కాల్చి చంపిన సంఘటనతో కలత చెందిన షర్మీల అదే సంవత్సరం నవంబర్ అయిదున ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అమాయక జనాన్ని బలిగొన్న భద్రతా దళాల వారి మీద ఇంతవరకు ఏ చర్యా తీసుకోలేదు.

నిరాహార దీక్ష శాంతియుత పోరాట పద్ధతుల్లో ప్రధానమైంది. మహాత్మా గాంధీతో సహా ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది ఈ ఆయుధాన్ని వినియోగించుకున్నారు. మహాత్మా గాంధీ 17 సందర్భాలలో నిరాహార దీక్ష చేశారు. ఆయన ఒక రోజు నుంచి మొదలుకుని 21 రోజులదాకా నిరాహార దీక్ష చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ప్రయోగించిన ఈ అస్త్రానికి బెదిరి గాంధీ కోర్కెను బ్రిటిష్ ప్రభుత్వం మన్నించిన సంఘటనలూ ఉన్నాయి. కాని “ఘనత వహించిన” భారత ప్రభుత్వం మాత్రం ఇరోం షర్మీలా దీక్షకు తలొగ్గకూడదనే నిర్ణయించుకుంది. కర్కోటకమైన ఈ చట్టాన్ని కొనసాగించడంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయమే ఉంది. 

ఈ పోరాట పద్ధతి వల్ల తన లక్ష్యం నెరవేరే అవకాశం మృగ్యం అయినందువల్లే షర్మీల నిరాహార దీక్ష విరమించి ఎన్నికలలో పోటీ చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతులలో పోరాటం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. షర్మీలా నిరాహార దీక్ష ప్రస్తుతానికి ఫలితం ఇచ్చి ఉండకపోవచ్చు. కాని కిరాతకమైన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించవలసిన అగత్యం ఏమిటో ఆమె దేశవాసుల దృష్టికే కాక యావత్ప్రపంచం దృష్టికి తీసుకు రావడంలో సఫలమయ్యారు. అందువల్ల ఆమె నిరుపమానమైన త్యాగం వృథా కాలేదనుకోవాలి. ప్రపంచ చరిత్రలోనే ఇంత సుదీర్ఘకాలం నిరాహార దీక్ష చేసిన వారెవరూ లేరు.

షర్మీల దీక్ష ప్రభావం అసలే లేదనీ అనలేం. 2004 ఆగస్టులో కాంగ్రెస్ అధీనంలోని ఓక్రం ఇబోబి సింగ్ ప్రభుత్వం ఏడు శాసన సభా నియోజక వర్గాల పరిధిలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అమలును నిలిపి వేసింది. రాష్ట్రం అంతటా ఈ చట్టం అమలును తొలగించింది త్రిపురలోని వామపక్ష ప్రభుత్వం మాత్రమే. 

నిరాహార దీక్ష శాంతియుతమైందే. అహింసాయుతమైందే. కాని శాంతియుతంగా ఈ పద్ధతిలో పోరాడే వారిని మన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఆదరించిన, అర్థం చేసుకున్న దాఖలాలు మాత్రం లేవు. 1958 సెప్టెంబర్ 11న అమలులోకి వచ్చిన ఈ చట్టం ఈశాన్య రాష్ట్రాలలోనూ, కశ్మీర్ లోనూ అమలవుతోంది. విద్రోహకర కార్యకలాపాలను అణచివేసే పేరుతో సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలు కల్పించడానికి ఉద్దేశించిన చట్టం ఇది.

నిరాహార దీక్ష చేయడం అంటే ఆత్మ హననానికి పాల్పడడమని భారత శిక్షా స్మృతి చెప్తోంది. కనక అహింసాయుత పద్ధతిలో నిరాహార దీక్ష చేసే వారు ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం వారిని అరెస్టు చేస్తుంది. వారికి బలవంతంగా పోషక పదార్థాలు అందించి వారు ప్రాణాలు తీసుకోకుండా చూస్తుంది. ఇరోం షర్మీల విషయంలోనూ గత పదహారేళ్లుగా ఇదే కొనసాగుతోంది. ప్రభుత్వం ఆమెను నిర్బంధంలో ఉంచింది. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జవహర్ లాన్ నెహ్రూ ఆసుపత్రిలో ఉంచింది. కాని ఆమె జైలులో ఉన్నట్టే లెక్క. శాంతియుత పద్ధతుల్లో చేస్తున్న నిరాహార దీక్షలను బలవంతంగా ఆహార పదార్థాలు అందించి మాన్పించడం ప్రభుత్వ బలప్రయోగానికి పాల్పడడం కిందే జమ. 

శాంతియుతంగా ఉద్యమించే హక్కు ప్రజలకు ఉంది అని ప్రజాస్వామ్య వ్యవస్థ గుర్తిస్తుంది. కాని శాంతియుతంగా పోరాడే వారి కోర్కెలు ఎంత న్యాయమైనవైనా ఖాతరు చేయదు. ఉద్యమాలు హింసాత్మకంగా మారితే గాని ప్రభుత్వాలు కళ్లు తెరవవు. అలా కళ్లు తెరిచినప్పుడల్లా కర్కోటకమైన చట్టాలను రూపొందించి అమాయకుల ప్రాణాలూ తీస్తుంది. ఇదంతా ప్రజాస్వామ్యం పేర రాజ్యం కొనసాగించే హింసే. ప్రజల ఆకాంక్షలను, వాటిని సాధించుకోవడం కోసం జరిగే ఉద్యమాలను అణచడానికి సాధారణంగా ప్రభుత్వాలు ఆశ్రయించేది బలప్రయోగ విధానాన్నే. రాజ్య హింసకు శాంతి భద్రతల పరిరక్షణ అన్న ముద్దు పేరు పెడతారు. 

సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కిరాతకమైందని మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కూడా అంగీకరించారు. దాని స్థానంలో మరో చట్టం తీసుకురావాల్సిన అగత్యం ఉందని అంగీకరించారు. కాని చేసింది ఏమీలేదు. శాంతియుత పోరాట పద్ధతులను పరిగణనలోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దే సంస్కారం ఉన్న “ప్రజాస్వామ్య” ప్రభుత్వాలు ఇంకా మన దేశంలో అనుభవంలోకి రావాల్సే ఉంది. నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ కొనసాగించిన శాంతియుత నిరసన పద్ధతులు ఫలించలేదు. జలదీక్షలకూ అదే గతి పట్టింది. గుజరాత్, మధ్యప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలను గాంధేయ పద్ధతులు ఏ మాత్రం కదిలించలేక పోయాయి. పైగా ఇలాంటి ఉద్యమకారులను అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేశారు. ఈ స్థితిలో ఎన్నేళ్లు నిరాహార దీక్ష కొనసాగించినా ప్రయోజనం లేదని షర్మీల భావించి ఉండవచ్చు. అందుకే ఆమె మరో పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నట్టున్నారు. 

షర్మీల దీక్ష ముగించినంత మాత్రాన మణిపూర్ సమస్య పరిష్కారం అవుతుందనుకోలేం. అక్కడ చిన్నా పెద్ద కలిసి 40 మిలిటెంట్ సంస్థలు పని చేస్తున్నాయి. అందులో కొన్ని మణిపూర్ కు స్వాతంత్ర్యం కావాలని కోరేవి కూడా ఉన్నాయి. మణిపూర్ ఒకప్పుడు స్వతంత్రమైంది. మహారాజా బోధ్ చంద్ర సింగ్ 1949లో ఆ ప్రాంతాన్ని భారత్ లో విలీనం చేశారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచి విలీనానికి బలవంతంగా ఒప్పించారన్న ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి.

ప్రజల ఆకాంక్షలను గుర్తించడం, ఆ ఆకాంక్షలను నెరవేర్చుకోవడం కోసం వివిధ రకాల ఉద్యమ బాట పట్టే వర్గాలను సంప్రదించడం “మన ప్రజాస్వామ్య” వ్యవస్థలో సాధ్యమయ్యే పనిలా లేదు. ప్రజా సంక్షేమం కోసం పాటు పడితే తప్ప మణిపూర్ లో అగ్ని గుండం చల్లారదని షర్మీల వాదించడంలో ఆంతర్యం ఇదే. ఈ ప్రజాస్వామ్యం బూటకం అని కూడా షర్మిల గతంలో అభిప్రాయ పడ్డారు. కాని ఆమె అభిప్రాయాలు క్రమేణా మారినట్టు కనిపిస్తోంది. గతంలో ఆం ఆద్మీ పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వడానికి ముందుకొచ్చినా అంగీకరించలేదు. ఇప్పుడు మనసు మార్చుకుని ఎన్నికల గోదాలోకి దిగాలనుకుంటున్నారు. ఆమె రాజకీయ ప్రస్థానం కచ్చితంగా గమనించదగిందే. 

-ఆర్వీ రామారావ్