ఆగ‌స్టు 15న ఆప్‌లో చేర‌నున్న సిద్ధూ

రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి, బీజేపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి ఇటీవ‌ల రాజీనామా చేసిన మాజీ క్రికెట‌ర్ న‌వ‌జోత్ సింగ్ సిద్ధూ ఆగ‌స్టు 15న ఆప్‌లో చేర‌నున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆప్ అధ్య‌క్షుడు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సిద్ధూ చేరిక‌పై ఒక ప్ర‌క‌ట‌న చేస్తార‌ని తెలుస్తోంది. 2017లో పంజాబ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. ఈ ఎన్నిక‌ల్లో సిద్ధూ ఆప్ త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హిస్తార‌ని స‌మాచారం. 2009లో సిద్ధూ అమృత్‌స‌ర్ నియోజ‌క వ‌ర్గం నుంచి పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. 2014 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో  ఆయ‌న‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వ‌కుండా మొండి చేయి చూపింది. ఎంతో క‌ష్ట‌ప‌డి త‌న నియోజ‌క వ‌ర్గాన్ని అభివృద్ధి చేసినా, త‌న‌ను బీజేపీ గుర్తించ‌లేద‌ని సిద్ధూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పంజాబ్ రాష్ట్రానికి దూరంగా వెళ్లి ప‌ని చేయాల‌ని బీజేపీ ఆదేశించినందునే తాను బీజేపీకి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు సిద్ధూ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. బీజేపీ నాయ‌క‌త్వంపై ఆయ‌న తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.