Telugu Global
Others

మారణ హోమం గుట్టువిప్పే గుజరాత్ ఫైల్స్

“ఎవరైనా దాచి పెడ్తున్న దాన్ని వెలికి తీయడమే అసలైన వార్త; మిగతాదంతా వ్యాపార ప్రకటనే” అన్నారు విలియం రాండోల్ఫ్ హెర్స్ట్. వార్తకు ఇంతకన్నా మెరుగైన నిర్వచనం ఇచ్చిన వారు లేరు. అసలైన వార్త సేకరించడం కోసం నిబద్ధ పత్రికా రచయితలు నానా అగచాట్లు పడవలసి వస్తుంది. గుజరాత్ మారణ కాండ జరిగి ఎనిమిదేళ్లయిన తర్వాత దానికి బాధ్యులు ఎవరో కనుక్కోవడానికి అప్పుడు తెహెల్కా పత్రికలో పని చేస్తున్న పరిశోధనాత్మక పత్రికా రచయిత్రి రాణా అయూబ్ అసమానమైన ధైర్య […]

మారణ హోమం గుట్టువిప్పే గుజరాత్ ఫైల్స్
X

RV Ramarao“ఎవరైనా దాచి పెడ్తున్న దాన్ని వెలికి తీయడమే అసలైన వార్త; మిగతాదంతా వ్యాపార ప్రకటనే” అన్నారు విలియం రాండోల్ఫ్ హెర్స్ట్. వార్తకు ఇంతకన్నా మెరుగైన నిర్వచనం ఇచ్చిన వారు లేరు.

అసలైన వార్త సేకరించడం కోసం నిబద్ధ పత్రికా రచయితలు నానా అగచాట్లు పడవలసి వస్తుంది. గుజరాత్ మారణ కాండ జరిగి ఎనిమిదేళ్లయిన తర్వాత దానికి బాధ్యులు ఎవరో కనుక్కోవడానికి అప్పుడు తెహెల్కా పత్రికలో పని చేస్తున్న పరిశోధనాత్మక పత్రికా రచయిత్రి రాణా అయూబ్ అసమానమైన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. తన పేరు మైథిలి త్యాగిగా మార్చుకుని, గుజరాత్ మీద డాక్యుమెంటరి చిత్రం నిర్మించడానికి అమెరికాలోని ఒక చలన చిత్ర సంస్థ నుంచి వచ్చానని నమ్మించి సమాచారం సేకరించారు.

Gujarat Files
రచయిత్రి రాణా అయూబ్

2010-11లో ఎనిమిది నెలలపాటు గుజరాత్ లో గడిపి పోలీసు ఉన్నతాధికారులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను, గుజరాత్ లో ఎదురుకాల్పుల్లో సోహ్రాబుద్దీన్ ను అంతమొందించిన సమయంలో హోం మంత్రిగా, ప్రస్తుతం బీజేపీ అధ్యక్షులుగా ఉన్న అమిత్ షాను, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని కలుసుకుని రాణా అయూబ్ విలువైన సమాచారం సేకరించారు. గుజరాత్ హోం మంత్రిగా పని చేసిన హరేన్ పాండ్య హత్యకు సంబంధించి, బాగా ప్రచారంలోకి వచ్చిన సొహ్రాబుద్దీన్, కౌసర్ బీ, తులసి ప్రజాపతి వంటి వారి బూటకపు ఎన్ కౌంటర్లకు సంబంధించిన కూపీ లాగారు. అయితే ఇదంతా రహస్యంగా సేకరించిన (స్టింగ్ ఆపరేషన్) సమాచారమే.

మామూలు పద్ధతుల్లో సమాచారం రాబట్టడం అసాధ్యమైనప్పుడు పత్రికా రచయితలు రహస్య పద్ధతులు అనుసరించవలసిన అగత్యం ఉంటుంది. ఇది నైతికమా, అనైతికమా అన్న మీమాంస పక్కన పెట్టి ప్రజాప్రయోజన దృష్టితో చూస్తే ఈ సమాచారానికి అపారమైన విలువ ఉంటుంది. నిష్పాక్షికమైన దర్యాప్తుకు ఉపకరిస్తుంది. దోషులను బోనెక్కించడానికి అవకాశం ఉంటుంది.

రాణా అయూబ్ ను ఈ రహస్య సమాచార సేకరణకు నియోగించిన తెహెల్కా పత్రిక తీరా ఆ పని పూర్తి అయిన తర్వాత ఈ విలువైన సమాచారాన్ని ప్రచురించడానికి వెనుకాడింది. రాణా అయూబ్ ఈ సమాచారాన్ని ప్రచురించడానికి అనేక ప్రచురణ సంస్థలను సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేనందువల్ల చివరకు ఆమె సొంతగా ఈ సమాచారాన్నంతటినీ “గుజరాత్ ఫైల్స్” అన్న పేరుతో ఇటీవలే గ్రంథంగా ప్రచురించారు.

ఆమె సేకరించిన సమాచారం సంపూర్ణంగా కొత్తది కాకపోవచ్చు. వాస్తవం ఏమైనా ఆమె రాసిన విషయాలన్నీ ఏదో్ రూపంలో ప్రచారంలో ఉన్నవే. గుజరాత్ మారణ కాండ మీద దర్యాప్తు చేయడానికి కమిషన్లు ఏర్పాటయ్యాయి. స్వతంత్రంగా విచారణ జరిపిన ప్రముఖులున్నారు. స్వచ్ఛంద సంస్థలూ ఉన్నాయి. దర్యాప్తు సంఘాల వారు ప్రశ్నించినప్పుడు పెదవి విప్పని, గుర్తు లేదని చెప్పి తప్పించుకున్న పోలీసు అధికారులు సైతం రాణా అయూబ్ వారితో ముచ్చటించినప్పుడు అసలు విషయం ఒప్పేసుకున్నారు. మనసు విప్పి మాట్లాడారు. రాణా సేకరించిన సమాచారంలో చాలా వరకు సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సేకరించిన సమాచారంతో సరిపోలుతోంది. సేకరించిన సమాచారంలో అదనపు సాక్ష్యాలు తక్కువే కావొచ్చు.

రాణా ముందు పెదవి విప్పిన వారిలో అప్పటి మోదీ ప్రభుత్వానికి అంటకాగి, తమ విద్యుక్త ధర్మాన్ని విస్మరించి రాజకీయ నాయకత్వం ఒత్తిడులకు లొంగి అక్రమాలకు, బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడిన పోలీసు ఉన్నతాధికారులున్నారు. రాజకీయ నాయకులకు తాబేదార్లుగా మారడానికి నిరాకరించి ఏ మాత్రం ప్రాధాన్యత లేని స్థానాలకు బదిలీ అయి పోయి కునారిల్లిన వారూ ఉన్నారు. చేసిన పాపాలకు పశ్చాత్తాప పడిన వారూ ఉన్నారు.

Gujarat Files 1గుజరాత్ మారణ కాండలో మోదీ ప్రమేయం ఉందని నమ్మేవారు ఉన్నట్టే అసలే లేదనే వారికీ కొదవలేదు. మారణ కాండ జరుగుతూ ఉంటే ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించి తన ధర్మాన్ని పాటించలేదన్న ఆరోపణలు మారణ హోమం జరిగిన పదిహేనేళ్ల తర్వాత కూడా సమసి పోలేదు. రాణా సేకరించిన సమాచారాన్ని లోతుగా పరిశీలిస్తే ఆ మారణ కాండ మోదీ, అమిత్ షా రాజకీయ ఎదుగుదలకు పెద్ద నిచ్చెనగా ఎలా ఉపకరించిందో అర్థం అవుతుంది. మోదీ మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన మాయా కొద్నానీకి నరోదా పాటియా మూకుమ్మడి హత్యాకాండతో సంబంధం ఉందని నిర్ధారించి న్యాయస్థానం ఆమెకు 28 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించడం, బూటకపు ఎన్ కౌంటర్ల కేసులో అమిత్ షా అరెస్టు కావడం, ఆయన తన స్వరాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీలు లేదని న్యాయస్థానం ఆదేశించడం 2002 నాటి మారణ కాండతో అప్పటి మోదీ ప్రభుత్వానికి సంబంధం ఉందన్న వాదనలకు బలం చేకూర్చే అంశాలే. మోదీ “హిందూ హృదయ సామ్రాట్” గా ప్రసిద్ధుడు కావడానికి తోడ్పడిన విషయాలే.

మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత గుజరాత్ మారణ హోమం ఆధారంగా ఆయన మీద విరుచుకుపడ్తున్న వారు ప్రస్తుతం కనిపించకపోవచ్చు. మోదీ మీద పడ్డ మచ్చ అధికార బలం కారణంగా మరుగున పడి ఉండొచ్చు. మోదీని దోషి అని తేల్చడానికి తగిన సాక్ష్యాధారాలు న్యాయస్థానాలకు కనిపించి ఉండకపోవచ్చు. గోధ్రా సంఘటన తర్వాత ఆగ్రహోదగ్రులైన హిందువుల ఆగడాలను నిరోధించకుండా పోలీసులను మోదీ ఆదేశించారన్న వాదనలకు లిఖితపూర్వక ఆధారాలు దొరికి ఉండకపోవచ్చు. కాని ఆ వేడిలోనే అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి “రాజధర్మం” పాటించాలని మోదీకి చెప్పిన హితవు నిష్కారణమైంది కాదు అనడానికి గుజరాత్ ఫైల్స్ గ్రంథం ఊతమిస్తుంది.

“హరేన్ పాండ్య కేసు ఓ అగ్ని పర్వతం. నిజం బయట పడితే మోదీ ఇంటికెళ్లాల్సిందే. ఇంటికెళ్లడం కాదు. జైలుకెళ్తారు. ఆయన జైలులో ఉంటారు” అని హరేన్ పాండ్య కేసులో మొదటి విచారణాధికారిగా ఉన్న వై.ఎ. షేక్ రాణాతో చెప్పారు. ఇలాంటి ఒప్పుకోళ్లు ఈ గ్రంథం నిండా అనేకం ఉన్నాయి. గుజరాత్ అల్లర్ల సమయంలో రాజకీయ నాయకులు-పోలీసులు కుమ్మక్కయిన తీరుకు ఈ గ్రంథంలో అనేక దాఖలాలు కనిపిస్తాయి.

అంతే కాదు నిప్పుల్లో చింతపిక్కలు ఏరే పనిని దళితులైన పోలీసు ఉన్నతాధికారులకు మాత్రమే అప్పగించిన వైనమూ కనిపిస్తుంది. రాజ్య వ్యవస్థ కనుసన్నల్లో జరిగిన అకృత్యాలన్నింటిలో పాత్ర ధారులు రాజన్ ప్రియదర్శి, డి.వంజర, రాజ్ కుమార్ పాండ్యన్, అమీన్, పర్మార్ మొదలైన వారందరూ దళిత ఉన్నతాధికారులే. “దళిత పోలీసు అధికారుల చేత తడిగుడ్డతో గొంతులు కోయిస్తారు. ఎందుకంటే వారికి ఆత్మగౌరవం, ఆదర్శాలు ఉండవనుకుంటారు” అని ప్రియదర్శి చెప్పినట్టు రాణా రహస్యంగా రికార్డు చేసిన టేపుల్లో ఉంది.

అయితే విచిత్రం ఏమిటంటె ఈ గ్రంథం విడుదలైన తర్వాత రాణాతో ఆ మాటలు చెప్పిన వారెవరూ తాము అలా చెప్పలేదని అనడం లేదు. మోదీ సమర్థకులు సైతం వీటిని మొక్కుబడిగా తప్ప గట్టిగా ఖండించడంలేదు. బహుశా ఇది ప్రస్తుతం వారికి రాజకీయ దృష్టితో అనువైన సమయం కాక పోవచ్చు. ఈ టేపులపై ఫోరెన్సిక్ పరిక్ష నిర్వహించలేదని గమనించాలి. హిందువుల అఘాయిత్యాలను చూసి చూడకుండా ఉండాలని మోదీ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారన్న ఆరోపణలున్నాయి. సంజీవ్ భట్ అనే పోలీసు అధికారి సదరు సమావేశంలో ఉన్నానని చేసిన వాదన కేవలం బుకాయింపేనని రాణా గ్రంథం అనుమానాలకు తావు లేకుండా నిరూపించింది. కాని ఈ ఆదేశాలను అమలు పరిచిన తీరు ఏమిటో కూడా నిరూపించింది.

సిట్ దర్యాప్తు క్రమంపై న్యాయస్థానానికి సలహా ఇవ్వడం కోసం సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ ను నియమించింది. గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్రను నిరూపించడానికి అప్పుడు ఆయనకు అందుబాటులో ఉన్నదల్లా సిట్ దర్యాప్తు ఫలితాలు మాత్రమే. సంజీవ్ భట్ లాంటి వారి కూట వాదనలే. రాణా అయూబ్ గ్రంథం అప్పుడు వెలువడలేదు. రాణా బయట పెట్టిన అంశాల ఆధారంగా, వాటి మంచి చెడ్డలను విచారించి గుజరాత్ మారణ హోమానికి కారకులెవరో దానికి నైతిక బాధ్యత ఎవరిదో తేల్చే అవకాశం రాణా పుస్తకం కల్పిస్తోంది. న్యాయ వ్యవస్థ కళ్లు తెరిపించడానికి ఈ గ్రంథం ఏ మాత్రం ఉపకరించినా రాణా చూపిన సాహసానికి సార్థకత ఉన్నట్టే.

– ఆర్వీ రామారావ్

Click on Image to Read:

swami sachidananda

Nathuram Gadsey

First Published:  29 July 2016 10:26 PM GMT
Next Story