విడాకులు తీసుకోవడం గ్యారెంటీ…

హీరోయిన్ అమలాపాల్-తమిళ దర్శకుడు విజయ్ మధ్య ఉన్న భార్యాభర్తల బంధానికి బీటలువారాయి. వీళ్లిద్దరూ విడాకులు తీసుకోవడం గ్యారెంటీ అనే విషయం తేలిపోయింది. ఈ విషయాన్ని దర్శకుడు విజయ్ స్పష్టంచేశాడు. అవును… మేమిద్దరం విడాకులు తీసుకోవాలనుకుంటున్నామని విజయ్ స్పష్టంగా చెప్పేశాడు. సరిగ్గా రెండేళ్ల కిందట అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్న ఈ జంట… ఇప్పుడు విడాకుల వైపు మొగ్గుచూపడంతో తమిళ-తెలుగు ఇండస్ట్రీలు షాక్ అయ్యాయి. రెండేళ్లకే ఇద్దరి మధ్య పొరపొచ్చాలు రావడం బాధాకరంగా అభివర్ణించాయి. మరోవైపు వీళ్లిద్దరి విడాకుల వ్యవహారంపై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. పెళ్లయిన తర్వాత విజయ్ అమ్మానాన్న వద్దన్నప్పటికీ… అమలాపాల్ నటించడానికే ఇంట్రెస్ట్ చూపిందని… ఇదే విషయం భార్యాభర్తల మధ్య సంబంధాల్ని దెబ్బతీసిందని అంటున్నారు. కానీ ఈ వార్తలో నిజం లేదంటున్నాడు విజయ్. అమలాపాల్ నటిస్తానంటే… తన అమ్మానాన్న ఎప్పుడు అడ్డుచెప్పలేదని… కేవలం కుటుంబంలో కొన్ని సర్దుబాటు సమస్యల వల్లనే ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు వచ్చినట్టు చెబుతున్నాడు. ఆ సమస్యలేంటనే విషయాన్ని మాత్రం విజయ్ పైకి చెప్పడం లేదు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై స్పందించేందుకు అమలాపాల్ అందుబాటులో లేదు. అసలు ఆమె ఇప్పుడు ఎక్కడుందనే విషయాన్ని కూడా మీడియా కనుక్కోలేకపోతోంది. ఏదేమైనా… రెండేళ్లకే ఈ స్టార్ కపుల్ వివాహబంధం ఇలా విడాకులకు దారితీయడం బాధాకరం.