మేం షార్టులు, స్క‌ర్టులు వేసుకుంటే త‌ప్పేంటి?

భోపాల్లో మౌలానా అజాద్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాల‌జీ విద్యార్థినులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేపట్టారు. డ్ర‌స్ కోడ్ నిబంధ‌న‌లు, హాస్ట‌ల్ టైమింగ్స్‌ని కుదించ‌డంపై వారు ఈ నిర‌స‌న‌ని చేప‌ట్టారు. ఈ కాలేజి విద్యార్థినుల‌ను రాత్రి తొమ్మిదిన్న‌ర దాటితే క్యాంప‌స్‌లోని హాస్ట‌ల్‌లోకి రానివ్వ‌టం లేదు. ఆ టైమ్ దాటి వ‌చ్చిన‌వారు వెయిటింగ్ గ‌దిలోనే రాత్రంతా ఉండాల్సి వ‌స్తోంది. దీనిపై విద్యార్థినులు తీవ్రంగా నిర‌స‌న తెలియ‌జేస్తున్నారు.

వీరు చేస్తున్న వాద‌న‌ను బ‌ట్టి వీరికి కాలేజి ఉద‌యం తొమ్మిది నుండి సాయంత్రం ఐదువ‌ర‌కు ఉంటుంది. త‌రువాత అక్క‌డి నుండి నేరుగా కోచింగ్ సెంట‌ర్ల‌కు వెళుతుంటారు. కోచింగ్ క్లాసుల్లో ఆల‌స్య‌మైతే తొమ్మిదిన్న‌ర‌క‌ల్లా క్యాంప‌స్‌కి చేర‌లేక‌పోతున్నారు. దాంతో వారు కాలేజి హాస్ట‌ల్‌లోకి అనుమ‌తి లేక వెయింటింగ్ గ‌దుల్లోనే నిద్ర‌పోతున్నారు. అయితే మ‌గ‌పిల్ల‌ల క్యాంప‌స్‌లో ఇలాంటి నిబంధ‌న‌లేమీ లేవ‌ని వారు చెబుతున్నారు. అంతేకాక‌… షార్టులు, స్క‌ర్టులు ధ‌రించ‌వద్దంటూ త‌మ‌కు డ్ర‌స్‌కోడ్‌ని విధించ‌డం అన్యాయ‌మ‌ని, 21వ శ‌తాబ్దంలో కూడా… మేము షార్ట్స్ ఎందుకు వేసుకోకూడ‌ద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. సౌక‌ర్యాన్ని బ‌ట్టి దుస్తుల‌ను ధ‌రించే అవ‌కాశం త‌మ‌కు ఉంద‌ని, దానిపై ఇత‌రుల పెత్త‌నం ఏమిటని వారు అడుగుతున్నారు. గ‌త నెల 28 నుండి… టైమ్ విష‌యంలో తొమ్మిదిన్న‌ర నిబంధ‌న‌ను , షార్టులు స్క‌ర్టులు ధ‌రించ‌రాద‌నే నిబంధ‌న‌‌ను అమ్మాయిల‌కు విధించారు. కాగా ఇదంతా తాలిబ‌న్ల పాల‌న‌లా ఉంద‌ని, దీనిపై తాము మ‌హిళా క‌మిష‌న్‌కి ఫిర్యాదు చేస్తామ‌ని విద్యార్థినులు హెచ్చ‌రించారు. అయితే డ్ర‌స్‌కోడ్ నిబంధ‌న‌ని స‌డ‌లించిన‌ట్టుగా, టైమ్ ప‌రిమితిని ఇంత‌కుముందు ఉన్న‌ట్టుగా ప‌దిన్న‌ర వ‌ర‌కు ఉంచాల‌నే డిమాండ్‌ని మాత్రం కాలేజి యాజ‌మాన్యం ప‌ట్టించుకోలేద‌ని తెలుస్తోంది.