Telugu Global
Others

హంతకులకు దేశభక్తుల ముసుగా?

కొన్ని నిజాలు ఎంత దాచినా దాగవు. మరి కొన్ని నిజాలను దాచడానికి నిరంతర ప్రయత్నం సాగుతూ ఉంటుంది. 1948 జనవరి 30 న మహాత్మా గాంధీ హత్య వెనక హస్తం ఆర్.ఎస్.ఎస్. దే అన్నది దాచినా దాగని సత్యం. కాని ఆర్.ఎస్.ఎస్. ఇంతవరకు ఆ సత్యాన్ని అంగీకరించలేదు. మహాత్మా గాంధీని హతమార్చిన నాథూరాం గాడ్సే ఈ హత్య చేసినప్పుడు ఆర్.ఎస్.ఎస్. సభ్యుడు కాడు అని వాదించడానికే ప్రయత్నించింది. కాని నాథూ రాం గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సే […]

హంతకులకు దేశభక్తుల ముసుగా?
X

RV Ramaraoకొన్ని నిజాలు ఎంత దాచినా దాగవు. మరి కొన్ని నిజాలను దాచడానికి నిరంతర ప్రయత్నం సాగుతూ ఉంటుంది. 1948 జనవరి 30 న మహాత్మా గాంధీ హత్య వెనక హస్తం ఆర్.ఎస్.ఎస్. దే అన్నది దాచినా దాగని సత్యం. కాని ఆర్.ఎస్.ఎస్. ఇంతవరకు ఆ సత్యాన్ని అంగీకరించలేదు. మహాత్మా గాంధీని హతమార్చిన నాథూరాం గాడ్సే ఈ హత్య చేసినప్పుడు ఆర్.ఎస్.ఎస్. సభ్యుడు కాడు అని వాదించడానికే ప్రయత్నించింది. కాని నాథూ రాం గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సే తాను, తన సోదరుడు నాథూరాం గాడ్సే ఎప్పుడైనా ఆర్.ఎస్.ఎస్. భావజాలానికి నిబద్ధులమై ఉన్న వాళ్లమేనని చెప్పారు.

జరిగిన పొరపాటును అంగీకరించడానికి అపారమైన మానసిక స్థైర్యం ఉండాలి. మే 27వ తేదీన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబాబా హిరోషిమా శాంతి పార్కుకు వెళ్లి అక్కడ పుష్పగుచ్ఛమైతే ఉంచారు కాని 1945 ఆగస్టు ఆరున, ఆ తర్వాత మరో మూడు రోజులకు నాగసాకి మీద అణుబాంబులు కురిపించినందుకు క్షమాపణ మాత్రం చెప్పలేదు. 1984లో ఉత్తరాదిన, ప్రధానంగా దిల్లీలో సిక్కుల మారణకాండ తర్వాత కాంగ్రెస్ కూడా క్షమాపణ చెప్పలేదు. 2011లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మాత్రం క్షమాపణ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారం వ్యక్తం చేయడంతో సంతృప్తి పడ్డారు.

గాంధీ హత్య విషయంలో ఆర్.ఎ.స్. ఎస్. ఇప్పటికీ గాడ్సేకు తమకు ఏ సంబంధం లేదు అని నమ్మబలకడానికే ప్రయత్నిస్తోంది. అక్కడితో ఆగకుండా గాంధీ హంతకుడిని దేశ భక్తుడిగా, వీరుడిగా చిత్ర్రించడానికి ప్రయత్నం చేస్తోంది. ఆర్.ఎస్.ఎస్. భావజాలం ఉన్న వారు అధికారంలో ఉన్నప్పుడల్లా ఈ ప్రయత్నాలు మరింత ముమ్మరం అవుతుంటాయి. చరిత్రను వక్రీకరిస్తూ ప్రదీప్ దాల్వీ “మీ నాథూరాం గాడ్సే బోల్తోయ్” అన్న నాటకమే రాశారు. మీరట్ లో గాడ్సే కి ఏకంగా గుడి కట్టారు. గాంధీ హంతకుడైన గాడ్సే తో తమకు సంబంధం లేదని చెప్పడానికి ఆర్.ఎస్.ఎస్. చేయాల్సిన ప్రయత్నమల్లా చేసింది. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మహాసభ మళ్లీ గాడ్సేను దేశభక్తుడిగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. గాడ్సే విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రధాని మోదీనే ఆహ్వానించింది. “డేశ్ భక్త్ నాథూరాం గాడ్సే” అన్న డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించింది. గాంధీ ప్రాణాలు అర్పించిన రోజును శౌర్య దివస్ గా జరపాలని సంకల్పించింది. ఆర్.ఎస్.ఎస్. భావజాలం ఈ చేష్టలకు భిన్నమైంది ఏమీ కాదు.

beyondఈ వాదనలను తిప్పి కొట్టడానికి కావాల్సిన సాక్ష్యాధారాలన్నింటినీ గుది గుచ్చి తీస్తా సెతల్వాద్ 2015లో “బియాండ్ డౌట్- అ డోసియర్ ఆన్ గాంధీస్ అసాసినేషన్” అన్న గ్రంథం వెలువరించారు. గాంధీ హత్య సెక్యులరిజం మీద, ప్రజాస్వామ్యం మీద, వీటికి కట్టుబడి ఉన్న వారి మీద యుద్ధం ప్రకటించడమేనని రుజువు చేయడానికి సెతల్వాద్ తగిన సమాచారాన్ని ఈ గ్రంథంలో చేర్చారు. గాంధీ హత్య “హిందూ రాష్ట్ర” నిర్మాణ సంకల్పాన్ని బలంగా ప్రకటించడమేనని సెతల్వాద్ అంటారు. గాంధీని హతమార్చడమంటే సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా జాతీయోద్యమం ప్రోది చేసిన సకల విలువల్ని నిర్మూలించడమేనన్నది సెతల్వాద్ వాదన.

గాంధీ హత్య వ్యక్తిగత కక్ష వల్ల జరిగింది కాదు. ఆవేశంలో చేసిన హత్యా కాదు. పథకం ప్రకారం గాడ్సే ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. అంతిమంగా గాంధీని హతమార్చడంలో సఫలం కావడానికి జరిగిన హత్యా ప్రయత్నాలతో గాడ్సేకు సంబంధం ఉంది. గాంధీ హత్యకు ఓ రాజకీయ సందర్భం ఉంది. మత తత్వ వాదులు అధికారంలోకి వచ్చినప్పుడల్లా గాంధీ హత్యకు గల కారణాలకు మసి పూయడానికి, గాడ్సేను వీరుడిగా కీర్తించడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

ఆర్.ఎస్.ఎస్. కు నాల్గవ సర్ సంఘ్ చాలక్ గా పని చేసిన రజేంద్ర సింగ్ (రజ్జు భయ్యా) గాడ్సే కిరాతకంగా శాంతి దూత అయిన గాంధీని హతమార్చడాన్ని తప్పుపట్టలేదు. 1999 జనవరి 19 నాటి ఔట్ లుక్ పత్రికలో ప్రచురితమైన ఇంటర్వ్యూలో రజ్జూ భయ్యా “అతని (గాడ్సే) ఉద్దేశం మంచిదే కాని అనుసరించిన మార్గం తప్పు” అని నిర్మొహమాటంగా చెప్పడం గాంధీ హత్య మీద ఆర్.ఎస్.ఎస్. అభిప్రాయం ఏమిటో స్పష్టం చేస్తొంది. గాడ్సే అఖండ భారత్ అన్న సిద్ధాంతంతో ప్రేరిపితుడైన వాడు అని రజ్జూ భయ్యా చెప్పడం కూడా గాడ్సేను సమర్థించడమే.

గాడ్సే మొదట్లో కొంత కాలం కాంగ్రెస్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఆర్.ఎస్.ఎస్. లో చేరాడు. కొంతకాలానికి ఆర్.ఎస్.ఎస్. ను విడనాడాడు. దీనికి కారణం ఆర్.ఎస్.ఎస్. అంతక్రియాశీలం కాదని భావించడమే. గాడ్సే సొంతంగా ఒక సంస్థను కూడా ప్రారంభించారు. ఆయనకు హిందూ మహాసభతోనూ సంబంధం ఉండేది. హిందూ మహా సభ ప్రధాన కార్యదర్శి ఆచార్య మదన్ గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేయడాన్ని సమర్థించడానికి ఏ మాత్రం మొహమాట పడలేదు. “ఒక లక్ష్యం కోసం హత్య చేయడం నేరం కాదు. దేశభక్తుడైన గాడ్సే గాంధీని హత్య చేయడానికి కారణం ఉంది. దేశ విభజన సందర్భంగా జరిగిన కలహాల్లో పది లక్షల మంది హిందువులు మరణించడానికి బాధ్యత గాంధీదే” అని ఆచార్య మదన్ స్పష్టంగానే చెప్పారు. దేశ విభజనకు కారకుడు గాంధీయేనని, అయితే దురదృష్టవశాత్తు దేశాన్ని విడదీసినందుకు గాంధీ మీద చర్య తీసుకోవడానికి ఏ చట్టమూ లేనందువల్ల గాడ్సే చేయాల్సిందే చేశాడు” అని ఆచార్య మదన్ తెగేసి చెప్పారు.

గాంధీ హత్య తర్వాత ఆర్.ఎస్.ఎస్. వారు మిఠాయిలు పంచుకోవడం, అప్పటి ప్రభుత్వం ఆర్.ఎస్.ఎస్.ను నిషేధించడం మొదలైన సంఘటనలన్నీ గాంధీని హతమార్చడం ఆర్.ఎస్.ఎస్.కు సంతోషమే కలిగించిందని చెప్పడానికి కావాల్సిన ఆధారాలన్నింటినీ సెతల్వాద్ సేకరించి ఈ గ్రంథంలో పొందుపరిచారు.

గాంధీని హత్యను సమర్థించడానికి గాడ్సే సమర్థకులు అనేక అసత్యాలను ప్రచారంలో పెట్టారు. ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలన్న వాదనను గాంధీ సమర్థించారు కనక పాకిస్తాన్ ఏర్పడడానికి కారకుడు ఆయనే అన్నది ఈ వాదనల్లో ప్రధానమైంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాకిస్తాన్ కు 55 కోట్లు ఇచ్చి తీరాలని పట్టుబట్టడానికి, కశ్మీర్ పై పాకిస్తాన్ దాడికి తెగబడినా పాకిస్తాన్ కు ఆ డబ్బు అందించేలా చేయడానికి గాంధీ నిరాహార దీక్షకు పూనుకున్నారన్నది మరో వాదన. ఈ వాదన ఎంత అసంబద్ధమైందో నిరూపించడానికి సెతల్వాద్ ఈ గ్రంథంలో తిరుగు లేని ఆధారాలు చూపించారు. ముస్లింలు కయ్యానికి కాలు దువ్వేలా ప్రవర్తిచడానికి గాంధీ ముస్లింలను సంతృప్తి పరచడమేనన్న వాదనలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.

దేశ విభజనకు ముందు ముస్లింలలో కొంత మంది గాంధీని హిందువుల నాయకుడిగానే పరిగణించారు. పాకిస్తాన్ ఏర్పడక పోవడానికి గాంధీనే పెద్ద అడ్డంకి అనుకున్నారు. మరో వైపున హిందువుల్లో కొంత మంది హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాలకు ప్రతీకారం తీర్చుకోకుండా అడ్డుతగులుతున్నది గాంధీయేనని భావించారు. గాంధీ మీద హిందువుల్లో ఉన్న ఈ భావనే కరడు గట్టిన హిందూ భావజాలానికి దారి తీసింది. గాడ్సే అలాంటి భావజాలం కలిగిన వాడే. ఈ భావజాలం కుదుళ్లు ఆర్.ఎస్.ఎస్., హిందూ మహాసభ సిద్ధాంతాల్లో ఉన్నాయి.

1934 నుంచి మొదలై పధ్నాలుగేళ్ల కాలంలో గాంధీ మీద ఆరు సార్లు హత్యా యత్నం జరిగింది. 1934, 1944 జులైలోనూ, సెప్టెంబర్ లోనూ, 1946లోనూ హత్యా యత్నాలు జరిగినప్పుడు పాకిస్తాన్ కు రూ. 55 కోట్లు చెల్లించడం అనే ప్రస్తావన సోదిలో కూడా లేదు. దీన్ని బట్టి ఆ అంశం గాంధీ హత్యకు దారి తీసిందని ప్రచారం చేయడం ఎంత పకడ్బందీగా అల్లిన కట్టుకథో అర్థం అవుతుంది.

గాడ్సే గాంధీని హతమార్చిన సమయంలో గాడ్సేతో తమకు ఏ సంబంధమూ లేదని ఆర్.ఎస్.ఎస్. ఎన్ని కబుర్లు చెప్పినా వాస్తవం ఏమిటో తెలుసుకోవాలనే ఓపిక ఉన్న వారికి ఈ పుస్తకం తోడ్పడుతుంది.

తీస్తా సెతల్వాద్ పత్రికా రచయితగా మొదలై సామాజిక కార్యకర్తగా ఎదిగారు. గుజరాత్ మారణ కాండ బాధితులకు అండగా నిలిచిన పాపానికి ఆమెను బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికీ వేదిస్తూనే ఉన్నాయి. ఎలాగైనా జైలు పాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు.

-ఆర్వీ రామారావ్

Click on Image to Read:

swami sachidananda

Gujarat Files

First Published:  9 Aug 2016 9:00 PM GMT
Next Story