“బాబు బంగారం” సినిమా రివ్యూ

రివ్యూ: బాబు బంగారం
రేటింగ్‌: 2/5
తారాగణం: వెంకటేశ్, నయనతార తదితరులు
సంగీతం: జిబ్రాన్
నిర్మాత: ఎస్. నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్, ఎస్. రాధాకృష్ణ
దర్శకత్వం: మారుతి

దర్శకుడు మారుతికి ప్రేక్షకుల్లో ఆదరణ వుంది. ఎంతోకొంత కామెడి వుంటుందని, బోర్‌ కొట్టించడని నమ్మకముంది. భలేభలే మగాడివోయ్‌ సినిమా ఆ నమ్మకాన్నిపెంచింది. ఇపుడొచ్చిన బాబు బంగారం కూడా అదే లెవల్‌లో వుంటుందని ఆశించారు. కానీ మారుతి నిరాశను మిగిల్చాడు. నిజానికి “భలేభలే” సినిమాలో కూడా కొన్నిచోట్ల కథకి ఆక్సిజన్‌ అందక తడబడ్డాడు. నాని టైమింగ్‌ వల్ల గట్టెక్కాడు. ఆ సినిమాలో క్లైమాక్స్‌ పిచ్చిపిచ్చిగా వున్నప్పటికీ ప్రేక్షకులు నవ్వుతూ క్షమించారు.

ప్రేక్షకుల్ని నవ్వించడం వేరు. నవ్వించడానికి ప్రయత్నించడం వేరు. రెండింటికీ చాలా ప్రయత్నం కావాలి. కూరలో ఉప్పువేయడంలాంటిదిది. ఎంత అద్భుతంగా కూర వండినా ఉప్పుకాస్త చేజారితే రసాభాసే. బాబు బంగారంలో అక్కడక్కడ వంటల సీన్‌లు వున్నా రుచి మారుతోందని దర్శకుడు తెలుసుకోలేకపోయాడు.

మేకింగ్‌లో మారుతికి ఒక స్టయిల్‌ ఉంది. ఆయన దాన్ని వదిలేసి శీనువైట్ల వెంట పడ్డాడు. మనకు పదేపదే దూకుడు సినిమా గుర్తుకి రావడానికి కారణం ఇదే. ప్రతి మనిషిలోనూ కొన్ని విపరీత గుణాలుంటాయి. అవి సినిమాటిక్‌గా ఒక్కోసారి బావుంటాయి. “భలే భలే…” సినిమాలో నానికి వున్న మతిమరుపు మనల్ని నవ్విస్తూనే హత్తుకుంటుంది. బాబు బంగారం సినిమాలో వెంకటేష్‌కి జాలిగుణం ఎక్కువ. అది అతని తాతనుంచి వచ్చుంటుంది. (నిజానికి తాత ఎపిసోడ్‌ అనవసరం. సినిమా స్లోమూడ్‌లో వెళుతుందేమోనని భయపడడం తప్ప) పోలీస్‌ అధికారి అయినప్పటికీ హీరో దయతో నేరస్తుల్ని కూడా గట్టిగా కొట్టలేడు.

హీరోయిన్‌ నయనతారది పెద్ద కుటుంబం. నలుగురు చెల్లెళ్ళు, ఒక నాయనమ్మ. ఆమెని ఎవరో రౌడీలు బెదిరిస్తూవుంటారు. ఆమె తండ్రి ఆచూకీ చెప్పమని అడుగుతూవుంటారు.

సినిమా ఆఖరి వరకూ ఆమె తండ్రి మ్యాటర్‌ సస్పెన్స్‌. చివర్లో ఆమె తండ్రి ఒక ఇన్‌కంటాక్స్‌ అధికారి అని తెలుస్తుంది. ఐటి అధికారి కూతురు క్యాటరింగ్‌ చేసి ఎందుకు జీవిస్తూ వుంటుందో తెలియదు.

హీరోయిన్‌ని చూసి ముచ్చటపడిన హీరో ఆమెని ఆకట్టుకోడానికి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. హీరోయిన్‌ని ఆమె బావ పృథ్వి పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు. ఇక్కడో కామెడీ ఎపిసోడ్‌. సినిమా మొత్తం మీద ఇదే కాస్త నవ్విస్తుంది. హీరోయిన్‌ కష్టాలను హీరో తీరుస్తూవుంటాడు. అయితే ఇదంతా నాటకమని హీరోయిన్‌ తండ్రిని పట్టుకోడానికి వేసిన ప్లాన్‌ అని ఇంటర్వెల్‌లో తెలుస్తుంది.

నిజానికి ఇది పాత కథ. హీరో తన అసలు ఐడెంటిటీని మరుగుపరిచి హీరోయిన్‌ని ప్రేమలోకి దింపే సినిమాలు చాలా వచ్చాయి. కిల్లర్‌, అతడు సినిమాల్లో నేరస్తులు మంచి వాళ్ళుగా నటిస్తారు. ఫస్ట్‌డాటర్‌ సినిమాలో హీరోయిన్‌ని టెర్రరిస్ట్‌ల బారి నుంచి రక్షించడానికి హీరో అండర్‌ కవర్‌ కాప్‌గా వుంటాడు. ఇంటర్వెల్‌ బ్లాక్‌లో ఈ విషయం తెలుస్తుంది.

బంగారం సినిమాలో హీరో ఎసిపి అని మనకు తెలుసు, హీరోయిన్‌కి తెలియదు. ఈ కథలో వీక్‌ పాయింట్‌ ఏమంటే ఒక ఐటి అధికారి మర్డర్‌ కేసుని చేధించడానికి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఒక ఎసిపిస్థాయి అధికారిని ప్లాంట్‌ చేయడం. ఆ మర్డర్‌ కూడా ఒక ఎమ్మెల్యే (పోసాని) శృంగారమున్న వీడియో కోసం. కథ గందరగోళంతో సెకెండాఫ్‌లో బలహీనమవడానికి ఇదే కారణం.

సెకెండాఫ్‌లో కథ చతికిలపడిందని తెలిసి కామెడి ఎపిసోడ్స్‌ ప్రారంభించారు. పోసాని కాసేపు కామెడి చేసి వెళితే, ఇది చాలదన్నట్టు బ్రహ్మానందం మెజిషియన్‌గా వస్తాడు. వెంకటేష్‌ కూడా వున్నట్టుండి పాతసినిమాల్ని గుర్తుచేసుకుని నవ్వించే ప్రయత్నం చేస్తూవుంటాడు. హీరో ప్రధాన లక్షణమైన జాలిని మధ్యలోనే వదిలేసి వేరే ట్రాక్స్‌ తిప్పుతారు.

మొత్తం మీద మనం చూసిందేమిటో మనకే అర్థంకాక బయటికి వస్తాం. సరదాసరదాగా కాసేపు నవ్వుకోడానికి అయితే ఓకే. కానీ నవ్వడమే ముఖ్యమనుకుంటే యూట్యూబ్‌లో జబర్ధస్త్‌ స్కిట్స్‌ చూస్తే చాలుకదా. సినిమాలో ఒక ఫీల్‌ కోసం ప్రేక్షకులు వస్తారు. ఇక్కడ అదే మిస్సయింది.

అన్నట్టు జబర్దస్ట్‌ టీంకూడా ఈసినిమాలో వుంది. చమ్మక్‌చంద్ర ఏకంగా ఆడవేషంలో పాటకూడా పాడతాడు. మనం వెంకటేష్‌ని ఎసిపిగా అంగీకరించకుండా వుండేందుకు దగ్గుబాటి వెంకటేష్‌ బాబూ… అని రాగం కూడా తీస్తాడు. కథలోని పాత్రలతో మనం ఐడెంటిఫైకాకుండా వుండేందుకు ఈ మధ్య ఇలాంటిపాటలు వినిపిస్తున్నారు.

ఫస్టాఫ్‌ వరకూ ఈ సినిమా నిస్పందేహంగా ఎంతో కొంత బావుంది. ఇలాంటి పాత్రలు వెంకటేష్‌కి కొట్టినపిండి. నయనతారకి నటిచండానికేమీ లేదు. ఈ పాత్రకి ఏ తారయినా ఒకటే. ఒక వ్యక్తిత్వమంటూ ఏమీ లేని పాత్రలో కూడా నయనతార బాగా నటించిందంటే అది ఆమె గొప్పతనం. విలన్‌గా సంపత్‌ ఓకే. ఫస్టాఫ్‌ వరకూ సంపత్‌ అనుచరుడిగా వున్న ఫిష్‌ వెంకట్‌ సెకెండాఫ్‌లో పోసాని అనుచరుడిగా ఎప్పుడు మారాడో అర్థం కాలేదు. హీరోయిన్‌ చెల్లెలి ఓణీల పండగ సీన్‌లో పాట వుంటుందేమోనని ప్రేక్షకులు జడుసుకున్నారు. కానీ అలాంటి ప్రమాదమేమీ లేకుండా పోయింది. పాటలు బావున్నాయి. వెన్నెలకిషోర్‌, బ్రహ్మాజీలు కూడా కాస్త నవ్వించారు.

మొత్తం మీద ఇది మారుతి సినిమాకాదు. శ్రీనువైట్లలోకి మారుతి పరకాయ ప్రవేశం చేశాడు. అయితే ప్రాసలు పంచ్‌లతో భయపెట్టకుండా మామూలు డైలాగులతోనే జడిపించాడు. థియేటర్‌లో అక్కడక్కడ నవ్వులు వినిపించడం దర్శకుడికి సంతోషం కలిగించే అంశం. బిరియాని ఘుమఘుమగానే వుందికాని చికెన్‌ ఎక్కడ సార్‌?

-జి ఆర్‌. మహర్షి

Click on Image to Read:

mahesh babu

tdp teachers

 

jayalalitha 1

 

andhra pradesh krishna pushkaralu

chandrababu lokesh bathing

 

kcr

 

jac kodanda ram

 

kodela

 

ys jagan

 

revanth reddy

ys jagan lokesh