చరిత్ర వక్రీకరణలకు విరుగుడు

RV Ramaraoనెహ్రూ బదులు సర్దార్ పటే ప్రధాని అయి ఉంటే దేశ పరిస్థితి మరోలా ఉండేది అన్న వాదనలు నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత బయలు దేరాయి. బిజేపీ నెహ్రూను విమర్శించడం కొత్తేమీ కాదు. కాని మోదీ నాయకత్వంలో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించినందువల్ల నెహ్రూకు బదులు పటేల్ ప్రధాని అయితే బాగుండేది అని బాహాటంగా వాదించే ధైర్యం కూడగట్టుకోవడానికి అవకాశం వచ్చింది. ఇందులో నవభారత నిర్మాతగా నెహ్రూకు ప్రజల మనసుల్లో ఉన్న భావాలను చెరిపేయాలని, ప్రస్తుతం మనం ఎదుర్కుంటున్న సకల సమస్యలకు నెహ్రూ విధానాలే కారణమని ఆయనను దోషిగా నిలబెట్టాలన్న కుటిల యత్నం దాగి ఉంది. నెహ్రూను దేశవాసులు అమితంగా అభిమానించడం ఎంత వాస్తవమో అదే మోతాదులో విమర్శలు ఎదుర్కోవడం కూడా అంతే నిజం. ఈ విమర్శలు ఎదుర్కున్నది నెహ్రూ ఒక్కడే కాదు. గాంధీ మీద కూడా అదే స్థాయిలో ఆక్షేపణలున్నాయి.

ఇలాంటి విమర్శలు మోదీ అధికారంలోకి రావడంతోనే మొదలు కాలేదు. బీజేపీ మాత్రమే విమర్శలకు పాల్పడలేదు. ఈ పని చేసిన ఇతరులూ ఉన్నారు. గుజరాత్ కు చెందిన స్వామి సచ్చిదానంద, ఇంగ్లండ్ లో జన్మించి అమెరికా వాసి అయిన పెర్రీ ఆండర్సన్ లాంటి వారు ఇలాంటి విమర్శలే చేశారు. ఈ పని చేసే వారు గాంధీని, నెహ్రూను ఒక గాటన కట్టి, పటేల్ మీద కొద్దిగా కనికరం చూపి సుభాశ్ చంద్ర బోస్ ను, అంబేద్కర్ ను పొగడడం చూస్తూనే ఉన్నాం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బోస్ దేశం వదిలి అంతర్ధానం అయిపోకుండా ఇక్కడే ఉండి స్వతంత్రభారత్ కు నాయకత్వం వహించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అనే వారికీ కొదవలేదు. అలాగే జరిగి ఉంటే ఇలా వాదించే వారు మరి పటేల్ ప్రధాని కావాలనుకునే వారో బోస్ అధినాయకుడిగా ఉండాలనుకునే వారో చెప్పలేం. బీజేపీ నాయకులు నెహ్రూను విమర్శించి పటేల్ ను అక్కున చేర్చుకోవడానికి కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

swami sachidananda 1
స్వామీ సచ్చిదానంద

ఈ ఆలోచనలన్నీ ఊహాజనితమైనవని, గత జల సేతు బంధనం వల్ల ప్రయోజనం లేదు అనుకోవడానికీ అవకాశం ఉన్నప్పటికీ గతంలో జరిగిన పొరపాట్లను వర్తమానంలోనైనా సరిదిద్దుకోగలిగితే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడం సాధ్యమే. గాంధీని, నెహ్రూను దుయ్యబట్టే వారి వాదనల్లో పస ఎంతో తేల్చడమూ అవసరమే. గాంధీ మనవడు, ప్రసిద్ధ చరిత్రకారుడు రాజ్ మోహన్ గాంధీ ఈ పనే చేశారు. “అండస్టాండింగ్ ఫౌండింగ్ ఫాదర్స్” అనే ఆయన చిరు పుస్తకం ఊద్దేశం ఇదే. నిజానికి ఈ పుస్తకం పూర్తి పేరు “అండస్టాండింగ్ ఫౌండింగ్ ఫాదర్స్: ఆన్ ఎంక్వైరీ ఇంటు ది ఇండియన్ రిపబ్లిక్స్ బిగినింగ్స్.”

నెహ్రూ బదులు పటేల్ ప్రధాన మంత్రి అయితే బాగుండునన్న బీజేపీ వాదనలకు సమాధానంగా రాజ్ మోహన్ గాంధీ ఈ గ్రంథం రాయలేదు. అది ఆయన గ్రంథ రచనకు నేపథ్యంగా కచ్చితంగా ఉపకరించిందన్నది అక్షర సత్యం. స్వామీ సచ్చిదానంద గాంధీ మీద చేసిన విమర్శలను, పెర్రీ ఆండర్సన్ గాంధీ మీద, నెహ్రూ మీద జమిలిగా చేసిన విమర్శలకు సమాధానం చెప్పే ఉద్దేశంతోనే రాజ్ మోహన్ గాంధీ ఈ పుస్తకం రాశారు.

స్వామీ సచ్చిదానంద అసలు పేరు నానాలాల్ త్రివేది (జననం 1932). ఆయన 21వ ఏట జేబులో చిల్లిగవ్వ లేకుండా ఇల్లు వదిలి వెళ్లి దేశమంతటా తిరిగారు. 24వ ఏట పాకిస్తాన్ సరిహద్దులోని పంజాబ్ లో భాగమైన ఫెరోజ్ పూర్ లో ఒక స్వామిని కలుసుకుని ఆ తర్వాత స్వామి అవతారం ఎత్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో సహా చైనా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, రష్యా, యూరప్, అమెరికా, ఆస్ట్రేలియాలో పర్యటించి ఉపన్యాసాలిచ్చారు. గుజరాతీలో అనేక రచనలు చేశారు. ఆయన రచనల్లో కొన్ని ఇంగ్లీషు, హిందీ భాషల్లో కూడా వెలువడ్డాయి.

Perry_Anderson
పెర్రీ ఆండర్సన్

పెర్రీ ఆండర్సన్(జననం 1938) లండన్ లో జన్మించారు. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలో అధ్యాపకుడిగా ఉన్నారు. ఆయన పేరెన్నికగన్న చరిత్రకారుడు. న్యూ లెఫ్ట్ ఉద్యమంలో పాత్రధారి. మార్క్సిస్ట్ భావజాలం ఉన్న వారు. అంటోనియో గ్రాంసీ అభిమాని.

rajmohan
రాజ్ మోహన్

ఈ ఇద్దరి గురించి రాజ్ మోహన్ గాంధీకి ఆలస్యంగానే తెలిసింది. రాజ్ మొహన్ గాంధీని “ఫౌండింగ్ ఫాదర్స్” గ్రంథ రచనకు ప్రేరిపించిన ఆండర్సన్ రాసిన “ఇండియన్ ఐడియాలజీ” గ్రంథం కూడా రాజ్ మోహన్ గాంధీ ఆలస్యంగానే చూశారు. ఇండియన్ ఐడియాలజీ గ్రంథం మూడు వ్యాసాల సంకలనం. ఇండెపెండెన్స్, పార్టీషన్, రిపబ్లిక్ అన్న మూడు వ్యాసాలు ‘లండన్ రివ్యూ ఆఫ్ బుక్’ లో 2012 లోనే ప్రచురితమైనాయి. ఆ తర్వాత గుర్గాం లోని ఓ ప్రచురణ సంస్థ ఈ మూడు వ్యాసాలను కలిపి ‘ఇండియన్ ఐడియాలజీ’ గ్రంథంగా ప్రచురించింది.

సచ్చిదానందను 2013 లో రాజ్ మోహన్ గాంధీ కలుసుకున్నారు. సచ్చిదానంద స్వామి అవతారంలో ఉన్నా దేన్నీ గుడ్డిగా నమ్మకూడదని, అద్భుతాలను విశ్వసించకూడదని చెప్తారు. దళితులకు సాధికారికత ఉండాలంటారు. దళితులు హిందూ సమాజంలోని ప్రధాన జనజీవన స్రవంతిలో కలవాలని ఆకాంక్షిస్తారు. ఈ విషయంలో సచ్చిదానంద అభిప్రాయాలకు గాంధీ భావనలకు సామ్యం ఉంది. స్వామి ఒకప్పుడు గాంధీకి వీరాభిమాని. “గాంధీని ఎవరైనా విమర్శిస్తే నేను గట్టిగా సమర్థించేవాడిని. నేను అప్పుడు ఉత్తర ప్రదేశ్ లో ఉండే వాడిని. నా గదిలో గాంధీ చిత్రపటం ఉండేది. కాని 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో మనం ఘోర పరాజయం పాలు కావడం నాకు చాలా అవమానకరంగా తోచింది. గాంధీ అహింసా సిద్ధాంతం భారత్ ను బలహీనపరిచింది. కత్తికున్న సామర్థ్యాన్ని, ఇస్లాం వల్ల ఉన్న ముప్పును గాంధీ సరిగ్గా అర్థం చేసుకోలేదు… ఆ తర్వాత గాంధీ చిత్రపటాన్ని గంగానదిలో విసిరేశాను” అని స్వామి సచ్చిదానంద అంటారు. గాంధీ అహింసా సిద్ధాంతం వలలె హిందూ సమాజం బలహీనపడిందని, గాంధీ హిందువుల ప్రయోజనాలను కాపాడలేదని సచ్చిదానంద వాదన. అంటే సచ్చిదానందకు గాంధీ మీద వ్యతిరేకత పెరిగింది గాంధీ మరణం తర్వాతే.

raj1పెర్రీ ఆండర్సన్ గాంధీ మీద అనేక విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో మతాన్ని జొప్పించింది గాంధీయేనని, దేశ విభజనకు కారణం బ్రిటిష్ వారు కాదని, గాంధీయే ప్రధాన కారకుడని, ముస్లిం వ్యతిరేకి అని, హిందువుల ఆధిపత్యంలో ముస్లింలు ఉండేట్టు చేశారని, కశ్మీర్ ను అందుకే చిన్న చూపు చూస్తున్నారని ఆండర్సన్ అంటారు. గాంధీ, నెహ్రూ, పటేల్ దిష్టి బొమ్మలను తగలెయ్యాలని, వారు ప్రాతినిధ్యం వహించే సకల అంశాలను భారతీయులు విడనాడాలని ఆండర్సన్ ఉచిత సలహా కూడా ఇచ్చారు. అయితే ఆండర్సన్ చేసిన వాదనలకు తన గ్రంథంలో చాలా చోట్ల ఆధరాలు కూడా చూపించలేదని ‘ఎంత మర్యాదగా చెప్పినా ఈ వాదన తప్పు ‘ అని రాజ్ మోహన్ గాంధీ గాంధీ ఆలోచనలను విశ్లేషించి, గాంధీ రచనల్లోంచి ఉదాహరించి రుజువు చేశారు.

రాజ్ మోహన్ గాంధీ గతంలో కూడా గాంధీ మీద అరుంధతీ రాయ్ చేసిన విమర్శలను ‘ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ లో రాసిన వ్యాస పరంపర ద్వారా పరాస్తం చేయడానికి ప్రయత్నించారు. ఈ గ్రంథంలోనూ అదే పని చేశారు. అయితే మన జాతి నిర్మాతలు నూటికి నూరు పాళ్లు నిఖార్సైన వారు అన్న మౌఢ్యం ఈ గ్రంథంలో ఎక్కడా కనిపించదు. గాంధీ మనవడైనప్పటికీ గాంధీ చేసిన తప్పులను రాజ్ మోహన్ ఎత్తి చూపించారు. నెహ్రూ పొరపాట్లనూ ప్రస్తావించారు. ఈ గ్రంథంలో రాజ్ మోహన్ గాంధీ పట్టుదలగల పరిశోధకుడిగా కనిపిస్తారు. ఆయన రచన చరిత్రను వక్రీకరించే వారి కళ్లు తెరిపించడానికి ఉపకరిస్తుంది.

దేశ విభజనకు అసలు కారకులెవరు? రాజకీయాల్లో మతానికి పాత్ర కల్పించింది గాంధీయేనా? గాంధీ అంబేద్కర్ శత్రువులా? 1932 లో పూనా ఒప్పందాన్ని అంబేద్కర్  అంగీకరించేలా చేయడానికి గాంధీ బ్లాక్ మయిల్ కు పాల్పడ్డారా? స్వతంత్ర భారత దేశాన్ని సర్దార్ పటేల్, సుభాశ్ చంద్ర బోస్ కు నాయకత్వం దక్కితే నెహ్రూకన్నా మెరుగ్గా తీర్చి దిద్దే వారా లాంటి అనేక ప్రశ్నలకు రాజ్ మోహన్ గాంధీ పుస్తకంలో సమాధానాలు వెతుక్కోవచ్చు.

గాంధీ, నెహ్రూ, పటేల్ కు ప్రత్యామ్నాయంగా మహమ్మద్ అలీ జిన్నా, సుభాశ్ చంద్ర బోస్, అంబేద్కర్ ను గొప్పగా నిలబెట్టడానికి ఆండర్సన్ చేసిన ప్రయత్నాల తీరును ఈ పుస్తకం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆండర్సన్ ధోరణిలో దాగి ఉన్న జాత్యహంకార వైఖరిని పసిగట్టవచ్చు. “ఫౌండింగ్ ఫాదర్స్” గ్రంథం మనల్ని మనం తెలుసుకోవడానికి, మనం ఈ స్థితికి రావడానికి కారణాలను అన్వేషించడానికి, గతంలో జరిగినవి తప్పులని అంగీకరిస్తే వాటిని నివారించడానికి దోహదం చేస్తుంది. 

-ఆర్వీ రామారావ్

Click on Image to Read:

Nathuram Gadsey

Gujarat Files