Telugu Global
National

సింధు ప్ర‌పంచ‌ నెంబ‌ర్ వ‌న్ అవుతుంది!

భార‌త్‌కి ఒలింపిక్స్‌లో ర‌జ‌తం సాధించిన పివి సింధుని….భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ సైనానెహ్వాల్ కోచ్ విమ‌ల్ కుమార్ అభినందించారు. భార‌త్‌లోని బాడ్మింటన్ క్రీడాకారుల‌కు ఇది  గొప్ప సుదిన‌మ‌ని ఈ క్రెడిట్ మొత్తం సింధుకి ఆమె కోచ్‌ గోపికి చెందుతుంద‌ని ఆయ‌న అన్నారు. సింధు, సైనా నేహ్వాల్ మ‌ధ్య పోటీని చూడ‌టం స‌ర్వ‌సాధార‌ణ‌మైన ఈ సంద‌ర్భంలో  విమ‌ల్ కుమార్ త‌న మాట‌ల ద్వారా అలాంటిదేమీ లేద‌ని చెప్పిన‌ట్ట‌యింది. సైనా గ‌త లండ‌న్ ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని సాధిస్తే, సింధు ఈసారి ఒలింపిక్స్‌లో […]

భార‌త్‌కి ఒలింపిక్స్‌లో ర‌జ‌తం సాధించిన పివి సింధుని….భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ సైనానెహ్వాల్ కోచ్ విమ‌ల్ కుమార్ అభినందించారు. భార‌త్‌లోని బాడ్మింటన్ క్రీడాకారుల‌కు ఇది గొప్ప సుదిన‌మ‌ని ఈ క్రెడిట్ మొత్తం సింధుకి ఆమె కోచ్‌ గోపికి చెందుతుంద‌ని ఆయ‌న అన్నారు. సింధు, సైనా నేహ్వాల్ మ‌ధ్య పోటీని చూడ‌టం స‌ర్వ‌సాధార‌ణ‌మైన ఈ సంద‌ర్భంలో విమ‌ల్ కుమార్ త‌న మాట‌ల ద్వారా అలాంటిదేమీ లేద‌ని చెప్పిన‌ట్ట‌యింది.

సైనా గ‌త లండ‌న్ ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని సాధిస్తే, సింధు ఈసారి ఒలింపిక్స్‌లో ర‌జ‌తం సాధించింద‌ని…వీరి స్ఫూర్తితో గత కొన్నేళ్లుగా ఎంతోమంది పిల్ల‌లు ఈ ఆట‌ప‌ట్ల మ‌క్కువ చూపుతున్నార‌ని ఆయ‌న అన్నారు. సింధు విజ‌యంతో మ‌రింత‌మంది స్ఫూర్తి పొందుతార‌ని విమ‌ల్ చెప్పారు.

గురువారం సింధు ప్ర‌పంచ 6వ నెంబ‌ర్ క్రీడాకారిణి నొజోమీ ఒకు హ‌రాని ఓడించిన తీరు చూస్తుంటే ఆమె త్వ‌ర‌లో ప్ర‌పంచ నెంబ‌ర్ 1 అయ్యే సూచ‌న‌లు ఉన్నాయ‌ని విమల్ కుమార్ అన్నారు. సింధు అటాకింగ్ ప్లేయ‌ర్ అని, అయితే ఆమె డిఫెన్స్‌లో కాస్త వీక్‌గా ఉంద‌ని, గోపి చాలా మంచి కోచ్ అని… సింధులోని డిఫెన్సివ్ స్కిల్స్ పెంచ‌డానికి అత‌ను చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్టుగా తెలుస్తోంద‌ని విమ‌ల్ కుమార్ అన్నారు. ఆమె మొద‌టిసారి ఒలింపిక్స్ ఆడుతున్నా, ఎలాంటి జంకు లేకుండా ప్ర‌పంచ టాప్ ప్లేయ‌ర్స్‌తో పోటీప‌డింద‌ని, సింధు మాన‌సిక దృఢ‌త్వం విష‌యంలో కూడా చాలా కృషి చేసింద‌ని విమ‌ల్ ప్ర‌శంసించారు. ఆమె ఎత్తు కూడా ప్ల‌స్ అయింద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

ఏదిఏమైనా సైనా నెహ్వాల్‌కి కోచ్‌గా ఉన్న విమ‌ల్ కుమార్ సింధు నెంబ‌ర్ వ‌న్ అవుతుంద‌ని మెచ్చుకోవ‌టం అభినంద‌నీయం. సైనా సైతం గోపిచంద్ అభిమాన శిష్యురాలే అన్న సంగ‌తి తెలిసిందే. 2014లో ఆమె హైద‌రాబాద్ నుండి బెంగ‌లూరు మ‌కాం మార్చి భారతజట్టు మాజీ కోచ్ విమ‌ల్ కుమార్ చేత శిక్ష‌ణ పొందుతోంది. గోపి అనుమ‌తితోనే తాత్కాలికంగా గురువుని మార్చిన‌ట్టుగా అప్ప‌ట్లో ఆమె తెలిపింది.

అయితే ప్ర‌పంచ అయిదో స్థానంలో ఉన్న సైనానెహ్వాల్ రియో ఒలింపిక్స్ లో ఉక్రెయిన్‌కి చెందిన ప్ర‌పంచ 61వ నెంబ‌ర్ క్రీడాకారిణి మారిజా ఉలిటినా చేతిలో ఒడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆమెకు ఈ రోజు ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుప‌త్రిలో కుడికాలికి శ‌స్త్ర‌చికిత్స జ‌రుగుతోంది ఒలింపిక్స్‌కి ముందే శిక్ష‌ణ స‌మ‌యంలోనే కాలికి గాయ‌మైంద‌ని, ఒలింపిక్స్ మ్యాచ్‌లో అది మ‌రింత తీవ్ర‌మైంద‌ని సైనా తెలిపింది. గురువారం హైద‌రాబాద్ ఆసుప‌త్రిలో చేరిన ఆమె త‌న స‌ర్జ‌రీ గురించి ట్వీట్ చేస్తూ..త‌న‌కు కాలుకి ఆప‌రేష‌న్‌ని జ‌ర‌గ‌నున్న‌ద‌ని త‌న‌కోసం ప్రార్థించ‌మ‌ని ట్వీట్ చేసింది.

First Published:  19 Aug 2016 9:00 PM GMT
Next Story