Telugu Global
Others

యు. ఆర్. అనంతమూర్తి ధర్మాగ్రహం

నరేంద్ర మోదీ 2014 మే 26న కేంద్రంలో అధికారంలోకి రావడం రెండు కారణాల దృష్ట్యా ప్రధానమైంది. ఒక రకంగా అది మన ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠతకు చిహ్నం. మరో రకంగా చూస్తే హిందుత్వ వాదానికి పట్టం కట్టడం. సంఘ్ పరివార్ తో ముడిపడిన భారతీయ జనతా పార్టీ గతంలో వాజపేయి నాయకత్వంలో మూడు సార్లు అధికారంలోకి వచ్చింది. మొదటి సారి వాజపేయి ప్రభుత్వం 13 రోజులపాటే కొనసాగింది. రెండవ సారి 13 నెలలపాటు పరిపాలించగలిగితే మూడో సారి […]

యు. ఆర్. అనంతమూర్తి ధర్మాగ్రహం
X

RV Ramaraoనరేంద్ర మోదీ 2014 మే 26న కేంద్రంలో అధికారంలోకి రావడం రెండు కారణాల దృష్ట్యా ప్రధానమైంది. ఒక రకంగా అది మన ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠతకు చిహ్నం. మరో రకంగా చూస్తే హిందుత్వ వాదానికి పట్టం కట్టడం. సంఘ్ పరివార్ తో ముడిపడిన భారతీయ జనతా పార్టీ గతంలో వాజపేయి నాయకత్వంలో మూడు సార్లు అధికారంలోకి వచ్చింది. మొదటి సారి వాజపేయి ప్రభుత్వం 13 రోజులపాటే కొనసాగింది. రెండవ సారి 13 నెలలపాటు పరిపాలించగలిగితే మూడో సారి అయిదేళ్ల పూర్తి కాలం కొనసాగిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంగా రికార్డు సృష్టించింది. కాని ఆ అయిదేళ్ల కాలంలో బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ లేదు. వాజపేయి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకుడిగా ఉన్నారు. కాని మోది నాయకత్వంలో 2014లో అధికారం చేపట్టిన బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించింది.

వాజపేయి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకుడిగా ఉన్నారు కనక సంఘ్ పరివార్ ఎజెండాను అమలు చేయడానికి బాహాటంగా ప్రయత్నించలేకపోయారు. వివాదాస్పదమైన అంశాలను పక్కన పెట్టవలసి వచ్చింది. హిందుత్వ విధానాల అమలు నర్మ గర్భంగా కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ కయ్యానికి కాలు దువ్వే రీతిలో మాట్లాడడం లేదు. కాని హిందుత్వ విధానాలను అమలు జరపడానికి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. “కాంగ్రెస్ ముక్త్” భారత్ కావాలనడం ఆ తీవ్రతకే సంకేతం. మోదీ మాటల్లో కరకుదనం తగ్గినప్పటికి మోదీ సమర్ధకులైన హిందుత్వ వాదుల మాటల్లోనూ చేతల్లోనూ ఆ కరకుదనం స్పష్టంగానే ఉంది. అసహనం పెరిగిపోయిందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. మోదీ అభివృద్ధి మంత్రం జపిస్తున్నా ఆయన మద్దతుదార్లు హిందుత్వ విధానాలను పాదు కొల్పడానికి బాహాటంగానే ప్రయత్నిస్తున్నారు.

సంఘ్ పరివార్ ముస్లింలకు మాత్రమే వ్యతిరేకం కాదని, ఇతర మైనారిటీ మతాల వారిని కూడా సహించలేదని చెప్పడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. 2015 ఫిబ్రవరిలో పశ్చిమ బెంగాల్ లో 70 ఏళ్ల క్రైస్తవ సన్యాసిని మీద అత్యాచారం, కాన్వెంట్ పాఠశాలపై దాడి, గో సంరక్షణ పేర సాగుతున్న ఆగడాలు, ఘర్ వాపసి, లవ్ జిహాద్, చర్చిల మీద దాడులు, క్రైస్తవ మతాధికారుల మీద దాడులు, ఎవరి మత విశ్వాసాలు వారు అనుసరించడానికి రాజ్యాంగ బద్ధమైన హక్కును కాల రాయడం వంటి సంఘటనల ఉధృతి పెరిగింది. మత విద్వేషం, మత కలహాలు మన దేశంలో కొత్తేమీ కాదు. ఇతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడూ ఈ సంఘటనలు జరిగాయి. అప్పుడు మత విద్వేషం బుసలు కొట్టడానికి రాజకీయాలు కారణమైతే ఇప్పుడు మైనారిటీల మీద దాడుల ఆంతర్యంలో స్పష్టమైన తేడా 2014 తర్వాత కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శించే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. గో సంరక్షణ పేర ముస్లింల మీదే కాక దళితుల మీద దాడులు పరిపాటి అయిపోయాయి. రెచ్చగొట్టే మాటలు మాట్లాడే కేంద్ర మంత్రులను, పార్లమెంటు సభ్యులను ప్రధాన మంత్రి గాని, సంఘ్ పరివార్ గాని కట్టడి చేసిన, మందలించిన సందర్భాలు లేవు.

ur-ananthamurthy
అనంత మూర్తి

పదేళ్ల పాటు మత కలహాలకు, కుల కలహాలకు స్వస్తి చెప్పాలని ప్రకటించే మోదీ క్రిస్మస్ రోజును సుపరిపాలన దినోత్సవంగా నిర్వహించాలని ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటో గ్రహించడం కష్టమేమీ కాదు. ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ విశ్వ హిందూ పరిషత్తు 50వ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడుతూ హిందుత్వ భారత విలక్షణత అన్నారు. భారత్ హిందూ రాజ్యమేనని, భారత పౌరులు హిందువులేనని ప్రకటించారు. కేంద్ర మంత్రి సాధ్వి ప్రాచీ, పార్లమెంటు సభ్యులు సాక్షీ మహరాజ్, ఆదిత్యనాథ్ ముస్లింలకు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశారు. హిందువులు పదేసి మంది పిల్లలను కనాలని పిలుపు ఇచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లో భయోత్పాతం కొనసాగుతోంది. దళితులు, క్రైస్తవులు, గిరిజన క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి.

మరో వైపున ప్రజాస్వామ్య వ్యవస్థలపైన, విద్యా విధానంపైన, మానవ హక్కుల సంఘాల మీద; దళితులు, గిరిజనులు, మత్స్యకారులు, మహిళలు మొదలైన అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటౌ పడే వారి మీద విదేశీ నిధులను కట్టడి చేసే మిషతో నిర్బంధాలు పెరిగాయి. పర్యావరణ పరిరక్షకులు, నీటి హక్కుల కోసం పోరాడే వారు ఇదే నిర్బంధాన్ని ఎదుర్కుంటున్నారు. వారిని అభివృద్ధి వ్యతిరేకులుగా చిత్రిస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి క్రైస్తవుల మీద 149 దాడులు జరిగితే ముస్లింల మీద 451 దాడులు జరిగాయి. ఈ దాడులు బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలలో కూడా జరిగిన మాట వాస్తవం. కాని దీని వెనక హిందుత్వ వాదుల నూతనోత్సాహం, అధికారం తమదేనన్న ధీమా ఉందన్నది అంతకన్నా వాస్తవం.

మోదీ ప్రవర్తనలో, మాటల్లో హిందుత్వ చిహ్నాలు కనిపించకపోవచ్చు. ఆయన ప్రసంగాలలో మత విద్వేషం లేక పోవచ్చు, కాని పనిగట్టుకుని సంఘ్ పరివార్ వారు విద్వేషాలను రెచ్చగొడుతున్నా మోదీ పెదవి విప్పలేదు, ఒక్క గో సంరక్షణ పేర జరుగుతున్న ఆగడాల సందర్భంలో తప్ప. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వ వాదులకు నూతనోత్సాహం వచ్చినట్టుంది. హిందుత్వను అమలు చేయడానికి ఇదే అదను అన్న అభిప్రాయం బలపడినట్టుంది.

జాతీయోద్యమ క్రమంలో ప్రోది చేసిన సకల సంప్రాదాయాలు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బహుళత్వం, వైవిధ్యం తెరమరుగవుతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్పల్లా ఏమిటంటే అధినాయకుడు కేవలం అభివృద్ధి గురించే మాట్లాడితే ఆయన పరివారం తమ పని తాము కానిస్తున్నాయి. అంటే రూపంలో మార్పు ఉంది కాని సారం మాత్రం హిందుత్వ విధానాలకు పట్టం కట్టడమే.

ఆలోచనాపరులు, మేధావులు, భారతీయతత్వాన్ని హిందుత్వ సీసాలోకి దించడాన్ని వ్యతిరేకించే వారు ఈ పరిణామాలను ముందే పసిగట్టారు. ప్రసిద్ధ కన్నడ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఉడుపి రాజాగోపాలాచార్య అనంతమూర్తి (యు.ఆర్. అనంతమూర్తిగా ప్రసిద్ధులు) అదే పని చేశారు. సావర్కార్ ప్రతిపాదించిన హిందుత్వను అమలు చేయడానికి బాహాటంగా ఎలా ప్రయత్నిస్తున్నారో, దీనివల్ల కలిగే అనర్థమేమిటో వివరించాడానికి జీవిత చరమాంకంలో అనంత మూర్తి “హిదుత్వ ఆర్ హింద్ స్వరజ్” గ్రంథం రాశారు. ఇదే ఆయన ఆఖరి రచన. ఆయన ఈ గ్రంథాన్ని కన్నడంలో రాస్తే రెండేళ్ల తర్వాత కీర్తి రామచంద్ర, వివేక్ షాన్ బాగ్ (అనంత మూర్తి అల్లుడు) ఈ మధ్యే ఇంగ్లీషులో వెలువరించారు.

అనంత మూర్తి మొదటి నుంచి సంఘ్ పరివార్ విధానాలను దుయ్యబడుతూనే ఉన్నారు. ఈ గ్రంథంలోనూ ఆ వ్యతిరేకతే కనిపిస్తుంది. కాని సవ్యంగా ఆలోచించే వారిలో వివేచనా శక్తిని పెంపొందిస్తుంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన మోదీ దేశమంతటా పర్యటించి ఉధృతంగా ప్రచారం చేసిన సందర్భంలో అనంత మూర్తి “మోదీ పరిపాలించే దేశంలో తాను ఉండను” అని ప్రకటించారు. ఇది సంచలనాత్మకమైన మాటే. ఈ మాట చాలా వివాదాస్పదమైంది. సంఘ్ పరివార్ వారు ఆయన మీద దుమ్మెత్తి పోశారు. ఆయన దిష్టి బొమ్మలను తగులబెట్టారు. కొంత మంది మరో అడుగు ముందుకేసి ఆయన ప్రాణాలు తీస్తామని కూడా బెదిరించారు. ఇంకొంత మంది ఆయనకు పాకిస్తాన్ కు లేదా ఆయన వెళ్లదలచుకున్న మరే దేశానికైనా విమాన టికెట్ ఉచితంగా కొనిపెడ్తామని చెప్పి ‘ఉదారంగా’ ప్రకటించి తమ అక్కసు వెళ్లగక్కారు.

ఆ తర్వాత అనంత మూర్తి భావోద్వేగంతో ఆ మాట అన్నానని, తాను భారత్ లో ఉండడం తప్ప మరెక్కడికీ వెళ్లలేనని చెప్పారు. కాని అనంత మూర్తి మోదీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే 2014 ఆగస్టు 22న మరణించారు. అప్పటికి ఆయనకు 81 ఏళ్లు. హిందుత్వ వాదులనుంచి నిరంతరం ఒత్తిడి ఎదుర్కుంటూనే ఆయన ఈ గ్రంథ రచన పూర్తి చేశారు.

hindutva1హిందుత్వ సిద్ధాంతకర్త వీర సావర్కర్ 1923లో “ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ” గ్రంథం రాశారు. 1928లో ఆ గ్రంథం పునర్ముద్రణ అవసరమైనప్పుడు “హిందుత్వ: హూ ఈజ్ ఎ హిందు” గా మార్చారు. 1909లో గాంధీ విదేశీ యానానికి వెళ్లినప్పుడు నౌకలో తొమ్మిది రోజుల్లో “హింద్ స్వరాజ్” గ్రంథం రాశారు. ఈ రెండు గ్రంథాలలో అంశాలను పోల్చి సావర్కర్ హిందుత్వ ఎంత ప్రమాదకరమైందో, గాంధీ గ్రంథం ఎలా అనుసరణీయం అయిందో వివరించడానికే అనంత మూర్తి “హిందుత్వ ఆర్ హింద్ స్వరాజ్” రాశారు. హిందూ జాతీయతతావాదం వల్ల పొంచి ఉన్న ముప్పేమిటో వివరించారు. అధికసంఖ్యాక వర్గ ఆధిపత్యం, మితిమీరిన జాతీయతా వాదం తెచ్చే చేటును గురించి అనంత మూర్తి హెచ్చరించారు. బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా సాగిన పోరాట ఫలితంగా పరిఢవిల్లిన జాతీయవాదానికి, మెజారిటీ మతస్థుల జాతీయతావాదానికి మధ్య ఉన్న తేడాలను సోదాహరణంగా వివరించారు. దీని కోసం అనంత మూర్తి దేశ విదేశీ చరిత్ర, తత్వ శాస్త్రం, సాహిత్యం మొదలైన వాటి నుంచి అనేక ఉదాహరణలు ఇచ్చారు.

హిందుత్వ వాదం విజృంభించిన దశలో మన జాతి ఆలోచించి ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఏమిటో అనంత మూర్తి విడమర్చి చెప్పారు. గుజరాత్ మారణ కాండలో మోదీ పాత్రను ఆయన ఏ మాత్రం జీర్ణించుకోలేక పోయారు. అలాంటి వ్యక్తి ప్రధాని కావడం అరిష్టంగా భావించారు. మోదీ లాంటి వారు ఒక గుమ్మటంలో జీవిస్తారని అందులో వారి మాటల ప్రతిధ్వని తప్ప వారికి మరేదీ వినిపించదని ఆందోళన వ్యక్తం చేశారు. అనంత మూర్తి ఆవేదన నిష్కారణమైంది కాదనడానికి ఆయన మరణించిన ఏడాది తర్వాత డజన్ల కొద్దీ సాహితీవేత్తలు, కళాకారులు అసహనం పెరిగిపోతోందన్న భావనతో తమకిచ్చిన అవార్డులను వెనక్కు ఇచ్చేయడమే నిదర్శనం. ఆ రకంగా అనంత మూర్తి క్రాంతదర్శే. 2015 ఆగస్టు 8న కల్బుర్గి హత్య హిందుత్వ వాదనలు పురి విప్పిన పర్యవసానమే. విచిత్రం ఏమిటంటే అనంత మూర్తి మరణించినప్పుడు షరా మామూలుగా మోదీ సంతాపం ప్రకటించారు కాని ఆయన మద్దతు దార్లు ఆ మరణం పట్ల ఆనందం వ్యక్తం చేసి టపాకాయలు కాల్చే దాకా వెళ్లారు. మహాత్ముడిని గాడ్సే పొట్టన పెట్టుకున్నప్పుడు సంఘ పరివార్ వారు ఇదే రకంగా పండగ చేసుకుని మిఠాయిలు పంచుకుని పైశాచిక ఆనాందాన్ని వ్యక్తం చేయడం చరిత్ర చూపే సాక్ష్యం.

ఈ గ్రంథంలో అనంత మూర్తి నూతన ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత మొదలైన అభివృద్ధి నమూనాను కూడా వ్యతిరేకించారు. పర్యావరణ పరిరక్షణకు, గ్రామాలకు గ్రామాలను తుడిచిపెట్టే భారీ జలాశయాలు నిర్మించడానికి వ్యతిరేకంగా మేధా పాట్కర్; సమాచార హక్కు చట్టం కోసం అరుణా రాయ్ నడుం కట్టిన తీరును అనంత మూర్తి కొనియాడారు. ఇలాంటివారింకా తమ పోరాట పంథా కొనసాగిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. సత్యం బయట పెట్టడానికి తీస్తా సెతల్వాద్ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తున్నందుకు ఆందోళన పడ్డారు.

కలలు కనని వాడు మనిషే కాదంటారు ఆయన. జీవనం కొనసాగించడానికి శ్రమించడానికి, విజ్ఞా శాస్త్రాన్ని సవ్యమైన ప్రయోజనాలకు వినియోగించడానికి కలలు కనాలంటారు. కష్టపడి పంటలు పండించే రైతుల భూములను విద్యుత్ కేంద్రాల స్థాపనకు, పర్యావరణాన్ని నాశనం చేసే భారీ జలాశయాల నిర్మాణానికి, ఐ.టి-బి.టి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి లాక్కోకూడదని అనంత మూర్తి అంటారు. నదీ జలాలను విలాసవంతమైన హోటళ్లలో వినియోగించుకోవడం కోసం మళ్లించకూడదన్నది ఆయన అభిమతం.

వీర సావర్కర్ సిద్ధాంతాన్నే నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారని చెప్పడమే ఈ గ్రంథ రచనలో ఆయన లక్ష్యం. అయితే సరళీకృత ఆర్థిక విధానాల అమలు బీజేపీతోనే ప్రారంభం కాలేదని వాటికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మరీ మాట్లాడితే రాజీవ్ గాంధీ ఏలుబడిలోనే సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభమయ్యయని గమనిస్తే ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి క్రమం మన మూలాలను ఎలా తెగ నరుకుతోందో అర్థం అవుతుంది. పిచ్చుకలు లేని మార్కెట్లు, పక్షులు లేని చెట్లను భరించడం అనంత మూర్తి వల్ల కాలేదు. అందుకే ఈ గ్రంథం. అభివృద్ధి సాధన పేర అమలవుతున్న హిందుత్వ విధానానికి నిరసనగా ఆగ్రహంతో ఈ గ్రంథం రాశారని అర్థం అవుతుంది.

దేశ పరిస్థితులను, ప్రజలను, నాయకుల తీరును గమనించి తన జీవితానుభవాన్నంతటినీ రంగరించి అనంత మూర్తి ఈ గ్రంథం రాశారు. నెహ్రూ విధానాలను కూడా అనంత మూర్తి విమర్శించే వారు. కాని అప్పుడు నెహ్రూ మద్దతు దార్లు నెహ్రూను విమర్శించే వారిపై దాడులకు పాల్పడలేదు అని చెప్పడం ద్వార ప్రస్తుతం పరిస్థితి ఎలా దిగజారుతోందో వివరించారు.

-ఆర్వీ రామారావ్

Click on Image to Read:

atal bihari vajpayee book

on nationalism

dalits

swami sachidananda

Nathuram Gadsey

Gujarat Files

First Published:  10 Sep 2016 7:14 AM GMT
Next Story