‘మ‌ల్ల‌న్న’  పోరులో రూట్ మార్చిన కాంగ్రెస్‌!

మ‌ల్ల‌న్న సాగ‌ర్ భూ సేక‌ర‌ణ వ్య‌తిరేక పోరులో కాంగ్రెస్ రూట్ మార్చింది. గ‌తంలో ఉద్య‌మానికి వ‌చ్చిన ప్ర‌జాస్పంద‌న‌ను బ‌ట్టి ఈసారి పోరాటాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు. గ‌తంలో మ‌ల్ల‌న్న సాగ‌ర్ భూ సేక‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో నెం.123కు వ్య‌తిరేకంగా టీపీసీసీ కోర్టుకు వెళ్లింది. 2013- భూ సేక‌ర‌ణ చ‌ట్టం అమ‌లు కాక‌పోవ‌డంపై హైకోర్టు ప్ర‌భుత్వంపై మొట్టికాయ‌లు వేసింది. భూ నిర్వాసితుల‌కు ప‌రిహారం విష‌యంలో ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో-123ని త‌ప్పుబ‌ట్టింది. దీంతో కాంగ్రెస్ నేత‌లు ప్ర‌భుత్వం విజయం సాధించామ‌ని సంబ‌రాలు చేసుకున్నారు. అయితే, అది కాంగ్రెస్ పార్టీకి తాత్కాలికమే అయింది. దీనికితోడు మెద‌క్ జిల్లా ముట్ట‌డి, నిర‌స‌న‌లు ఆందోళ‌న‌ల‌తో భూసేక‌ర‌ణ జ‌రిగే గ్రామాల ప‌రిధిలో కాస్త మైలేజీ సాధించారు. 
అందుకే ఈసారి 2013- భూ సేక‌ర‌ణ చ‌ట్టం అమ‌లు కోసం ఉద్య‌మాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాల‌ని భావిస్తోంది. ఇందులో భాగంగానే రాజ్‌భ‌వ‌న్ – రాష్ట్రప‌తి భ‌వ‌న్ అనే నినాదంతో ముందుకెళ్లాల‌ని తీర్మానించారు. త్వ‌ర‌లోనే ఢిల్లీలోని రాష్ట్రప‌తిని క‌లిసి 2013- భూ సేక‌ర‌ణ చ‌ట్టం అమ‌లు చేయాల‌ని విన‌తిప‌త్రం స‌మ‌ర్పించాల‌ని నిర్ణ‌యించారు. తెలంగాణ ప్ర‌భుత్వం భూసేక‌ర‌ణ చ‌ట్టం అమ‌లు చేయ‌డం లేదంటూ.. ఢిల్లీస్థాయిలో దేశ‌మంతా తెలిసేలా చేయాల‌న్న‌ది టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్లాన్. మొత్తానికి పార్టీ కేడ‌ర్ బ‌లోపేతానికి, నాయ‌కుల మ‌ధ్య ఐక్యత పెంచేందుకు మ‌ల్ల‌న్న అంశాన్ని మ‌రోసారి భుజాల‌కెత్తుకున్నాడు ఉత్త‌మ్‌. ఈ అంశం త‌ప్ప‌కుండా అధికార టీఆర్ ఎస్‌ను త‌ప్ప‌కుండా ఇరుకున పెడుతుంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.