పరాకాష్టకు ఆపరేషన్ పచ్చ టీచర్‌

రాజ్యాంగానికి, చట్టాలకు, పదవీ స్వీకరించేటప్పుడు చేసే ప్రమాణాలకు అన్నింటికీ తాను అతీతశక్తుడైనట్టుగా చంద్రబాబు వ్యవహారం నడుస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తన దృష్టిలో అందరూ సమానమేనని మాట వరుసకైనా చెప్పని వ్యక్తి బహుశా చంద్రబాబే కావచ్చు. దేశంలోని వ్యవస్థలన్నీ తన ముందు మరుగుజ్జుల్లా కనిపించినప్పుడు చంద్రబాబే కాదు ఎవరైనా ఇలాగే వ్యవహరిస్తారు. తాజాగా ఉపాధ్యాయసంఘాల్లోనూ పచ్చరాజకీయం మొదలుపెట్టారు చంద్రబాబు. చదువు చెప్పే టీచర్ల చుట్టూ రాజకీయ ఉచ్చు బిగించి విభజన చిచ్చు పెడుతున్నారు. అది కూడా కుమారుడు లోకేష్‌ సాయంతో. శనివారం విజయవాడలో జరిగిన టీడీపీ అనుబంధ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం టీఎన్‌యూఎస్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను చూస్తే ఆయనలో రాజకీయం ఎంతగా ఇంకిపోయిందో అర్థమవుతుంది.

సభలో ప్రసంగించిన చంద్రబాబు ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాల్లో ఇకపై తన అనుబంధ టీచర్ల సంఘం టీఎన్‌యూఎస్‌ చెప్పిన సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించారు. భవిష్యత్తులో టీచర్లకు సంబంధించిన ఏ నిర్ణయమైనా టీఎన్‌యూఎస్‌ను సంప్రదించి మాత్రమే తీసుకుంటానన్నారు. రాష్ట్రంలో ఇంకా అనేక ఉపాధ్యాయ సంఘాలు ఉన్నా కూడా ముఖ్యమంత్రి మాత్రం వాటి గురించి ప్రస్తావించలేదు. చంద్రబాబు ఇలా చెప్పడం వెనుక పెద్ద కథే నడుస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన అన్ని సంఘాల్లోనూ ఇప్పటికే పచ్చరంగు చల్లి విభజన తెచ్చిన చంద్రబాబు, లోకేష్‌లు ఇప్పుడు టీచర్ల మీద పడ్డారని చెబుతున్నారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ టీచర్ల నియోజవకర్గాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆరు నెలల క్రితమే లోకేష్ ”ఆపరేషన్ టీచర్‌”ను మొదలుపెట్టారు. ముఖ్యంగా తనకు ఇష్టమైన కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో టీచర్లు రాజకీయంగా కత్తులు దూసుకునే పరిస్థితిని తీసుకొచ్చారు.

లోకేష్‌ ఆదేశంతో కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు… ప్రతి స్కూల్‌కు వెళ్లి తమ పార్టీ సంఘంలో చేరితే ఎలాంటి సమస్యలు ఉండవని ప్రచారం సాగించారు. రాజకీయాలపై ఆసక్తి లేని ఉపాధ్యాయులు ఎవరైనా తమ పనుల నిమిత్తం డీఈవో కార్యాలయలకు వెళ్తే వెంటనే ఆ విషయం టీడీపీనేతలకు తెలిసిపోయేలా వ్యవస్థను సిద్దం చేసుకున్నారు. అలా వెళ్లిన వారి పనులు జరక్కుండా అడ్డుపడడం టీడీపీ నేతల వంతు. చివరకు పచ్చసంఘంలో చేరితే మీ సమస్యలను గంటలో పరిష్కరిస్తామంటూ ఒక అనివార్యతను సృష్టిస్తున్నారు. ఇలా ఇష్టం లేకున్నా అనేక మంది ఉపాధ్యాయులు టీఎన్‌యూఎస్‌లో చేరారు. ఇప్పుడు చంద్రబాబు ఏకంగా తన సంఘం చెప్పిన పనులు చేస్తానని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పరోక్షంగా తన పార్టీ సంఘంలో చేరిన వారికే లబ్ది ఉంటుందని చెప్పకనే చెప్పారు. భారత రాజ్యాంగం బదులు పచ్చరాజ్యాంగం అమలయ్యే రాష్ట్రంలో టీచర్లు మాత్రం ఏం చేయగలరు?. ఒక్కటి మాత్రం నిజం ఉపాధ్యాయులు ప్రస్తుత రాజకీయ పార్టీలతో ఎంతగా రాసుకుని తిరిగితే అంతగా వారికి వారుగా విలువల విషయంలో పతనం అయినట్టే.

Click on Image to Read:

abk-prasad

venkaiah-naidu