ఆయనకు కులగజ్జి పట్టింది – జేసీ సంచలన వ్యాఖ్యలు

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం నగరంలో విషజ్వరాలు విజృంభించిన నేపథ్యంలో ఎంపీ స్పందించారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో పాటు నగర మేయర్, కమిషనర్‌కు కులగజ్జి పట్టుకుందంటూ సొంత పార్టీ నేతలపైనే జేసీ విరుచుకుపడ్డారు. వారి కులగజ్జి కారణంగానే అనంతపురం మున్సిపాలిటీ భ్రష్టుపట్టిందన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతలో పారిశుద్ధ్యం పడకేసిందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. తాను నగరంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తే వాటిని కూడా అడ్డుకున్నారని జేసీ ఫైర్ అయ్యారు. అయితే టీడీపీ ఎంపీగా ఉంటూ చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్‌ మదమంచి స్వరూపపై జేసీ నేరుగా విరుచుకుపడడం చర్చనీయాంశమైంది. అనంతపురంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు.