ఇంటర్‌నెట్‌లో ప్రత్యక్షమవుతున్న పడకగదులు

పిచ్చి ముదిరింది, తలకు రోకలి చుట్టమన్నాడట వెనకటికి ఎవడో…. ఇప్పుడు జనాలకు సెల్ఫీల పిచ్చి పరాకాష్టకు చేరింది. సెల్ఫీల మోజులో చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం ఈ సెల్ఫీ మోజులో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు ఇంజనీరింగ్‌ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సెల్ఫీల పిచ్చికి తెలిసో తెలియకో ప్రధాని నరేంద్రమోడీ లాంటి వాళ్లు కూడా బ్రాండ్‌ అంబాసిడర్స్‌ అవుతున్నారు. సెలబ్రిటీస్‌ ఏమి చేసినా వాటిని జనం అనుకరిస్తారన్న సృహ ప్రతి సెల్రబిటీకి ఉండాలి. లేకపోతే చాలామంది అభిమానులకు రాంగ్‌ డైరక్షన్‌ ఇచ్చిన వాళ్లు అవుతారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే చాలామంది సెల్‌ఫోన్‌లలో వీడియో సదుపాయం ఉండడం వల్ల, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు విరివిగా అందుబాటులో ఉండడం వల్ల సెల్ఫీల పిచ్చికి పరాకాష్టలాగా వీడియోల పిచ్చి ముదిరింది. అయినదానికి కానిదానికి వీడియో తీసి ఫేస్‌ బుక్కుల్లో లోడ్‌ చేస్తున్నారు. ఏ దృశ్యాలు మన వరకు పరిమితం, ఏ దృశ్యాలు ప్రపంచం ముందు వెల్లడించాలి అనే విచక్షణ కోల్పోతున్నారు.

వీటన్నిటికి పరాకాష్టలాగా ఇప్పుడో కొత్త పిచ్చి ముదిరింది. ప్రేమికులు, యువ జంటలు కొందరు తమ శృంగార కార్యకలాపాలను కూడా వీడియోలు తీసుకుంటున్నారు. రహస్యంగా అమర్చిన కెమెరాల ద్వారా ల్యాప్‌ టాప్‌లు, సెల్‌ఫోన్‌లు ద్వారా ఆ అమ్మాయిలకు తెలియకుండా అబ్బాయిలు వీడియో చిత్రీకరణ చేస్తున్నారట. ప్రేమికులైతే ఈ వీడియోను చూపి ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. మాట వినకపోతే యూట్యూబ్‌లో పెట్టేస్తున్నారు.

ఇక యువ జంటల విషయానికొస్తే సెల్ఫీల పిచ్చిలాగే ఈ పిచ్చి. తమ వరకే పరిమితమనుకున్న ఈ వీడియో పొరపాటున యూట్యూబ్‌ దాకా చేరుతోంది. యువతీ యువకులకు ఈ వీడియోల పిచ్చి ఏమిటో గానీ… ఇటీవల కొందరు అమ్మాయిలు తమ నగ్న చిత్రాలను పలానా అబ్బాయిలు నెట్‌లో పెడతామని బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫొటోలు వాళ్లకు ఎలా చేరాయి అని ఆరా తీస్తే పెళ్లి ఫిక్స్‌ అయిన సందర్భంగా, ఎంగేజ్‌మెంట్‌ అయినందువల్ల ఇక ఎలాగూ భార్యాభర్తలం అవుతున్నాము కదా అనే నమ్మకంతో ఆ అబ్బాయి అడిగితే తన న్యూడ్‌ ఫొటోలు తీసి వాట్సప్‌లో పంపానని ఆ అమ్మాయిలు చెబితే పోలీసులకు దిమ్మతిరిగిపోయింది.

తాజాగా ఇప్పుడు ఆముదాలవలస పట్టణంలో స్థానిక యువతీ యువకుల నీలిచిత్రాలు సెల్‌ఫోన్‌లలో దర్శనమిస్తున్నాయట. నమ్మించి సహవిద్యార్ధినులతోనో, తెలిసిన అమ్మాయిలతోనో స్థానికంగా తీసిన ఈ నీలిచిత్రాలు నగరంలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. కొద్ది నెలల క్రితం కదిరిలో ఇలాంటి నీలి చిత్రాలు సంచలనం రేపాయి. అమ్మాయిలు చాలా అప్రమత్తంగా ఉండకపోతే బ్రతుకు చిద్రం అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త..!