వదిలించుకోలేరు… వెంటాడనూ లేరు

కేటీఆర్‌. తెలంగాణ ఐటీకి బ్రాండ్‌ అంబాసిడర్ ఆయనే అన్నట్టుగా దూసుకెళ్తున్నారు. తొలుత ఐటీ శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన ఆయన హైదరాబాద్ గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను భుజాన వేసుకుని పనిచేశారు. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ను గెలిపించగలిగితే కేటీఆరే భావి ముఖ్యమంత్రి అన్న ప్రచారం జరిగింది. ఆ సమయంలో అంచనాలను కూడా తారుమారు చేస్తూ గ్రేటర్‌ను టీఆర్‌ఎస్ స్వీప్ చేసేసింది. ఆ పుత్రోత్సహంలోనే కేసీఆర్‌కు మున్సిపల్ శాఖను కూడా కట్టబెట్టారు కేసీఆర్. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకే కేటీఆర్‌కు మున్సిపల్ శాఖ బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. అయితే ఐటీ శాఖలో కేటీఆర్ పనితీరు పీక్‌లో ఉంటే మున్సిపల్ శాఖ మంత్రిగా మాత్రం ఆయన పనితీరు బాగో లేదనే భావన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్‌ రోడ్లు కేటీఆర్‌ పరువును సిటీ జంక్షన్లలో నిలబెడుతోంది. నగరం మొత్తం రోడ్లు ధ్వంసమైపోయాయి. జనం రోడ్డెక్కాలంటేనే హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో జనం నగర మేయర్‌ను పక్కనపెట్టి మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు. విశ్వనగర నిర్మాతలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. మేయర్‌ను వదిలేసి కేటీఆర్‌ను జనం విమర్శించడానికి కారణం నిన్నటి వరకు ఆయనపై జనం పెట్టుకున్న భారీ అంచనాలే. అయితే హైదరాబాద్‌ రోడ్లను బాగుచేయాల్సిన బాధ్యత కేటీఆర్‌పై ఉన్నప్పటికీ అసలు సమస్య వేరే ఉందని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా తారు రోడ్లు వర్షానికి సులువగా దెబ్బతింటాయి. తారురోడ్డు వేయాలన్నా ఎండకాలమే సరైన సమయం. కనీసం వర్షాలైనా తెరిపి ఇవ్వాలి. కానీ హైదరాబాద్‌కు వరుణుడు ఆ అవకాశం ఇవ్వడం లేదు. ప్రతివారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెల్లవారే సరికి రోడ్లన్నీ గుంతలమయం అయిపోతున్నాయి. అయితే వర్షాన్ని సాకుగా చూపించి పూర్తిగా తప్పించుకునేందుకు కూడా అవకాశం లేదు. ఎందుకంటే నగరంలో చాలా చోట్ల కేబుల్‌వైర్ల కోసం రోడ్లను ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. తవ్విన గుంతలను వారాల తరబడి అలాగే వదిలేస్తున్నారు. కానీ ఆ పరిస్థితిని నివారించే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం నుంచి కనిపించడం లేదు. టీవీ ఛానళ్లు మొత్తం హైదరాబాద్‌ రోడ్ల మీద ఫోకస్ పెట్టినప్పుడు మాత్రమే మున్సిపల్ శాఖ, జీహెచ్‌ఎంసీలో కాసింత చలనం వస్తోంది. తర్వాత పరిస్థితి తిరిగి మొదటికి వస్తోంది. మొత్తం మీద కేటీఆర్‌ మున్సిపల్ శాఖను తీసుకోవడం ద్వారా హైదరాబాద్‌ ప్రజల నుంచి మార్కులు పొగొట్టుకున్నారన్న భావన వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు ఆ శాఖ నుంచి తప్పించుకునేందుకు అవకాశం లేదు. అలా చేస్తే పారిపోయారన్న విమర్శ వస్తుంది. అయితే ఇదివరకులా కాకుండా వర్షాలు ఆగిపోతే ఈసారైనా కేవలం సమీక్షలతో సరిపెట్టకుండా హైదరాబాద్‌ రోడ్లపై కేటీఆర్‌ ఏ స్థాయిలో దృష్టిపెడుతారో చూడాలి.

Click on Image to Read:

ys-jagan

chandrababu-naidu-central-government

lokesh