స్తంభించిన హైదరాబాద్

హైదరాబాద్‌ జలదిగ్భంధంలో చిక్కుకుంది. రాత్రి ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయింది. పలు చెరువులకు గండ్లుపడ్డాయి. హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో నీటిని వదిలేందుకు అధికారులు సిద్ధమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కోఠి, అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, పంజగుట్ట, బంజారాహిల్స్, ఎస్.ఆర్.నగర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, సూరారం కాలనీ, జీడిమెట్ల, ఆల్విన్ కాలనీ, కర్మన్ ఘాట్, శేర్ లింగంపల్లి, కూకట్ పల్లి, నిజాంపేట తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. బుధవారం కూడా మరోసారి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ప్రజలెవరినీ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రకటించిన జీహెచ్ఎంసీ నగరంలోని అన్ని విద్యాసంస్ధలకు సెలవు ఎందుకు ప్రకటించలేదో అర్ధం కాదు.

మియాపూర్‌లో చెరువుకు గండ్లుపడ్డాయి. దీంతో వరద నీరు అనేక అపార్ట్‌మెంట్లలోకి చేరింది. నిజాంపేటలో కూడా పలు అపార్ట్‌మెంట్లలోకి నీరు చేరింది. నగరంలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజలు బస్సులు దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు.

rains-1

hyderabad-pti-2rains