”గీత గోవిందం” సినిమా రివ్యూ

రివ్యూ: గీత గోవిందం
రేటింగ్‌: 2.75/5
తారాగణం: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, నాగబాబు, వెన్నెల కిశోర్, నిత్య మీనన్‌, అనూ ఇమ్మానియేల్, తదితరులు
సంగీతం: గోపీ సుందర్
నిర్మాత: బన్నీ వాసు
దర్శకత్వం: పరశురామ్‌

అర్జున్ రెడ్డి వచ్చి ఏడాది అవుతున్న నేపధ్యంలో ”గీత గోవిందం” మీద హైప్ భారీగా ఉంది. స్టార్ హీరోల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుండటం చూసి ట్రేడ్ కూడా ఆశ్చర్యపోయింది. పట్టుమని పది సినిమాలు కూడా లేని విజయ్ దేవరకొండకు ఈ స్థాయిలో క్రేజ్ ఉండటం అంటే ఆశ్చర్యమే.

విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) తాను మొదటి చూపులోనే ఇష్టపడిన గీత (రష్మిక మందన్న)ను ఓ బస్సులో పొరపాటున ముద్దు పెడితే…. ఆమె తన అన్నయ్య ఫణింద్ర (సుబ్బరాజు)కు చెప్పి ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. కానీ గోవింద్ తప్పించుకుంటాడు.

కట్ చేస్తే గోవిందు చెల్లితోనే ఫణింద్ర నిశ్చితార్థం జరుగుతోంది. నిజం చెబితే గోవింద్ తండ్రి (నాగబాబు) చనిపోతారు అనే ఉద్దేశంతో గీత సైలెంట్ అయిపోతుంది. పెళ్లి పనుల కోసం గీత గోవిందంలు కలిసి తిరుగుతారు. ఈ క్రమంలో మొదలైన అపార్థాలు ప్రేమగా మారతాయి. పెళ్లి దాకా వెళ్తున్న తరుణంలో గోవింద్ నో చెబుతాడు. హర్ట్ అయిన గీత తన బావ (వెన్నెల కిశోర్)తో పెళ్ళికి ఓకే చెబుతుంది. మరి గీత గోవిందం.. ఒక్కటి ఎలా అయ్యారు అనేది మిగిలిన కథ.

విజయ్ దేవరకొండలో యూత్ ని, అమ్మాయిలను ఆకర్షించే మహత్తు ఏదో ఉంది. యాక్టింగ్ టాలెంట్ ఉన్నప్పటికీ దాని కన్నా మిన్నగా ఈ శక్తి ఏదో పని చేస్తోంది కాబట్టే అతనంటే క్రేజ్ పెంచుకుంటున్నారు. అర్జున్ రెడ్డికి పూర్తి వ్యతిరేకంగా ఉండే గోవిందుకు విజయ్ పర్ఫెక్ట్ ఛాయస్. బాగా మెప్పించాడు కూడా.

స్టూడెంట్ తనను ప్రేమించకుండా కనువిప్పు కలిగించే సీన్ లో మెచ్యూరిటీ చూపించాడు. కాకపోతే ఇతర హంగులు ఇతని సినిమాల్లో బాగా తోడవ్వడంతో పాస్ అయిపోతున్నాడు కానీ రియల్ ఛాలెంజ్ అనిపించే పాత్ర ఏదైనా దొరికి…. అప్పుడు తన ఒరిజినల్ టాలెంట్ బయట పడితే…. రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది.

రష్మిక మందన్న అందంగా ఉంది. ముక్కు మీద కోపం ఉన్న గీతగా తనను తప్ప ఇంకెవరినీ ఊహించుకోవడం కష్టమే. అభయ్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ అలవాటైన రొటీన్ కామెడీనే తలకెత్తుకున్నారు. అనూ ఇమ్మానియేల్, నిత్య మీనన్ చిన్న సర్ ప్రైజ్.

దర్శకుడు పరశురామ్ కథలో కీలకమైన ట్విస్ట్ బాగుంది. ఏదో రొటీన్ లవ్ స్టోరీ లాగా ఉంది అని అనిపించినా మొదటి అరగంట తర్వాత కథకు ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఇంటర్వెల్ తర్వాత ఏమవుతుందా అనే ఆసక్తి రేపుతాడు. రొటీన్ కి భిన్నంగా హీరో మీద హీరోయిన్ విపరీతమైన ద్వేషాన్ని కలిగివుండటం అనే పాయింట్ ని బాగా డీల్ చేసిన పరశురామ్ ఓ 60 శాతం అయ్యాక రొటీన్ లోకి వచ్చేస్తాడు.

ఎమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా లైట్ కామెడీతో టైం పాస్ మీద స్క్రిప్ట్ రాసుకున్న పరశురామ్ ఆ మేరకు విజయం సాధించాడు. లీడ్ పెయిర్ మధ్య బ్రేక్ అప్ మాత్రం అంత కన్విన్సింగ్ గా తీయకపోవడంతో…. గోవిందు పెళ్లికి నో చెప్పే కారణం చాలా కృతకంగా అనిపిస్తుంది.

ఇక అక్కడి నుంచి ఏదోలా…. అనే ఉద్దేశంతో సీన్లు రాసుకున్నట్టు అనిపిస్తుంది తప్ప ఫస్ట్ టెంపో దాదాపు తగ్గిపోతుంది. కానీ ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, రిచ్ ప్రొడక్షన్ ఎక్కడికక్కడ కాపాడుకుంటూ వచ్చాయి. అయినా కూడా డీసెంట్ ఎంటర్ టైనర్ ట్యాగ్ తో పరశురామ్ పాస్ అయిపోయాడు.

గోపి సుందర్ మాయాజాలం ఒక్క పాటకే పరిమితం. ”ఇంకేం కావాలె” పాట ప్రభావం కాబోలు మిగిలినవి అంతగా ఎక్కవు. మణికందన్ కెమెరా పనితనం చాలా బాగుంది. మార్తాండ్ కె వెంకటేష్ కత్తెర ఇంకొంచెం పదునుగా ఉంటే బాగుండేది. గీతా ఆర్ట్స్ కావడం…. నిర్మాణం చాలా రిచ్ గా తెరకెక్కడంతో…. లోపాలన్నీ అందులో కొట్టుకుపోయాయి.

చివరిగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల సహనంతో ఆడుకున్న కొన్ని ఆణిముత్యాల కంటే ”గీత గోవిందం” ఎన్నో రెట్లు బెటర్ ఎంటర్ టైనర్. కాకపోతే మరీ అంచనాలు భారీగా పెట్టుకోకుండా వెళ్తే నిరాశ పడే అవకాశాలు తక్కువ.

లైన్ పరంగా చూసుకుంటే గొప్ప లవ్ స్టోరీ అనిపించుకునే ఛాన్స్ లేకపోయినా ట్రీట్మెంట్ లో ఉన్న వైవిధ్యం, ప్రేక్షకులను ఎంగేజ్ చేయటంలో పరశురామ్ చూపిన నేర్పరితనం సినిమా గోవిందా కాకుండా కాపాడాయి.

గీత గోవిందం – విజయ్ రష్మికల మయం