”పేపర్ బాయ్” సినిమా రివ్యూ

రివ్యూ:  పేపర్ బాయ్
రేటింగ్‌: 1.75/5
తారాగణం: శోభన్, రియా, తాన్యా తదితరులు
సంగీతం:  భీమ్స్‌ సిసిరొలియో
నిర్మాత:  సంపత్‌ నంది
దర్శకత్వం: జయశంకర్‌ 

తెలుగులో ఈ మధ్య సున్నితమైన ప్రేమ కథలు రాలేదే అనే లోటును తీర్చే ఫీలింగ్ కలిగించిన ట్రైలర్ తో ”పేపర్ బాయ్” ముందు నుంచి యూత్ ని బాగానే టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. అందుకే పోటీ లేని టైంలో విడుదల కావడంతో పాటు గీత ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ ద్వారా విడుదల కావడంతో అంచనాలు ఓ మోస్తరుగా బాగానే ఉన్నాయి.

ఇది చిన్న చిన్న మలుపులు ఉన్న ఒక మాములు ప్రేమ కథ. సంపాదన కోసం కష్టపడే ఒక బీటెక్ చదివిన కుర్రాడు రవి(శోభన్). ధరణి(రియా)అనే బాగా డబ్బున్న అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి కూడా ఒప్పుకుని నిశ్చితార్థం దాకా తెస్తాడు. కానీ ధరణి అన్నయ్యలు వచ్చాక సీన్ మారిపోతుంది. రవి ధరణిని వద్దనుకుని వెళ్ళిపోతాడు. అసలు ఏం జరిగింది. ధరణిని అంత హఠాత్తుగా రవి ఎందుకు వద్దనుకున్నాడు. చివరికి ఈ పేపర్ బాయ్ ప్రేమ ఏమైంది అనేది అసలు కథ.

శోభన్ ఈ పాత్ర పర్ఫెక్ట్ ఛాయస్. పెద్దగా అనుభవం లేకపోయినా మంచి ఈజ్ తో సహజంగా నటించడంతో పేపర్ బాయ్ టైటిల్ కి న్యాయం చేకూర్చాడు. ఇంకాస్త సానబెడితే మంచి యాక్టర్ గా నిలిచే ఛాన్స్ ఉంది. రియా సుమన్ ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. పాత్ర చాలా డెప్త్ ఉన్నా దాన్ని ఈజీగా మోసిన తీరు మెప్పిస్తుంది. ఇక మిగిలినవాళ్లకు అంతగా చెప్పుకోదగ్గ పాత్రలు కాదు కాబట్టి చర్చకు రారు. సెకండ్ హీరోయిన్ తాన్యా హీరో ప్రేమతో సంబంధం లేని పాత్ర కావడంతో సోసోగా అనిపిస్తుంది.

దర్శకుడు జయశంకర్ సినిమా కాన్వాస్ కు సరిపడా కథను, కథనాన్ని రాసుకోలేదు. ఒక చిన్న లైన్ మీద ఎమోషన్స్ ని హై లైట్ చేస్తూ సంపత్ నంది అందించిన కథకు న్యాయం చేయలేక బాగా తడబడ్డాడు. ఫలితంగా మరీ నీరసంగా నెమ్మదిగా సాగుతాడు పేపర్ బాయ్. ముందు ఏం జరుగుతుందో సులభంగా ఊహించగలిగే కథను రాసుకున్నప్పుడు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయాలంటే చాలా బలమైన సన్నివేశాలు ఉండాలి. వాటికి బదులు మరీ నీరసంగా సాగే ఓవర్ డ్రామాతో ప్రేమ కాస్త…. ఓపికకు పరీక్షగా మారింది.

పీకల్లోతు ప్రేమలో మునిగితేలే జంటలకు ఓ మోస్తరుగా కనెక్ట్ అవ్వొచ్చేమో కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం పెదవి విరిచేలాగే రాసుకున్నాడు సంపత్. దానికి జయశంకర్ అనుభవ లేమి ఫలితాన్ని మార్చేసింది. భీమ్స్ సంగీతం ఫీల్ గుడ్ తో పాస్ మార్కులు వేయించుకుంది కానీ ఇంకా బాగా ఇచ్చి ఉండవచ్చు. సౌందర రాజన్ కెమెరా పనితనం చాలా మటుకు కాపాడింది. తమ్మిరాజు ఎడిటింగ్ వీకే. సంపత్ నంది తెలివిగా బడ్జెట్ లోనే పని కానిచ్చేశాడు.

పేపర్ బాయ్ ఓ సాదాసీదా రొటీన్ ప్రేమ కథ. ఇంత కన్నా దీని గురించి గొప్పగా చెప్పే అవకాశాన్ని దర్శకుడు చేజేతులా వదులుకున్నాడు. దానికి ముమ్మాటికీ అతని ట్రీట్మెంట్ కారణమని చెప్పాలి. హీరో హీరోయిన్ విడిపోవడం అనే ఏళ్ళ నాటి పాత ఫార్ములాకు అంత కన్నా అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే తో నడిపించిన తీరు పేపర్ బాయ్ కిందపడేలా చేశాయి. పోటీ లేని మంచి అవకాశాన్ని పేపర్ బాయ్ వాడుకోవడం డౌటే.

పేపర్ బాయ్ : నెమ్మదిగా తడిసి చిరిగిపోయింది.