Telugu Global
Cinema & Entertainment

"సిల్లీ ఫెలోస్" సినిమా రివ్యూ

రివ్యూ:  సిల్లీ ఫెలోస్ రేటింగ్‌: 1.5/5 తారాగణం:  అల్లరి నరేష్, సునీల్, జయప్రకాష్ రెడ్డి , చిత్ర శుక్ల, పూర్ణ, నందిని రాయ్, పోసాని, రాజా రవీంద్ర తదితరులు సంగీతం:  శ్రీ వసంత్‌ నిర్మాత: భరత్‌ చౌదరి, కిరణ్‌ రెడ్డి దర్శకత్వం:  భీమినేని శ్రీనివాసరావు ఒకప్పుడు హాస్య చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి హీరోలకు జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహారావు లాంటి దర్శకులు అండగా నిలిచేవారు. హాస్యంలో కొత్త పుంతలు తొక్కడమే కాదు తమ టాలెంట్ తో వాటిని ఎక్కడికో […]

సిల్లీ ఫెలోస్ సినిమా రివ్యూ
X

రివ్యూ: సిల్లీ ఫెలోస్
రేటింగ్‌: 1.5/5
తారాగణం: అల్లరి నరేష్, సునీల్, జయప్రకాష్ రెడ్డి , చిత్ర శుక్ల, పూర్ణ, నందిని రాయ్, పోసాని, రాజా రవీంద్ర తదితరులు
సంగీతం: శ్రీ వసంత్‌
నిర్మాత: భరత్‌ చౌదరి, కిరణ్‌ రెడ్డి
దర్శకత్వం: భీమినేని శ్రీనివాసరావు

ఒకప్పుడు హాస్య చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి హీరోలకు జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహారావు లాంటి దర్శకులు అండగా నిలిచేవారు. హాస్యంలో కొత్త పుంతలు తొక్కడమే కాదు తమ టాలెంట్ తో వాటిని ఎక్కడికో తీసుకెళ్లిపోయేవారు కాబట్టి పీవీ నరసింహరావు లాంటి దేశ ప్రధానులు సైతం రిలీఫ్ కోసం వీళ్ళ సినిమాలు చూసేవాళ్ళు.

ఇప్పుడు ఆ స్థాయి ఆశించడం అత్యాశే కానీ ఉన్నంతలో ఏదో ఒక ప్రయత్నం చేసి కాసిన్ని నవ్వులు పూయిస్తారు అని పేరున్న అల్లరి నరేష్, సునీల్ లు చాలా కాలం తర్వాత కలిసి చేయటంతో సిల్లీ ఫెలోస్ గురించి ప్రేక్షకుల్లో కొంత హైప్ అయితే వచ్చింది. మరి వాటిని నిలబెట్టుకునేలా ఈ సినిమా ఉందా లేదా మన తీరు మారదు అని నిట్టూర్చేలా ఉందా?

వీరబాబు (అల్లరి నరేష్), సూరిబాబు(సునీల్) ఇద్దరూ స్నేహితులు. స్థానిక ఎమ్మెల్యే జాకెట్ జానకి రామ్ (జయప్రకాష్ రెడ్డి)కి రైట్ హ్యాండ్ లా ఉంటాడు వీరబాబు. తన బాస్ కోసం అనుకోని పరిస్థితుల్లో డాన్సర్ పుష్ప(నందిని రాయ్)తో ఫ్రెండ్ సూరి బాబు పెళ్లి జరిపించేస్తాడు. తాను వసంతి (చిత్ర శుక్ల) ప్రేమలో పడతాడు. పుష్పను వదిలించుకుని తన మరదలి (పూర్ణ)ను చేసుకోవాలని సూరిబాబు ప్రయత్నిస్తూ ఉంటాడు.

ఇంతలోపు జానకి రామ్ యాక్సిడెంట్ జరిగి కోమాలోకి వెళ్తాడు. అతనితో 500 కోట్ల డబ్బుకు సంబంధించిన రహస్యంతో పాటు వీరబాబు, సూరిబాబు జీవితాలు కూడా ముడిపడి ఉంటాయి. మరోవైపు జానకి రామ్ అపోజిషన్ (పోసాని, రాజా రవీంద్ర) అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. మరి సిల్లీ ఫెలోస్ ఈ పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడ్డారు అనేదే మిగిలిన కథ.

అల్లరి నరేష్, సునీల్ ఇద్దరివీ గతంలో చాలా సార్లు చేసిన పాత్రలే. ఇలా కలిసి చూసి చాలా కాలం అయ్యిందనే తప్ప విడిగా చూసుకుంటే ఎన్నో సినిమాల్లో అరిగిపోయిన రోల్స్ నే మళ్ళీ రాసుకున్నాడు దర్శకుడు భీమినేని. పెర్ఫార్మన్స్ పరంగా వంక పెట్టడానికి లేదు. తమకు అలవాటైన రీతిలో చేసుకుంటూ పోయారు.

సునీల్ తన పాత టైమింగ్ తో ఇన్నాళ్లు మిస్ అయిన ఫీలింగ్ కలిగిస్తాడు కానీ తన స్టామినాకు తగ్గ కథే ఇది కాలేకపోయింది. అల్లరి నరేష్ ఇలాంటివి కొట్టిన పిండి. చపాతీ తిన్నంత సులభంగా చేసేసాడు. హీరోయిన్లు చిత్రా శుక్లా, నందిని రాయ్ గురించి చెప్పడానికి ఏమి లేదు. పూర్ణ రెండు సీన్లకే పరిమితం. జయప్రకాష్ రెడ్డి, పోసాని, హేమ, రాజా రవీంద్ర, అదుర్స్ రఘు అందరివీ పరమ రొటీన్ పాత్రలు. ఎన్నోసార్లు చేసిన అనుభవం కాబోలు అలా యాంత్రికంగా నవ్వించే ప్రయత్నం అయితే చేసారు.

తమిళ్ లో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన వాటిని తెలుగు రీమేక్ చేయటంలో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు సిద్ధహస్తుడు. పవన్ కళ్యాణ్, వెంకటేష్ లతో మంచి ట్రాక్ రికార్డు ఉంది ఈయనకి. కామెడీ జానర్ కు షిఫ్ట్ అయ్యాక కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్న భీమినేని సుడిగాడులో కాస్త కొత్తగా అనిపించినా సిల్లీ ఫెలోస్ తో మాత్రం దొరికిపోయాడు.

ఇప్పటికే ఒకసారి తెలుగులో డబ్బింగ్ రూపంలో వచ్చిన ఒరిజినల్ సినిమాను ఇలా రీమేక్ చేసే అవసరం ఏమొచ్చిందో ఆయనే చెప్పాలి. పోనీ అదైనా సమర్ధవంతంగా డీల్ చేసారా అంటే అదీ లేదు.

ఒక మూసలో సాగిపోయే పాత సన్నివేశాలతో ఏ దశలోనూ ఆసక్తికరంగా మలచలేకపోయాడు. అక్కడక్కడా నవ్వించినా ఫైనల్ గా బయటికి వచ్చేటప్పుడు ఇంతేనా అనే ఫీలింగ్ కలిగించడం అతని తప్పే. శ్రీవసంత్ సంగీతం మైనస్ కాదు ప్లస్సు కాదు. ఇదే ఎక్కువ అనేలా ఇచ్చాడు. ఎడిటింగ్ లో గౌతమ్ రాజు సీనియారిటీ పెద్దగా ఉపయోగపడలేదు. నిర్మాతలు మాత్రం బాగానే ఖర్చు పెట్టారు.

ఫైనల్ గా చెప్పాలంటే సిల్లీ ఫెలోస్ టైటిల్ కు తగ్గట్టే ఉంది. కాకపోతే ఫెలోస్ తీసి ఆ ప్లేస్ లో సినిమాకు వచ్చిన ప్రేక్షకులను పెట్టొచ్చు. ఒకేతరహా కామెడీతో ఎల్లకాలం సక్సెస్ సాధించలేం అని తెలిసి కూడా ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తున్న హీరోలు నరేష్, సునీల్ లతో పాటు దర్శక నిర్మాతలను అభినందించడానికి తప్ప సిల్లీ ఫెలోస్ ఇంకెందుకూ ఉపయోగపడలేదు.

సిల్లీ ఫెలోస్ – మోత ఎక్కువ విషయం తక్కువ

First Published:  6 Sep 2018 10:40 PM GMT
Next Story