Telugu Global
Cinema & Entertainment

"శైలజారెడ్డి అల్లుడు" సినిమా రివ్యూ

రివ్యూ: శైలజారెడ్డి అల్లుడు రేటింగ్‌: 2/5 తారాగణం: నాగ చైతన్య, అను ఇమ్మానియేల్, రమ్యకృష్ణ, మురళి శర్మ, నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు సంగీతం: గోపి సుందర్ నిర్మాత: ఎస్‌. రాథాకృష్ణ, నాగ వంశీ, పి.డి.వి ప్రసాద్‌ దర్శకత్వం: మారుతీ టాలీవుడ్ కు అత్తా అల్లుళ్ళ సినిమాలు కొత్త కాదు. ‘బొమ్మా బొరుసా’ తో మొదలుపెడితే ఈ ఫార్ములాలో చేయని హీరో లేడు అంటే అతిశయోక్తి కాదు. కాకపోతే అది కాస్త రొటీన్ గా మారడంతో ఈ […]

శైలజారెడ్డి అల్లుడు సినిమా రివ్యూ
X

రివ్యూ: శైలజారెడ్డి అల్లుడు
రేటింగ్‌: 2/5
తారాగణం: నాగ చైతన్య, అను ఇమ్మానియేల్, రమ్యకృష్ణ, మురళి శర్మ, నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: గోపి సుందర్
నిర్మాత: ఎస్‌. రాథాకృష్ణ, నాగ వంశీ, పి.డి.వి ప్రసాద్‌
దర్శకత్వం: మారుతీ

టాలీవుడ్ కు అత్తా అల్లుళ్ళ సినిమాలు కొత్త కాదు. ‘బొమ్మా బొరుసా’ తో మొదలుపెడితే ఈ ఫార్ములాలో చేయని హీరో లేడు అంటే అతిశయోక్తి కాదు. కాకపోతే అది కాస్త రొటీన్ గా మారడంతో ఈ మధ్యకాలంలో ఎవరూ ట్రై చేయలేదు. అందుకే నాగ చైతన్య హీరోగా శైలజారెడ్డి అల్లుడు ప్రకటన రాగానే అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. దానికి తోడు రమ్య కృష్ణ టైటిల్ రోల్ చేస్తుండటంతో మాస్ ప్రేక్షకులు కూడా దీని నుంచి చాలానే ఆశించారు.

వరంగల్ జిల్లాలో ఉండే ఓ ఊరి పెద్ద మనిషి శైలజారెడ్డి (రమ్యకృష్ణ). తనకో కూతురు అను (అను ఇమ్మానియేల్). ఇద్దరు ఈగోలకు బ్రాండ్ అంబాసిడర్లు. ఓ చిన్న విషయంలో అపార్థం మొదలై ఇద్దరు ఐదేళ్లుగా మాట్లాడుకోవడం మానేస్తారు. అను ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ కోసం హైదరాబాద్ వస్తుంది. వచ్చాక చైతు (నాగ చైతన్య)తో ప్రేమలో పడుతుంది. చైతు తండ్రి రావు (మురళి శర్మ)కు సైతం ఒళ్ళంతా ఈగో. అను మనస్తత్వం నచ్చి సడన్ గా నిశ్చితార్థం చేస్తాడు. ఈ లోపు శైలజారెడ్డి మనుషులు వచ్చి అనుని ఊరికి తీసుకెళ్లిపోతారు. తన ప్రేమను గెలిపించడంతో పాటు తల్లి కూతుళ్ళను కలిపే బాధ్యత తీసుకుంటాడు చైతు. మరి ఆ కార్యం ఎలా నెరవేర్చుకుంటాడు అనేదే మిగిలిన కథ.

చైతు మాస్ లుక్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. సాఫ్ట్ స్టోరీస్ తో తొమ్మిదేళ్ల కెరీర్ ముగిశాక నాగార్జున లాగ తనకంటూ మాస్ మార్కేట్ ని ఏర్పరుచుకుందామని డిసైడ్ అయ్యి ఇది ఎంచుకున్నాడు. తనవరకు ఏ లోపం లేకుండా చేసాడు కానీ నటుడిని మెరుగుపరిచేంత గొప్ప పాత్ర మాత్రం ఇది కాలేకపోయింది. గెడ్డం పెంచి కాస్త మాస్ గా ఉన్నాడు కానీ ఇలా సెటిల్ కావాలంటే ఇంకా చాలా హోమ్ వర్క్ చేయాలి. అను ఇమ్మానియేల్ పొగరు నిండిన అమ్మాయిగా బాగా నప్పింది. యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం అనవసరం. రమ్యకృష్ణ ఎప్పటి లాగే అదరగొట్టింది. కానీ శైలజారెడ్డి పాత్ర చిత్రణే పేలవంగా ఉంది. మురళి శర్మ, నరేష్, వెన్నెల కిషోర్, పృథ్వి, కేదార్ నాధ్, శరణ్య ప్రదీప్, శత్రు రొటీన్ లో కెల్లా రొటీన్ పాత్రలు.

మారుతీ తీసుకున్న పాయింట్ చాలా సిల్లీగా ఉంది. అత్తగా రమ్యకృష్ణను, అల్లుడిగా చైతుని ఊహించుకుని మైండ్ లో ఏది తోస్తే అది కథగా రాసుకున్నాడు తప్ప బలమైన ఎమోషన్ ని చూపాలనుకున్న మారుతీ ప్రయత్నం పూర్తిగా వృధా అయ్యింది. చైతు- అనుల మధ్య ప్రేమ కథ చాలా తీసికట్టుగా రాసుకున్న మారుతీ ఇద్దరి మధ్య ప్రేమను చూపించే క్రమంలో మరీ ఓనమాలు తెలియని కొత్త దర్శకుడిలా ఆలోచించడం విచిత్రం.

ఈగోతో రగిలిపోతూ అంత ఆలోచించే అను తన పనిమనిషిని చైతు ప్రేమించాడు అని తెలుసుకుని ఆ పంతంతో తనను హీరో ప్రేమించాలని కోరుకోవడం చూస్తే మారుతీ సృజనాత్మకతకు దండం పెట్టాలి అనిపిస్తుంది. ఇక తల్లి కూతుళ్లు ఏళ్ళ తరబడి మాట్లాడుకోకపోవడానికి కారణం కూడా చాలా పేలవంగా రాసుకుని దాని చుట్టూ అనవసరమైన డ్రామాను చూపించే ప్రయత్నం చేసి సెకండ్ హాఫ్ మొత్తాన్ని అనవసరమైన లెంగ్త్ తో సాగదీసాడు.

ఎక్కడా…. ఈ భాగం చాలా బాగుంది అనిపించేలా ఏదీ లేకపోవడం అసలు మైనస్. రెండు మూడు సీన్లు తప్ప మారుతీ బ్రాండ్ కామెడీ ఎక్కడా కనిపించదు. గోపి సుందర్ సంగీతం రణగొణ ధ్వని. వీక్ గా ఉన్న కొన్ని సీన్స్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కాపాడాడు. పాటలు మాత్రం చాలా వీక్. నిజార్ షఫీ కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ చేయకుండా కోటగిరి చేతులు కట్టేసినట్టు ఉన్నారు. అంత అనుభవం ఉన్నా లాభం లేకుండా పోయింది. నిర్మాతలు మాత్రం శక్తి వంచన లేకుండా ఖర్చు పెట్టారు.

చివరిగా చెప్పాలంటే శైలజారెడ్డి అల్లుడు అవసరం లేని ఎమోషనల్ డ్రామాతో సాగదీసిన అత్తా అల్లుళ్ళ సినిమా. ఏ అల్లరి అల్లుడినో లేక దొంగల్లుడినో రీమేక్ చేసుకున్నా బాగుండేది. కానీ వెరైటీగా చూపించాలనే తాపత్రయంలో అందరికి ఈగోలు పెట్టి పదే పదే విసిగించడాన్ని ప్రేక్షకులు భరించడం కష్టమే.

ఏదో టైం పాస్ గా గడిచిపోతుంది అనుకుంటే ఎక్కడికక్కడ గ్రాఫ్ ని డౌన్ చేసుకుంటూ పోయి శైలజారెడ్డి అల్లుడిని ఎటు కాకుండా చేసాడు మారుతీ.

శైలజారెడ్డి అల్లుడు – ఈగోల మోతలో ప్రేక్షకుడి బలి

First Published:  12 Sep 2018 10:35 PM GMT
Next Story