మోహిని

మోహనము అంటే మోహం కలిగించునది అని అర్థం. మోహిని అంటే విష్ణువు దాల్చిన సుందర రూపమని అర్థం. విష్ణువు పురుషుడైనప్పటికీ అంత అందమైన స్త్రీరూపం యెందుకు ధరించాల్సి వచ్చింది? మోహినీ అవతారమని కూడా యెందుకు అన్నారు? ఆ అవతారం యెత్తడం వలన వచ్చిన ప్రయోజనమేమిటి? ఫలితాలేమిటి?

అమృతం తాగినవాళ్ళు మరణాన్ని జయిస్తారని ప్రతీతి. అమృతం అందరికీ కావాలి. అందుకే అటు దేవతలూ యిటు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించారు. అమృతం పుట్టింది. ఆ అమృత కలశం రాక్షసులు అందుకున్నారు. వారిలో వారే పంచుకుంటున్నారు. తమ వరకూ రాదేమోనని దేవతలు భయపడ్డారు. విష్ణుమూర్తి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళారు. భయాన్ని బయట పెట్టుకున్నారు. విష్ణుమూర్తి వెంటనే జగన్మోహినీ రూపం దాల్చాడు. అమృతం పంచుకుంటున్న అసురుల మధ్య ప్రత్యక్షమయ్యాడు. మీలో మీరు తగవులు పడొద్దూ నేను పంచుతాను అంది మోహిని. ఆమె రూపం మోహనంగా ఉంది. ఆమె స్వరం సమ్మోహనంగా ఉంది. కనురెప్పలు మూయకుండా మూగవాళ్ళలా చూస్తూ తలలాడించారు. అమృత కలశం అందుకుంది మోహిని. చెప్పినట్టుగా రాక్షసులూ దేవతలూ రెండు వరుసలుగా ఎవరి వరుసల్లో వాళ్ళు నిల్చున్నారు. అందానికే అందంగా దివ్య సుందర రూపంగా కళ్ళముందు కనిపిస్తూవుంటే అసురులు ఆస్వాదించారు. అమృతం మాట మరిచారు. మైమరచి పోయారు. మోహిని ఆ అమృతాన్ని దేవతలకే పోస్తూపోయింది. అమృతం మీద దృష్టి నిలిపిన రాహువు దేవతల వరుసలోకెళ్ళి అమృతం తాగాడు. ఆ సంగతి చూసిన సూర్య చంద్రులు మోహినికి చెప్పారు. అప్పుడు మాయా మోహిని చక్రం వేసింది. మొత్తానికి మాయా మోహంలో పడ్డ రాక్షసులకు అమృతం దక్కలేదు. దేవతలు మాత్రం అమృతాన్ని తాగారు!

అసురులు అమృతాన్ని దక్కించుకోలేకపోయారని శివునికి తెలిసింది. మైమరపించిన జగన్మోహిని రూపం చూడాలనిపించింది. ఆ మనోహర రూపాన్ని తనకు చూపించమని శివుడు కోరాడు. విష్ణువు అంతరార్థం బోధించాడు. శివుని కళ్ళు మూల మూలల వెదుకుతూనే ఉన్నాయి. వెంటపడుతూనే ఉన్నాయి. విష్ణువు జగన్మోహిని రూపంలోకి మారాడు. ఆ రూపాన్ని చూడడంతోనే మాయా మోహనంలో బందీ అయ్యాడు శివుడు. మతి భ్రమించింది. ఆ అపురూపాన్ని అందుకోవాలనుకున్నాడు. వెంట పడ్డాడు. మోహిని పరిగెత్తింది. నీడలా విడవని శివుడు గుట్టలు, పుట్టలు, కొండలు, కోనలు దాటి పోయాడు. తాళలేని శివుడు తేజస్సు నేలపై పడింది. కాలభైరవుడు పుట్టాడు. విష్ణుమాయ తెలుసుకున్నాడు. శివుడు ప్రార్థించగా విష్ణువు అసలు రూపు ధరించాడు.

మోహిని అంటే స్త్రీ పిశాచి వింతరూపమని కూడా అర్థం యెందుకు ఉందో మోహిని కథే చెప్తుంది!.

-బమ్మిడి జగదీశ్వరరావు