Telugu Global
Family

జ్ఞాని

                గొప్ప వివేకవంతుడయిన ఒక జ్ఞాని చైనా దేశంలో ఉండేవాడు. ఆయన్ని గురించి గొప్ప గొప్ప వాళ్ళంతా చెప్పుకునేవాళ్ళు. కానీ ఆయన నిరాడంబరుడు. నిర్మల జీవితం గడిపేవాడు. పెద్దవాళ్ళ కంటబడకుండా ఎక్కడో మారు మూల నివసించేవాడు.           సాధారణంగా ఆయన ఎవరికీ దొరికేవాడు కాదు. ఆయన ఎక్కడ ఉంటాడో కూడా ఎవరికీ తెలీదు. కారణం ఎక్కడా ఆయన నిలకడగా ఉండేవాడు కాదు. ఈ రోజు ఒక ప్రాంతంలో ఉంటే రేపు ఇంకో చోట ఉండేవాడు. అందుకని ఆయన్ని […]

గొప్ప వివేకవంతుడయిన ఒక జ్ఞాని చైనా దేశంలో ఉండేవాడు. ఆయన్ని గురించి గొప్ప గొప్ప వాళ్ళంతా చెప్పుకునేవాళ్ళు. కానీ ఆయన నిరాడంబరుడు. నిర్మల జీవితం గడిపేవాడు. పెద్దవాళ్ళ కంటబడకుండా ఎక్కడో మారు మూల నివసించేవాడు.

సాధారణంగా ఆయన ఎవరికీ దొరికేవాడు కాదు. ఆయన ఎక్కడ ఉంటాడో కూడా ఎవరికీ తెలీదు. కారణం ఎక్కడా ఆయన నిలకడగా ఉండేవాడు కాదు. ఈ రోజు ఒక ప్రాంతంలో ఉంటే రేపు ఇంకో చోట ఉండేవాడు. అందుకని ఆయన్ని కనిపెట్టడం కష్టమయ్యేది.

ఆయన పేరు చక్రవర్తి దాకా వెళ్ళింది. అంత గొప్పవాడు, జ్ఞాని తన ఆస్థానంలోవుంటే తనకు గౌరవం ఉంటుందని చక్రవర్తి భావించాడు. ఆ జ్ఞానిని వెదికి తన ఆస్థానానికి తీసుకురమ్మని అధికారుల్ని నియమించాడు.

అధికారులు ఎన్నోరోజులు నానా అగచాట్లు పడి మొత్తానికి ఆ జ్ఞాని ఉన్న చోటుని కనిపెట్టారు. ఆయన ఒక నదీ తీరంలో ఉన్నాడు. చివికిన గడ్డంతో, చింపిరి బట్టల్తో ఉన్నాడు. చేపలకోసం గాలం విసిరి గట్టుకు ఆనుకుని కునుకు తీస్తున్నాడు.

చక్రవర్తి అంతటివాడు అతన్ని ఆస్థాన గురువుగా నియమించాలని నిర్ణయించుకున్నాడంటే అధికారులు ఆ సంగతి విశ్వసించలేక పోయారు.

చివరికి అధికారుల్లో ఒకడు “అయ్యా! మీ కోసం దేశమంతా గాలించి చివరికి మీరు వున్న స్థలం కనిపెట్టాం. మేము మన దేశం చక్రవర్తి అధికారులం. చక్రవర్తి మిమ్మల్ని ఆస్థాన గురువుగా ఉండమని ఆహ్వానించారు. మీరు చక్రవర్తి కోరిక మన్నించి మాతో రండి. మిమ్మల్ని సగౌరవంగా తీసుకుపోతాం” అన్నారు. ఆ జ్ఞాని వాళ్ళందర్నీ కాసేపు ఎగాదిగా చూశాడు. వాళ్ళ మాటలకు ఆ జ్ఞాని ఎగిరి గంతులేస్తాడని వాళ్ళనుకున్నారు. జ్ఞాని వాళ్ళ హావభావాల్ని చదివాడు.

చైనాలో భవిష్యత్తు చెప్పేవాళ్ళు తాబేలు చిప్పను ఉపయోగిస్తారు. జ్ఞాని ఆ సంగతి దృష్టిలోవుంచుకుని “తాబేలు చిప్పని భవిష్యత్తు చెప్పడానికి ఉపయోగించాలంటే తాబేలు చచ్చిపోవాలి. అప్పుడు తాబేలు చిప్పని తీసుకుని భవిష్యత్తు చెప్పవచ్చు. లేదా తాబేలు బతికి ఉండాలంటే అది చిన్న చెరువులో, బావిలో ఎవరికీ కనిపించకుండా ఉండిపోవాలి. తాబేలు చనిపోవడం మంచిదా? బతికివుండడం మంచిదా? మీరే చెప్పండి” అన్నాడు.

అధికారులు ఆ మాటలకు అవాక్కయి “బతికివుండడమే మంచిది” అన్నారు.

జ్ఞాని “కాబట్టి ఆస్థాన గురువునై అభినందనలు, ఐశ్వర్యాలు పొంది నేను చచ్చిపోవడం కన్నా నిరుపేదగా, నిర్మలంగా ఇక్కడ బతికి ఉండడం మేలు. నన్ను నా మానాన ఉండనివ్వమని మీ చక్రవర్తి గారికి చెప్పండి” అన్నాడు.

పేరు ప్రఖ్యాతలు, అధికారం, ఐశ్వర్యం లెక్కపెట్టని ఆ జ్ఞాని గొప్ప తనానికి ఆశ్చర్యపోయి అధికారులు అతనికి నమస్కరించి సెలవు తీసుకున్నారు.

– సౌభాగ్య

First Published:  15 Sep 2018 1:06 PM GMT
Next Story