మందు బాబు ఫ్రస్ట్రేషన్…. పోలీసులకే షాకిచ్చాడు….

పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్‌ అన్నాడు గిరీశం… కానీ ఇప్పుడా సామెతను మందుకు కూడా అప్లై చేశారు మన మందు బాబులు. అవును…. ఇప్పుడు స్టేటస్ సింబల్ గా…. మద్యం సేవించడం అదో వ్యసనంగా మారిపోయింది. ఇంటర్ నుంచే బీర్లు తాగడాన్ని అలవాటుగా మార్చేసుకుంటున్నారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో అయితే అమ్మాయిలు కూడా బీర్లను మంచినీళ్లలా తాగేస్తారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు మందును, మనిషిని విడదీయలేనంత సామీప్యం ఎక్కువైపోయింది. అందుకే మద్యం ప్రభుత్వాలకు కాసులు కురిపిస్తోంది. అదో ప్రధాన ఆదాయ వనరైంది.

మద్యం తాగి వాహనాలు నడపడం ఎక్కువైంది. దీని వల్ల ప్రమాదాలు విరివిగా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ లు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం ఓ మందుబాబు పోలీసులకే షాకిచ్చాడు.. మందుబాబులకు కొరకరాని కొయ్యగా మారిన బ్రీత్ ఎనలైజర్ నే ఎత్తుకెళ్లి పోలీసులకు టెన్షన్ పెట్టాడు. దీంతో అర్ధరాత్రి వేళ పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన చెన్నైలో సంచలనం సృష్టించింది.

చెన్నైలోని అడయార్ సమీపంలో ఆదివారం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ బడాబాబు భూషణ్ ఫుల్లుగా తాగి లగ్జరీ కారులో వచ్చాడు. పోలీసులు ఆపి బ్రీత్ అనలైజర్ తో పరీక్షించారు. దీంతో ఎక్కడ దొరికిపోతానేమోనన్న భయంతో ఆ మందు బాబు బ్రీత్ అనలైజర్ ను పట్టుకొని పరారయ్యాడు.

బ్రీత్ అనలైజర్ గల్లంతు కావడంతో పోలీసులు షాక్ అయ్యి ఆ యువకుడిని పట్టుకునేందుకు నగరంలోని అన్ని ట్రాఫిక్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. చాలా చోట్ల వాహనాలను ఆపేశారు. ఓ చోట గుర్తించి చేజ్ చేసి మరీ యువకుడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి బ్రీత్ అనలైజర్ ను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. ఇలా మందుబాబు ఏకంగా బ్రీత్ అనలైజర్ నే పట్టుకొని వెళ్లడం చెన్నైలో హాట్ టాపిక్ గా మారింది.