కొండ దిగివచ్చిన కేసీఆర్‌

దాదాపు అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖాయం చేసిన కేసీఆర్‌…. కొండా సురేఖ పేరును మాత్రం పెండింగ్‌లో ఉంచారు. దీంతో కొండా దంపతులు ఏకంగా మీడియా ముందుకు వచ్చి దుమ్మెత్తిపోశారు. తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వరంగల్‌ తూర్పుతో పాటు కుమార్తె కోసం భూపాలపల్లి టికెట్‌ను కొండా సురేఖ ఆశించిందని ప్రచారం జరగగా…. కేసీఆర్ ఏకంగా కొండా సురేఖకు కూడా టికెట్ ప్రకటించలేదు. దీంతో కొండా దంపతులు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారని వార్తలొచ్చాయి. అయితే ఇంటెలిజెన్స్ నివేదికల వల్ల కేసీఆరే కాస్త వెనక్కు తగ్గినట్టు చెబుతున్నారు.

టీఆర్ ఎస్ తిరిగి అధికారంలోకి రావాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కీలకమని అలాంటి చోటే సీట్లు చేజార్చుకునే పరిస్థితి వస్తే ఇబ్బందులు తప్పవని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. కొండా దంపతులు వరంగల్‌ తూర్పు, పశ్చిమ, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలను ప్రత్యక్షంగా, మరో మూడు నియోజకవర్గాలను పరోక్షంగా ప్రభావితం చేయగలరని ఇంటెలిజెన్సీ వర్గాలు కేసీఆర్‌కు నివేదిక ఇచ్చాయి. దీంతో కేసీఆర్ పునరాలోచన చేసి కొండా మురళీకి ఫోన్ చేసినట్టు చెబుతున్నారు.

తొందరపడవద్దని కేసీఆర్ సూచించారు. మీ రాజకీయ భవిష్యత్తు తనకు వదిలేసి పార్టీ కోసం పనిచేయాలని కేసీఆర్ కోరారని సమాచారం. కొండా సురేఖకు టికెట్ ఇవ్వడంతో పాటు మరో టికెట్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఒకవేళ రెండో సీటు ఇవ్వలేని పక్షంలో ఎలాగో టీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని.. అప్పుడు మరో కీలకమైన పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పరోక్షంగా మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గణేష్ నవరాత్రులు ముగిసిన వెంటనే నేరుగా వచ్చి కలుస్తామని కేసీఆర్‌కు కొండా మురళీ చెప్పినట్టు సమాచారం.