Telugu Global
National

టీమిండియా చీఫ్ కోచ్ రవి శాస్త్రికి మాజీల సెగ!

ఇంగ్లండ్ చేతిలో ఓటమికి బాధ్యత వహించాలంటూ డిమాండ్ పదవి నుంచి రవి శాస్త్రి తప్పుకోవాలి- చేతన్ చౌహాన్ చీఫ్ కోచ్ గా ఏడాదికి 7 కోట్ల 50 లక్షల జీతం అందుకొంటున్న రవిశాస్త్రి భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడు, మాటల మరాఠీ రవి శాస్త్రి పదవి రెండు సీజన్ల ముచ్చటగా ముగిసే ప్రమాదంలో పడింది. గత ఏడాది జరిగిన స్వదేశీ సిరీస్ ల్లో పరుగుల హోరు…సిరీస్ విజయాల జోరుతో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ నిలుపుకొన్న టీమిండియా…. ఇంగ్లండ్ […]

టీమిండియా చీఫ్ కోచ్ రవి శాస్త్రికి మాజీల సెగ!
X
  • ఇంగ్లండ్ చేతిలో ఓటమికి బాధ్యత వహించాలంటూ డిమాండ్
  • పదవి నుంచి రవి శాస్త్రి తప్పుకోవాలి- చేతన్ చౌహాన్
  • చీఫ్ కోచ్ గా ఏడాదికి 7 కోట్ల 50 లక్షల జీతం అందుకొంటున్న రవిశాస్త్రి

భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడు, మాటల మరాఠీ రవి శాస్త్రి పదవి రెండు సీజన్ల ముచ్చటగా ముగిసే ప్రమాదంలో పడింది. గత ఏడాది జరిగిన స్వదేశీ సిరీస్ ల్లో పరుగుల హోరు…సిరీస్ విజయాల జోరుతో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ నిలుపుకొన్న టీమిండియా…. ఇంగ్లండ్ టూర్లో మాత్రం దారుణంగా విఫలమయ్యింది. దీంతో… చీఫ్ కోచ్ రవి శాస్త్రికి తొలిసారిగా పలువురు భారత మాజీ కెప్టెన్ల నుంచి… పదవి నుంచి తప్పుకోవాలంటూ సెగ ప్రారంభమయ్యింది.

స్వదేశంలో పులి… విదేశీగడ్డపై పిల్లి…

స్వదేశీ స్పిన్ పిచ్ లపై టన్నుల కొద్దీ పరుగులు , సిరీస్ వెంట సిరీస్ విజయాలు సాధించే టీమిండియాకు విదేశీ స్వింగ్, పేస్, బౌన్సీ పిచ్ లపై చేతులెత్తేయడం ఓ సాంప్రదాయ బలహీనతగా ఉంటూ వస్తోంది.

అయితే…విరాట్ కొహ్లీ కెప్టెన్ గా, రవి శాస్త్రి చీఫ్ కోచ్ గా ..విదేశీ గడ్డపైన సైతం విజయవంతమైన జట్టుగా నిలుస్తుందన్న ఆశ…ఇంగ్లండ్ తో మూడుఫార్మాట్ల సిరీస్ తోనే ఆవిరైపోయింది.

దీనికితోడు…ఇంగ్లండ్ తో పాంచ్ పటాకా టెస్ట్ సిరీస్ లో….వివిధ మ్యాచ్ లకు తుదిజట్ల ఎంపికలో ఘోరతప్పిదాలు, కెప్టెన్, కోచ్ ల ఒంటెత్తుపోకడలు సైతం..ఓటమికి కారణాలుగా నిలిచాయి.

అహో! గురు…ఒహో! శిష్యా….

టీమిండియా గెలిచినా…ఓడినా…అతితెలివిగా మాట్లాడటం…బుకాయింపు ధోరణిలో సమర్థించుకోడంలో…చీఫ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కొహ్లీ తర్వాతే ఎవరైనా.

ఇంగ్లండ్ చేతిలో 4-1తో చిత్తుగా ఓడినా….తమ ఓటమిని పరాజయంగా చూడరాదని…తమ ఆటతీరును అంకెలలో చూడొద్దంటూ ఇటు కొహ్లీ, అటు రవి శాస్త్రి.. మీడియా ద్వారా గట్టిగా కోరారు.

పైగా…తాము ఎంత గొప్పగా, వీరోచితంగా పోరాడామో గమనించాలని…గతంలో ఇంగ్లండ్ లో పర్యటించిన భారతజట్లలో తమదే అత్యుత్తమ జట్టు అంటూ సమర్థించుకోడాన్ని…మాజీ కెప్టెన్లు దిలీప్ వెంగ్ సర్కార్,వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, చేతన్ చౌహాన్ తప్పుపట్టారు. ఓటమికి బాధ్యత చీఫ్ కోచ్ గా రవిశాస్త్రి తీసుకోవాల్సిందేనంటూ తేల్చి చెప్పారు.

రవిశాస్త్రిపై తీవ్ర ఒత్తిడి…..

ఇంగ్లండ్ టూర్లో టీమిండియా వైఫల్యానికి నైతికబాధ్యత వహిస్తూ రవిశాస్త్రి… చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాలంటూ ఒత్తిడి పెరిగిపోతోంది.

ఐదోర్యాంకర్ ఇంగ్లండ్ చేతిలో టాప్ ర్యాంకర్ టీమిండియా 4-1తో చిత్తుగా ఓడినందుకు…చీఫ్ కోచ్ బాధ్యత వహించాలని పలువురు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. టెస్ట్ తుదిజట్టు ఎంపికలో పొరపాట్లు, వ్యూహాత్మక తప్పిదాలకు కారణం చీఫ్ కోచ్ రవిశాస్త్రి మాత్రమేనని…భారత మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్ తేల్చి చెప్పారు.

ఏడాదికి ఏడున్నర కోట్ల రూపాయలు వేతనం అందుకొంటున్న చీఫ్ కోచ్…ఇక ఎంతమాత్రమూ మాటలతో మాయ చేయలేరని…తనకు ఇష్టమైన క్రికెట్ వ్యాఖ్యానం కొనసాగించాలని సలహా ఇచ్చారు.

భారతజట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరటానికి ముందే…చీఫ్ కోచ్ పదవి నుంచి రవి శాస్త్రి తప్పుకోవాలని కోరారు. భారత మాజీ కెప్టెన్లు వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ సైతం…రవిశాస్త్రి నైతిక బాధ్యత వహించి…పదవి నుంచి తప్పుకోవాలంటే గతంలోనే కొరిన సంగతి తెలిసిందే.

నలువైపుల నుంచి వస్తున్న ఒత్తిడికి రవిశాస్త్రి తలొగ్గుతాడా? లేక.. విమర్శలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆస్ట్రేలియా టూర్ కు సిద్ధమవుతాడా? వేచిచూడాల్సిందే.

First Published:  17 Sep 2018 11:11 AM GMT
Next Story