అసలయిన చిత్రం

          ఒక రాజు కళా ప్రియుడు. కళాకారుల్ని పోషించేవాడు. అద్భుతమయిన చిత్రాలన్నా శిల్పాలన్నా ఆయనకు ఎంతో ఇష్టం. కళాఖండాల్ని సేకరించడం ఆయనకు హాబీ.

          అటువంటి రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఒక గొప్ప చిత్రాన్ని చిత్రించిన వాళ్ళకు లక్షరూపాయలు బహుమతి ప్రకటించాడు. దేశదేశాల నించి ఎందరో చిత్రకారులు వచ్చారు. ప్రాథమిక పరీక్షల అనంతరం ప్రతిభావంతులైన ఇద్దరు చిత్రకారులు మాత్రమే మిగిలారు.

          రాజు వాళ్ళిద్దరికీ సకల సౌకర్యాలు కలిగించాడు. వాళ్ళకు ఆరు నెలల సమయం ఇస్తున్నానని ప్రపపంచంలో సాటి లేని ప్రకృతి దృశ్యాన్ని చిత్రించాలని ఆదేశించాడు. అది ఎలా వుండాలో కూడా చెప్పాడు. నిర్మలాకాశం. నిండు చంద్రుడు, వెన్నెల లోకమంతా వ్యాపిస్తోంది. పర్వతాలపై పచ్చని అరణ్యంపై వెండి వెలుగులు ప్రసరిస్తోంది. ఈ దృశ్యాన్ని చిత్రించాలని, అది సజీవంగా వుండాలని, అది చిత్రించినట్లు కాక ప్రాణవంతంగా వుండాలని అన్నాడు.

          ఒక నిలువెత్తు గోడలు రెండు ఎదురెదురుగా ఉన్నాయి. ఆ రెండు గోడలపై చిత్రకారులు చిత్రించాలని రాజు అన్నాడు. చిత్ర కారులిద్దరూ సరే నన్నారు. ఆ గోడలకు నిలువెత్తు తెరలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎవరికీ ఇబ్బంది కలగకుండా చిత్రకారులు ప్రశాంతంగా చిత్రించవచ్చని, రాజు కలిగించిన అనుకూలాలకు చిత్రకారులు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

          ఆరు నెలలు గడిచాయి. రాజు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూసాడు. రాజుతో బాటు సమస్త నగరజనం ఎదురుచూశారు.

          ఆరోజు రానే వచ్చింది. నగరజనమంతా ఆ చిత్రకారులున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఎందరో రాజు గారి అనుయాయులు, రాజు ఎవరికి ప్రథమ బహుమతి ఇస్తారో లక్షరూపాయలు ఎవరు గెలుచుకుంటారో అని ఉత్సాహంగా ఎదురు చూశారు.

          రాజు సపరివారంగా ఆ పరిసరాలకు చేరుకున్నాడు. మొదటి చిత్రకారుడి గోడకు వున్న తెరను తొలగించారు. ఆ మహా చిత్రకారుడు చిత్రించిన ఆ అపూర్వ చిత్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. నిండుచంద్రుడు, పర్వతాలు, అరణ్యం వీటి మీదుగా వెన్నలసాగి తమందరి మీద ప్రతిఫలిస్తున్నట్లు అందరూ అనుభూతి చెందారు. తప్పక మొదటి చిత్రకారుడు చిత్రించిన చిత్రానికే లక్షరూపాయల బహుమతి అందుతుందని అందరూ భావించారు.

          కానీ అందరికీ రెండో చిత్రకారుడు ఎంత అద్భుతంగా చిత్రించాడో అన్న ఉత్సాహం రేకెత్తింది. స్థాణువయి ఆ చిత్రాన్ని పరిశీలిస్తున్న రాజు తేరుకుని అక్కడినించీ కదిలి ఎదురుగా ఉన్న రెండో గోడ దగ్గరకు వెళ్ళాడు. అందరూ ఉద్వేగంగా ఎదురు చూశారు.

          రెండో తెర తీశారు. కానీ గోడ దగ్గరే నిల్చున్న చిత్రకారుడు. గోడ నిండుగా అద్దం. ఆ అద్దంలో ప్రతి ఫలిస్తున్న మొదటి చిత్రకారుడు వేసిన బొమ్మ. అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆరు నెలలుగా రెండో చిత్రకారుడు చేసిన పని గోడకు అద్దాన్ని అలంకరించడం!

          రాజు అద్దంలో ప్రకృతిని దృశ్యాన్ని పరిశీలించి చిత్రకారుడితో దీని ఆంతర్యమేమిటని ప్రశ్నించాడు.

          రెండో చిత్రకారుడు “మహారాజా! మీరు గొప్ప ప్రకృతి దృశ్యాన్ని చిత్రించమని సెలవిచ్చారు. వివరించారు. కానీ ప్రకృతి దృశ్యమన్నది భగవంతుడు చిత్రించింది. అది అనుక్షణ పరివర్తనా శీలం. మారుతూ ఉంటుంది. మారుతూ ఉన్నదాన్ని మనసుతో పట్టుకోవడమే కష్టం. ఇక అది కుంచెకెలా వొదుగుతుంది. వెన్నెల సాగుతుంది, చెట్లు కదుల్తాయి, పక్షులు పరుగెత్తుతాయి. వీటిని స్థాణువులుగా చిత్రించలేనని నిర్ణయించుకున్నాను. మీరు ఉద్దేశించింది మొదటి చిత్రకారుడు ఎలాగూ చిత్రిస్తాడు, నేను కేవలం సాక్షీభూతుడుగా ఉండ దలచుకున్నాను. అందుకే అద్దాన్ని చిత్రించాను అన్నాడు.

          రాజు ఆనంద భాష్పాలతో వివేకవంతుడయిన ఆ చిత్రకారుణ్ణి ఆలింగం చేసుకున్నాడు.

-సౌభాగ్య