చివరికి శ్రీనివాసరెడ్డిని కూడా వాడేశారు

ప్రముఖుల పేర్లను వాడుకోవడం, వాళ్ల ఫొటోల్ని మార్ఫింగ్ చేసి అడ్డమైన రాతలు రాయడం సోషల్ మీడియాలో నిత్యకృత్యం అయిపోయింది. ఎక్కువగా హీరోయిన్లు, స్టార్ హీరోలు ఈ బాధితుల్లో ఉంటారు. ఇప్పుడీ లిస్ట్ లోకి కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా చేరిపోయాడు.

శ్రీనివాసరెడ్డి పేరుమీద నకిలీ సోషల్ మీడియా ఎకౌంట్ తయారుచేసిన ఓ వ్యక్తి, చాలా మందిని ప్రలోభాలకు గురిచేశాడు. సినిమా ఛాన్సులు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి చాలామందిని మోసం చేశాడు. చివరికి ఈ విషయం శ్రీనివాసరెడ్డి వరకు వెళ్లింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి, ఫిర్యాదు చేశాడు శ్రీనివాసరెడ్డి.

కంప్లయింట్ తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందుతుడ్ని అరెస్ట్ చేశారు. అతడ్ని గతంలో పలువురు దర్శకుల వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన రవికిరణ్ గా గుర్తించారు. ఇతడు శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కొంత సమాచారాన్ని, వ్యక్తిగత ఫొటోల్ని పోస్ట్ చేశాడు. కొన్నాళ్లుగా కొందరితో చాట్ చేయడం స్టార్ట్ చేశాడు. కేరళ వరద బాధితుల్ని ఆదుకోవాలని, 5వేలకు తగ్గకుండా విరాళం ఇవ్వాలని పిలుపునిచ్చాడు. దీంతో రవికిరణ్ చెప్పిన ఎకౌంట్ కు చాలా మంది డబ్బులు పంపించారు. ఎట్టకేలకు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతో రవికిరణ్ గుట్టు రట్టయింది.