జగన్‌ కిందకు డేరా నీళ్లు ఎలా వచ్చాయి?

నాలుగు రోజుల క్రితం వరకు ప్రబోధానందస్వామి అలియాస్ గుత్తి పెద్దన్న చౌదరి గురించి ఆయన భక్తులకు మాత్రమే బాగా తెలుసు. స్థానిక గ్రామస్తులపై ఆశ్రమంలోని వారు రాళ్లు రువ్వి, గాయపరిచి, ట్రాక్టర్లు, ఆటోలు, బైకులు తగలబెట్టిన తర్వాత ఈ ఆశ్రమంలో అసలు ఏం జరుగుతోందన్న దానిపై అందరికీ ఆసక్తి పెరిగింది. తాడిపత్రి గొడవ తర్వాత ప్రబోధానంద వేషాలు, ఆయన చెప్పే బూతు ప్రవచనాలు అన్ని బయటకు వచ్చాయి.

నిజానికి ప్రబోధానంద స్వామికి టీడీపీ పెద్దల నుంచే కావాల్సినంత అండ ఉంది. అనంతపురం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు, ఒకవర్గం పెద్దలు ఈయన్ను తరచూ కలుస్తుంటారు. ఈ మధ్య ఒక సామాజికవర్గ సంఘం ఆధ్వర్యంలో కల్యాణ మండపాన్ని నిర్మించగా అందుకు ప్రబోధానంద అనబడే ఈ పెద్దన్న చౌదరి భారీగా ఆర్థిక సాయం చేశారు. ఈయనకు అధికార పెద్దల అండ ఉంది కాబట్టే… ఆశ్రమంలో తనిఖీకి వెళ్లిన 300 మంది పోలీసులను ఆశ్రమంలోని వారు దాడి చేసి తరిమినా పోలీసులు తిరిగి ఏమీ చేయలేకపోయారు.

టీడీపీ పెద్దల అండ ఉన్నప్పటికీ ప్రబోధానందకు జేసీ బ్రదర్స్‌కు పడడం లేదు. ఇదే సమయంలో వినాయక నిమజ్జనం సందర్భంగా స్థానికంగా ఉన్న రెండు గ్రామాల వారిని ఈ బాబా మనుషులు కొట్టారు. గాయపడిన వారిలో వైసీపీ సానుభూతిపరులు కూడా ఉన్నారు. అయితే తమకు వ్యతిరేకంగా శక్తులు పెరగకుండా, జేసీ బ్రదర్స్‌ను ఒంటరిని చేయడం కోసం బాబా బృందం పావులు కదిపింది. అందులో భాగంగానే ఆశ్రమం వద్ద గొడవ జరుగుతుండగానే జగన్‌ వద్దకు బాబా అనుచరుల బృందం చేరుకుంది. వైసీపీకి, జేసీకి మధ్య ఉన్న వైరాన్ని చక్కగా వాడేసుకుంది. అయితే ప్రబోధానంద గురించి పూర్తిగా తెలియని జగన్ వద్ద ఉండే టీం నేరుగా వారిని అధినేత వద్దకు తీసుకెళ్లింది.

వీరంతా జేసీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని వివరించారు. తన బృందం మాటలు గుడ్డిగా నమ్మేసిన జగన్‌… ప్రబోధానందకు అండగా ఉంటామని ప్రకటించారు. అవసరమైతే బాబాకు అండగా ధర్నాలు చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. జగన్‌ చేసిన ఈ ప్రకటన చూడగానే అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కంగుతిన్నారు. అదేంటి ఇక్కడ ప్రబోధానందను అందరూ డేరా బాబాతో పోలుస్తుంటే తమ అధినేత మాత్రం బాబా కోసం ధర్నాలు చేస్తారనడం ఏమిటని షాక్‌ అయ్యారు.

జగన్ ప్రకటన తర్వాత కొందరు అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ వారు .. జగన్ వద్ద ఉండే వారికి ఫోన్‌ చేసి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వినాయకుడిని, ఏసు ప్రభువును, సీతను, రాముడిని, విష్ణువును బండబూతులు తిడుతూ ప్రబోధానంద చేసిన ప్రసంగాల వీడియోను కూడా జగన్‌ వద్ద ఉండే టీంకు పంపించారు. దీంతో వారు కంగుతిన్నారు. మహిళల సమక్షంలోనే బూతులు మాట్లాడుతూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన ఇతడికా తాము సపోర్టు చేసింది అని కంగుతిన్నారు.

ప్రబోధానందకు టీడీపీ పెద్దల ఆశీస్సుల ఉన్న నేపథ్యంలో వైసీపీ వారు ఎక్కడ ప్రబోధానందకు వ్యతిరేకంగా లైన్‌ తీసుకుంటారో అన్న ఉద్దేశంతో కొందరు టీడీపీ నేతలే జగన్‌ వద్దకు ప్రబోధానంద బృందం వెళ్లేలా చేసి వైసీపీ అధినేతను బోల్తా కొట్టించినట్టు చెబుతున్నారు. ప్రబోధానంద అలియాస్ గుత్తి పెద్దన్న చౌదరి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్న తర్వాత వైసీపీ అధినేత జగన్‌ కూడా మథనపడ్డట్టు చెబుతున్నారు. తన వద్దకు ఇలాంటి వారిని తీసుకొచ్చే ముందు వారు ఎలాంటి వారన్నది ఆరా తీయాల్సిన అవసరం లేదా అని తన బృందానికి కూడా జగన్‌ క్లాస్ పీకినట్టు చెబుతున్నారు. అయితే ఇంత జరిగినప్పటికీ ప్రబోధానంద ఆశ్రమ వివాదం సామరస్యంగానే ముగింపు కావడంతో అనంతపురం జిల్లా వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రబోధానంద వెనుక టీడీపీ పెద్దలు ఉన్నారు కాబట్టి వివాదం ఇలా ముగిసింది కానీ.. ప్రబోధానంద ఒకవేళ టీడీపీ మనిషి కాకపోయి ఉంటే… ఈపాటికి డేరా బాబాలకు జగన్ మద్దతు పలికారంటూ టీడీపీ అనుకూల మీడియా విరుచుకుపడేదని ఒక వైసీపీ నేత అన్నారు.