షో ముగిసింది… బాబు కోర్టుకు వెళ్లడం లేదట..

బాబ్లీ ప్రాజెక్టు ఆందోళనకు సంబంధించిన ఒక సిల్లీ కేసును పట్టుకుని గత వారం రోజులుగా టీడీపీ, దాని అనుకూల మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. అరే నాయనా……. ఒక లాయర్‌ను పంపినా సరిపోతుందని అందరూ చెబుతున్నా… ఈ నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ వెనుక కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం కలిసి కుట్ర చేస్తున్నాయని ప్రచారం చేస్తూ వచ్చారు.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో దాన్ని రాజకీయంగా వాడుకునేందుకు కూడా చంద్రబాబే ధర్మాబాద్‌ కోర్టుకు హాజరవుతారని చెబుతూ వచ్చారు. లోకేష్ కూడా తన తండ్రికి కోర్టులపై గౌరవం ఉందని.. కోర్టుకు హాజరవుతారని చెప్పారు. మీడియా మరో అడుగు ముందుకేసి చంద్రబాబు ధర్మాబాద్‌కు ఎన్ని వాహనాల్లో వెళ్తారు?. ఎంత మంది రైతులు బాబుకు అండగా వస్తారు అంటూ కథనాలు కూడా రాసింది.

కానీ ఇప్పుడు తేలింది ఏమిటంటే… చంద్రబాబు ధర్మాబాద్‌ కోర్టుకు హాజరుకావడం లేదు. తన తరపు న్యాయవాదులను పంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో చంద్రబాబా!… కోర్టుకా!?… అని ఆశ్చర్యపోయి ఉత్కంఠకు లోనైన వారంతా ఇప్పుడు రిలాక్స్‌ కావొచ్చు. అయితే ధర్మాబాద్‌ కోర్టుకు వెళ్లే ఆలోచన చంద్రబాబు తొలి నుంచి కూడా లేదనే చెబుతున్నారు. కోర్టు నోటీసుల కంటే ముందే ఈనెల 23న అమెరికా వెళ్లే పర్యటనపై చంద్రబాబు దృష్టి పెట్టారు.